టాలీవుడ్ స్టార్ రైటర్-సాయి మాధవ్‌

- December 15, 2024 , by Maagulf
టాలీవుడ్ స్టార్ రైటర్-సాయి మాధవ్‌

'అది కల.. నిద్రలో కనేది. ఇది కళ.. నిద్ర లేపేది', 'బరువు, బాధ్యతలు చూసేవాడికి తెలియదు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది', 'చంపడమో చావడమో ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం'.. ఇలా ఎన్నో సంభాషణలతో రచయితగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయి మాధవ్‌ బుర్రా.బయోపిక్‌, హిస్టారికల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, రొమాంటిక్‌.. ఇలా నేపథ్యం ఏదైనా అలతి పదాలతో డైలాగ్స్‌ రాసి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతుంటారాయన. నేడు టాలీవుడ్ స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ పుట్టినరోజు. 

బుర్రా సాయి మాధవ్ 1973, డిసెంబర్ 16న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆంధ్రా ప్యారిస్ గా ప్రసిద్ధి గాంచిన తెనాలి పట్టణంలో ప్రముఖ   రంగస్థల నటులైన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, జయలక్ష్మి దంపతులకు జన్మించారు. తెనాలిలోని వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్ వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసారు. తల్లిదండ్రులిద్దరూ కళాకారులు కావడంతో చిన్నతనంలోనే నటన పట్ల ఆసక్తి పెంచుకున్నారు. దానికి తోడు తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత, ప్రముఖ సినీ రచయిత స్వర్గీయ బొల్లిముంత శివరామకృష్ణ గారితో వీరి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా స్కూల్లో ఉన్నప్పుడే నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో నాటకాలు వేయడమే కాదు ఎందుకు రాయకూడదు అనే ఆలోచన సాయి గారి మదిలోకి వచ్చింది. ఆ ఫలితమే దాకలమూచి, అద్దంలో చందమామ అనే నాటికలు. అవి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాటక పరిషతలలో బహుమతులు గెలుచుకున్నాయి. నాటక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 

ప్రముఖ దర్శకుడు పీఎన్ రామచంద్రరావు బంధువైన తెనాలికి చెందిన నూతలపాటి సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే చిత్రసీమకు దారి తీసింది. సత్యనారాయణ గారు ఎన్నో సినిమాలకు ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశారు. ఆయనే సాయి గారికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌లో ప్రాథమిక అంశాలు నేర్పించారు. వృత్తిరీత్యా బీజీగా ఉండటంతో ఆయనకు వచ్చిన పలు అవకాశాలను వీరికి  కల్పించారు. అందులో ఒకటి తాళికట్టు శుభవేళ చిత్రం. ఆ సినిమాకు ఘోస్ట్‌రైటర్‌గా పనిచేశారు.  ఆ తర్వాత హైటెక్‌ స్టూడెంట్స్‌ అనే చిత్రానికి పాటలు రాశారు. తొలిసారిగా బుర్రా సాయిమాధవ్‌ అనే టైటిల్‌ కార్డును వెండితెరపై ఈ చిత్రంతోనే చూసుకున్నారు. 

హైదరాబాద్‌లో ఉండే సమయంలో నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయానికి హాస్యనటులు బ్రహ్మానందం కారణం. మధ్యలో కొన్ని సినిమాలకు మాటలు, పాటలు రాసినా అవేవి ఆయన్ని తెలుగు సినిమా పరిశ్రమలో నిలబెట్టలేకపోవడంతో బుల్లితెర సీరియల్స్ కు పనిచేయడం మొదలు పెట్టారు. దర్శకుడు క్రిష్‌గారి తండ్రి సాయిబాబు ఆ సీరియల్‌కు నిర్మాత. ఈ నేపథ్యంలో క్రిష్‌ గారితో పరిచయం ఏర్పడింది. సాయి గారిలోని ప్రతిభను గుర్తించి ‘సాయి మనం కలసి సినిమా చేస్తున్నాం. సీరియల్స్‌ వద్దు’ అని చెప్పారు. తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్‌ సినిమాకు మాటలు రాసే అవకాశమిచ్చారు. అందులోని డైలాగులు విస్తృత గుర్తింపు తెచ్చాయి. ఆ సమయంలో రానా ద్వారా సురేష్‌బాబు గారితో పరిచయం ఏర్పడింది.

సీరియల్స్ కు పనిచేస్తున్న సమయంలోనే నాగబాబు పరిచయం అయ్యారు.  పవనకల్యాణ్‌ గారికి పరిచయం చేసి సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాకు మాటలు రాసే అవకాశం నాగబాబు కల్పించారు. అలా చిరంజీవిగారి కుటుంబానికి దగ్గరయ్యారు. ఇక అక్కడి నుంచి ఇండస్ట్రీలో  వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. టాలీవుడ్ పరిశ్రమలోని అత్యధిక మంది హీరోల చిత్రాలకు సాయి కథ, స్క్రీన్ ప్లే అవసరమైతే పాటలు రాస్తూ ఉన్నారు. ఇటీవల ప్రభాస్ కల్కి చిత్రానికి పనిచేసిన సాయి మాధవ్ గారు ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ 'హరిహర వీరమల్లు', రామ్‌చరణ్‌ ' గేమ్ చేంజర్' చిత్రాలకు పనిచేస్తున్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com