ప్రజా నాయకుడు-కాటూరి

- December 29, 2024 , by Maagulf
ప్రజా నాయకుడు-కాటూరి

కాటూరి నారాయణ స్వామి జీవితాంతం ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావించి రాజకీయాల్లో కొనసాగారు. సంపన్న కుటుంబంలో జన్మించిన కాటూరి, ఏనాడూ ఆడంబరాలకు పోకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేస్తూ వాటికి పరిష్కారం చూపారు.

కాటూరి పెద నారాయణ స్వామి గారు ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదిలి తాలూకా కాటూరివారి పాలెం గ్రామంలోని సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు.(నేడు పొదిలి ప్రాంతం ప్రకాశం జిల్లాలో భాగం)

మెట్రిక్యులేషన్ పూర్తి చేసి వ్యవసాయంలో నిమగ్నమైన వీరూ చిన్నతనంలోనే గాంధీజీ పట్ల అభిమానం పెంచుకున్నారు. ఆయన ఆలోచలకు ప్రభావితం అయ్యి సామూహిక సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనేవారు. అదే సమయంలో రాష్ట్ర రైతాంగ సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు నడుపుతున్న రైతు బాంధవుడు ఆచార్య ఎన్. జి.రంగా గారి పరిచయ ప్రభావంతో తమ ప్రాంత రైతు సమస్యలపై దృష్టి సారించారు.

ఆనాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చివరి ప్రాంతమైన పొదిలిలో అనేక సమస్యలకు నిలయం అంతుచిక్కని వ్యాధులతో అక్కడ పుట్టిన పిల్లలు అంగవైకల్యం బారిన పడేవారు(తర్వాత కాలంలో జరిగిన పరిశోధనల్లో అక్కడి భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందని తేలింది).పుష్కలమైన సాగునీటి వనరుల లేకపోవడంతో పంట దిగుబడి తక్కువగా ఉండేది. అంతే కాకుండా వామపక్ష రాజకీయ ప్రభావం ప్రజలపై ఉండేది.

రంగా గారి అనుచరుడిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాలువ నిర్మాణం పొదిలి వరకు సాగాలని కోరుతూ నారాయణ స్వామి పోరాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన 1955 ఎన్నికల్లో రంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టీ నుండి పొదిలి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి నిరంతరం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలో పలు రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే పొదిలి గ్రామ సర్పంచిగా, భూ తనఖా బ్యాంకు అధ్యక్షుడిగా మరియు నెల్లూరు జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

పొదిలి నియోజకవర్గం నుండి 1962, 1967లలో కాంగ్రెస్ పార్టీ , 1972లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 1978లో అదే నియోజకవర్గం నుండి ఓటమి పాలయ్యారు.

పొదిలి శాసనసభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువల పొడిగింపు, ఫ్లోరైడ్ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు.

నారాయణ స్వామి గారి గురించి విన్న ఎన్టీఆర్ స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి 1983 ఎన్నికల్లో దర్శి టిక్కెట్ ఇచ్చారు. దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణ స్వామి గారు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా ఎన్నికయ్యి ఎన్టీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్టీఆర్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

1984లో జరిగిన ఆగస్టు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ అండగా నిలిచిన వ్యక్తుల్లో ముఖ్యులు నారాయణస్వామి గారు. 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభకు పోటీ చేసి కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డిపై విజయం సాధించడంతో జాతీయస్థాయిలో స్వామి పేరు మారుమ్రోగింది.ఈ ఓటమితో బ్రహ్మానంద రెడ్డి గారి క్రియాశీలక రాజకీయ జీవితం ముగిసింది.

నరసరావుపేట ఎంపీగా నారాయణ స్వామి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. 1989లో ఒంగోలు లోక్ సభ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలగారు. 1994లో ఎన్టీఆర్ పిలిచి మరీ టిక్కెట్ ఇస్తానన్న నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

నారాయణ స్వామి సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికి రాజకీయాల్లోకి వచ్చి ఆస్తుల మొత్తాన్ని కరిగించుకున్నారు. మంత్రిగా, ఎంపీగా ఉన్నప్పటికీ ఒంగోలు నుండి తన స్వగ్రామమైన కాటూరి వారి పాలేనికి బస్సులో వెళ్ళేవారు.క్రియాశీలక రాజకీయాల నుండి విరమించుకున్న తర్వాత నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు.

రాజకీయాల్లో వేగంగా వచ్చిన మార్పులు, బంధుప్రీతి ,ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగడం చూసి తన చివరి రోజుల్లో చాలా వాపోయారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ఆయన బంధుప్రీతి, అవినీతి అక్రమాలకు తావులేకుండా నిష్కళంకమైన ప్రజా సేవకుడిగా నిలిచిపోయారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com