ఇండియన్ పొలిటికల్ కింగ్ మేకర్-సంజయ్ గాంధీ

- December 15, 2024 , by Maagulf
ఇండియన్ పొలిటికల్ కింగ్ మేకర్-సంజయ్ గాంధీ

భారత దేశ రాజకీయాల్లో యువరాజు అనే పదానికి నూటికి నూరు శాతం అర్హుడైన నాయకుడు సంజయ్ గాంధీ. సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిలా కనిపించే సంజయ్ వల్ల దేశ రాజకీయాలు మలుపు తిరిగాయి అంటే ఇప్పటికి నమ్మలేని వారు చాలా మంది ఉన్నారు. ఎటువంటి రాజ్యాంగ పదవిని చేపట్టకుండానే కింగ్ మేకర్ గా దేశాన్ని పాలించారు. నేడు ఇండియన్ పొలిటికల్ కింగ్ మేకర్ సంజయ్ గాంధీ జయంతి. 

సంజయ్ ఫిరోజ్ గాంధీ అలియాస్ సంజయ్ గాంధీ 1946, డిసెంబర్ 14వ తేదీన ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ దంపతులకు న్యూ ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీ,డెహ్రాడూన్, స్విట్జర్లాండ్ లలో స్కూల్ విద్యను పూర్తి చేసి కొంత కలం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో శిక్షణ పొందారు. ఇంగ్లాండ్ లోని రోల్స్ రాయల్స్ కంపెనీలో అప్రెంటిస్ గా పనిచేశారు. అనంతరం విమానాలు నడపడంలో శిక్షణ తీసుకోవడమే కాకుండా కమర్షియల్ పైలెట్ లైసెన్స్  పొందారు. 

సంజయ్ తాత నెహ్రూ, తల్లి ఇందిరా గాంధీ దేశ ప్రధానులుగా పనిచేయడం వల్ల లేక ఇతర కారణాల వల్ల సంజయ్ కి రాజకీయాల అంటే మొదట్లో ఆసక్తి ఉండేది కాదు. రోల్స్ రాయల్స్ కంపెనీలో అప్రెంటిస్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చి ఢిల్లీ పరిసర ప్రాంతంలో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇదే విషయాన్ని అప్పటి ప్రధాని, తన తల్లి ఇందిరాకి చెప్పగానే ఆమె అందుకు అనుమతించారు. అయితే, ప్రభుత్వంలో ఉన్న బాలారిష్టాలు వల్ల ప్రాజెక్ట్ లేటు కావడాన్ని దగ్గరగా చూడటంతో రాజకీయాల్లోకి రావాలని  సంజయ్ నిర్ణయించుకున్నారు. 

1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వృద్ధ నేతలను కాదని తన కంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా చెప్పుకునే ఏఐసిసి, సిడబ్ల్యుసిలను కాదని సంజయ్ బ్రిగేడ్ పేరుతో సమాంతర కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో ఇప్పటి కాంగ్రెస్ అగ్ర నేతలైన కమల్ నాథ్, ఆనంద్ శర్మ, అంబికా సోని, దివంగత అహ్మద్ పటేల్ వంటి వారు కీలకంగా వ్యవహరించేవారు. 

సంజయ్ మొదట్లో పార్టీ వ్యవహారాల్లో ఉన్నప్పటికి  తనకవసరమైన సమయంలో ప్రభుత్వంతో పనిచేసేవారు. తల్లి ఇందిరా సైతం తన రాజకీయ వారసుడిగా సంజయ్ ని ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రోత్సహించేవారు.ఇందిరా ఎన్నిక చెల్లదంటూ 1974లో అలహాబాద్ హై కోర్టు ఒక్క తీర్పుతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సంజయ్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. పేరుకే ఇందిరా ప్రధానిగా వ్యవహరిస్తున్నా పూర్తి అధికారాలన్ని సంజయ్ చేతిలోనే ఉండేవి, సంజయ్ ను సంప్రదించనిది ఇందిరా ఏ ఫైలు మీద సంతకం పెట్టేది కాదు.  

 1975లో దేశంలో ఎమెర్జెన్సీ రావడానికి పరోక్షంగా సంజయ్ గాంధీనే కారణం అంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షాలు తన తల్లిని న్యాయ వ్యవస్థ ద్వారా అపహాస్యం చేస్తున్నారనే అనుమానంతో ఇందిరా చేత దేశంలో ఎమెర్జెన్సీని విధింపజేశారు. 1975-77 వరకు  ఎటువంటి రాజ్యాంగ పదవిని చేపట్టకుండానే దేశాన్ని పాలించారు సంజయ్. ఈ దశలో సంజయ్ పేరు వింటేనే మంత్రులు, అధికారులు మరియు  విపక్ష నేతలు హడలెత్తిపోయేవారు. సంజయ్ ప్రభుత్వ పరంగా తీసుకున్న అనేక నిర్ణయాలు ఆరోజుల్లో విమర్శలకు తావునిచ్చినా తర్వాతి కాలంలో వాటిని ప్రశంసించారు. 

1975-77 మధ్యలో ఢిల్లీ అభివృద్ధికి నిధుల విడుదల, రెడ్ టేపిజాన్ని అణిచివేతకు చర్యలు మరియు జనాభాను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ దేశవ్యాప్తంగా నూతన స్కూళ్లను ఏర్పాటుకు నిధుల విడుదల, వరకట్నంపై నిషేధం, పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టి లక్షల్లో మొక్కలు నాటడం మరియు దేశంలో అనేక అనర్థాలకు మూలమైన కులాన్ని శాశ్వతంగా నిర్ములించడం, దేశాభివృద్ధికి అడ్డుగా నిలిచే చట్టాలకు మంగళం పాడటం వంటివన్ని సంజయ్ గాంధీ ప్రభుత్వపరంగా తీసుకున్న గొప్ప నిర్ణయాలు. 

ఎమెర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఇందిరా జైలుకు వెళ్లడం మరియు సీనియర్ల వెన్నుపోటు వంటి పలు కారణాలు సంజయ్ ను మానసికంగా శక్తివంతుడిని చేశాయి. కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ వర్గానికి సేనాధిపతిగా 1977-80 మధ్యలో జనతాపార్టీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టడమే కాకుండా అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కుమారుడి అవినీతి వెలికితీత, ఉపప్రధాని జగ్జీవన్ రాం సెక్స్ స్కాండల్ వెలుగులోకి రావడం మరియు కేంద్ర మంత్రుల అవినీతిని బట్టబయలు చేయడం వెనుక సంజయ్ కీలకంగా వ్యవహరించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో సంజయ్ పాత్ర కీలకం. 1979లో దేశాయ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత చరణ్ సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ప్రకటించి ఇందిరా మరియు తనపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయించారు. 

కాంగ్రెస్ పట్ల ప్రజలకు తిరిగి విశ్వాసం కలిగిందని తన అనుయాయులతో చేయించిన సర్వే తెలుసుకున్న సంజయ్, చరణ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి 1980 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ అన్ని విధాలా సన్నద్ధం చేశారు. ఇందిరాను తిరిగి ప్రధాని చేయడమే లక్ష్యంగా ఆ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించారు. గెలవడానికి కావాల్సిన సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో తాను పోటీచేసిన అమేథీ నియోజకవర్గం నుంచి బంపర్ మెజారితో గెలిచి మొదటిసారి లోక్ సభలో అడుగుపెట్టారు. ఇందిరా గాంధీ నాలుగోసారి దేశ ప్రధాని కావడంలో ఆమె చరిష్మా కన్నా సంజయ్ పాత్రే కీలకం. ఒకవిధంగా చెప్పాలంటే తనకు జన్మనిచ్చిన మాతృమూర్తికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి అని చెప్పవచ్చు. 

 సంజయ్ వ్యవస్థల మీద కన్న వ్యక్తుల మీద ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. వ్యక్తుల వల్ల వ్యవస్థల నిర్మాణం జరుగుతుంది తప్పించి, వ్యవస్థల వల్ల వ్యక్తుల నిర్మాణం ఎన్నటికి జరగదని తన సన్నిహితుల వద్ద చెప్పేవారు. అందువల్లే తన హయాంలో ప్రోత్సహించిన యువనేతలే నేడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం కాకుండా కాపాడుతూ వస్తున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సైతం సంజయ్ వల్లే ఇన్నేళ్ల రాజకీయ జీవితాన్ని పొందగలిగారు. 1979లో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న చంద్రబాబుపై నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావు వేసిన అనర్హత వేటును తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్లి సంజయ్ సహాయాన్ని కోరగా, బాబు సామర్థ్యం మీద నమ్మకం ఏర్పడి అనర్హత వేటు నుంచి బాబును రక్షించారు. ఈ ఒక్క ఉదంతంతో సంజయ్ మనిషిగా బాబు మారిపోవడమే కాకుండా, నాటి మంత్రివర్గంలో ప్రాధాన్యత పొందుతూ సుదీర్ఘ రాజకీయ జీవితానికి బాటలు వేసుకున్నారు బాబు. 

సంజయ్ గొప్ప వక్త కాకపోయినా, గొప్ప వ్యూహకర్త! కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీకి అప్రదిష్ఠలు తెచ్చిన బడా నేతలను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. జనతా ప్రభుత్వ హయంలో తన మీదున్న ఆంక్షలను దాటుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహణకు ఆర్థిక వనరుల సమీకరణకు సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆర్థిక సమీకరణ కోసం సంజయ్ ఏర్పర్చిన మార్గాలే ఈ నాటికి కాంగ్రెస్ మనుగడకు పనికొస్తున్నాయి. 

ఇందిరా గాంధీని నాలుగో సారి ప్రధానిని చేశాక ప్రభుత్వం మరియు పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ, తన రాజకీయ పూనాదులను నిర్మించుకుంటున్న దశలోనే తనకిష్టమైన విమానాన్ని నడుపుతూ ఇంజన్ ట్రబుల్ కారణంగా కూలిపోవడంతో 1980,జూన్ 23న తుదిశ్వాస విడిచారు. సంజయ్ మరణించే నాటికి ఆయన వయసు కేవలం 33 ఏళ్ళు మాత్రమే! సంజయ్ ప్రమాదంలో మరణించి ఉండకపోయుంటే తన తల్లి తర్వాత దేశ ప్రధానిగా సుదీర్ఘ కాలం దేశ రాజకీయాలను శాసించేవారు. సంజయ్ మరణించి ఐదు దశాబ్దాలు దాటుతున్నా, ఆయన లాంటి గొప్ప వ్యూహకర్త మరియు నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు దొరకకపోవడం విశేషం.    

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com