సినిమా రివ్యూ: ‘గేమ్ ఛేంజర్’

- January 10, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘గేమ్ ఛేంజర్’

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సోలో సినిమా ‘గేమ్ ఛేంజర్’. గ్లోబల్ స్టార్‌గా ఎదిగగిన రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు శంకర్ కలయిక అంటేనే అంచనాలు పెంచేసింది. లేట్ అయినా, లేటెస్ట్‌గా సంక్రాంతి సీజన్‌లో రిలీజైన గేమ్ ఛేంజర్’ ఆశించిన అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
రామ్ నందన్ (రామ్ చరణ్) కాలేజీలో చదువుకున్న రోజుల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా కనిపిస్తాడు. తాను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అద్వానీ) కోసం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. అలా ఐపీఎస్ అధికారిగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన రామ్ నందన్.,కష్టపడి ఐఏఎస్ అధికారిగా ఎదుగుతాడు. ట్రాన్స్‌పర్ అయ్యి తన సొంతూరు అయిన విశాఖ పట్టణానికి బదిలి అవుతాడు. అక్కడ అభ్యుదయ పార్టీ నాయకుడు, సీఎం సత్యమూర్తి (శ్రీకాంత్)కి పార్టీ పరంగా, గవర్నమెంట్‌లో కొంత తలనొప్పులు ఏర్పడతాయ్. అదే నేపథ్యంలో సీఎం అనారోగ్యం బారిన పడతాడు. పదవిపై కాంక్షతో ఎలాగైనా  సీఎం కుర్చీ దక్కించుకోవాలని కాచుకుని కూర్చున్న సత్యమూర్తి కొడుకులు మోపిదేవి (ఎస్ జె సూర్య), జయరామ్ ఎత్తుగడలు వేస్తుంటారు. కొత్తగా వచ్చిన కలెక్టర్‌ రామ్ నందన్‌ని, మోపిదేవి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఇంతలో సీఎం సత్యమూర్తి అనూహ్యంగా కలెక్టర్ రామ్ నందన్‌ని సీఎంగా ప్రకటిస్తాడు. కానీ, సీఎం పదవిని కాదనుకుని ఆ పదవిని మోపిదేవికి అప్పగిస్తాడు రామ్ నందన్. అలా సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు కాదనుకోవల్సి వచ్చింది.? అసలు సత్యమూర్తి తన వారసుడిగా రామ్ నందన్‌ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది.? అభ్యుదయ పార్టీ నాయకుడు అప్పన్నతో సత్యమూర్తికి వున్న సంబంధం ఏంటీ.? తన తల్లి దండ్రులైన అప్పన్న, పార్వతిలను రామ్ నందన్ ఎందుకు దూరం చేసుకోవల్సి వచ్చింది.? తనకు దక్కిన  సీఎం పదవిని మోపిదేవికి అప్పగించిన రామ్ నందన్ గేమ్ ప్లాన్ ఏంటీ.? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘గేమ్ ఛేంజర్’ తెరపై చూడాల్సిందే.!

నటీనటుల పనితీరు:
కాలేజీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ యంగ్ ఐపీఎస్ అధికారిగా, ఆ తర్వాత ఐఏఎస్ అధికారిగా, ప్రజా నాయకుడు అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ నటన అధ్భుతం. అన్ని పాత్రల్లోనూ తన లుక్స్‌తో కట్టిపడేశాడు. నట విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత పార్వతి పాత్రలో అంజలి ఉత్తమ నటన కనబరిచింది. తండ్రీ కొడుకుల సన్నివేశాల్లో అంజలి పండించిన భావోద్వేాగాలు సినిమాకి హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. కియారా అద్వానీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ, పాటల్లో అందంగా కనిపించి ఆకట్టుకుంది. మోపిదేవి పాత్రలో కనిపించిన ఎస్ జె సూర్య మరో ఆకర్షణ సినిమాకి. తనదైన నటనతో కోపం తెప్పిస్తూనే.. అక్కడక్కడా నవ్వులు పూయిస్తూ నువ్వా నేనా అన్నట్లుగా చరణ్‌తో పోటీపడి నటించి సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. శ్రీకాంత్ కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించాడు. సునీల్, జయరామ్, సముద్రఖని పాత్రలకు మంచి ప్రాధాన్యతే దక్కింది. మిగిలిన పాత్రధారులు తమదైన పాత్రల్లో పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
సినిమా విజువల్‌గా చాలా బాగుంది. తిరు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. శంకర్ మేకింగ్ విజువల్స్ తెరపై అద్భుతమైన అనుభూతినిస్తాయ్. ఎడిటింగ్ బాగుంది. మాటలు, డైలాగ్స్ బాగా పండాయ్, సినిమా నెక్స్‌ట్ లెవల్‌కి అందుకోవడానికి మరో ప్రధాన సాంకేతిక కారణం తమన్ మ్యూజిక్. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు ఓకే అనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. రా మచ్చ సాంగ్, జరగండి సాంగ్, అరుగు మీద పాటలు విజువల్‌గా చాలా బాగున్నాయ్. ‘నానా హైరానా. పాటకు మొదటి రోజు అవకాశం దక్కలేదు. కానీ, మూడో రోజు నుంచి ధియేటర్లలో యాడ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా సాంకేతిక వర్గం వర్క్ సూపర్బ్. ఇక, దర్శకుడు శంకర్ పని తనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’ తదితర సినిమాల్లో వ్యవస్థ తాలూకు లుక లుకల్ని తన సినిమా ద్వారా ఎత్తి చూపడంలో ఎలాంటి సంచలనాలు నమోదు చేశాడో అందరికీ తెలిసిందే. అలాంటి సంచలనాలే ‘గేమ్ ఛేంజర్’తో చేసే ప్రయత్నం చేశాడు. అందులోనూ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితుల్ని, గత ఎన్నికల టైమ్‌లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో ఆయా పరిస్థితుల్ని రియల్ గేమ్ ఛేంజర్‌గా పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న తీరు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని తాను ఎదిరించిన వైనం తదితర అంశాలు  ఫ్లాష్ బ్యాక్‌లో అప్పన్న పాత్ర ద్వారా జనానికి బాగా కనెక్ట్ చేశాడు. ఎలక్షన్లు జరిగిన తీరు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రభావాల తదితర అంశాల్ని,  ఈ సినిమా ద్వారా ప్రేక్షకుడికి మరోసారి కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.  సామాజిక అంశానికి బలమైన దృశ్య రూపం  ఇవ్వడంలో నిష్ణాతుడైన శంకర్ ‘భారతీయుడు 2’లో కాస్త తడబడ్డాడు ఎందుకో కానీ, ‘గేమ్ ఛేంజర్’‌కి సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్:
రామ్ చరణ్ నటన, రామ్ చరణ్ - అంజలి (తల్లీ కొడుకుల) పాత్రల నడుమ వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, పాటల విజువల్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్.. ఎస్.జె సూర్య నటన, ఇంటర్వెల్ ఎపిసోడ్ తదితర అంశాలు

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా కొన్ని లాజిక్ లేని అంశాలు, ఇసుక దందా, ఎలక్షన్స్ టైమ్‌లో ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలు డ్రమటిక్‌గా అనిపించడం,

చివరిగా:
‘గేమ్ ఛేంజర్’..తెరపై ఈ ‘ఆట’ ఖచ్చిాతంగా ఆకట్టుకుంటుందన్న మాటే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com