తెలుగు భాషా ఉద్యమ పితామహుడు..!

- January 22, 2025 , by Maagulf
తెలుగు భాషా ఉద్యమ పితామహుడు..!

ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా ప్రారంభం కాలేదు. నేడు తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు  వర్థంతి. 

గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. కొండకోనల్లోని గిరిజనుల భాష రామ్మూర్తిని బాగా ఆకట్టుకుంది. 1905లో సవరల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీని కోసం తన సొంత సొమ్మును కూడా ఖర్చుచేశారు. సవర భాషకు గిడుగు చేసిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు, సవర భాష నిఘంటువులు రచించారు. 

1930లో సవర భాషకు వర్ణణాత్మక వ్యాకరణాన్ని రాశారు.గ్రాంథికం కాకుండా మనం మాట్లాడుకొనే భాషే వ్యవహారిక భాషగా ఉండాలని రామ్మూర్తి పంతులు పట్టుబట్టారు. తొలుత గురజాడ, ఏట్స్‌ దొర, శ్రీనివాస అయ్యంగార్‌ లాంటి వాళ్లతో కలిసి పనిచేశారు. గురజాడ మరణించిన తర్వాత ఏకంగా రెండు ద శాబ్దాలకు పైగా ఒంటరి పోరాటమే చేశారారు. ఆ రోజుల్లో ఆయన కుమారుడు సీతాపతే ఆయనకి అండగా నిలిచారు. వ్యవహారిక భాషలోనే గ్రంథ రచన, బోధనా భాషగా కూడా ఉండాలని ఉద్యమరీతిలో ముందుకు సాగారు. తెలుగు సాహిత్యంలో గిడుగుకు అనంత ఖ్యాతిని తెచ్చిన అంశాల్లో ఒకటి సవర భాషకు చేసిన కృషి, రెండోది వ్యవహారిక భాషా సేవ. 

చాళుక్యుల పాలనలో వైదిక మత ప్రచారం కోసం నన్నయ సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించడంతో తెలుగు సాహిత్యం మొదలైంది. అందులో తెలుగు కన్నా సంస్కృతానికే ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. తర్వాత కాలంలో పాల్కురికి సోమనాథుడు, తిక్కన, గోన బుద్ధారెడ్డి తత్సమభాషని బాగా తగ్గించి ఆనాటి తెలుగులో కావ్యాలు రాసి, తెలుగు భాషకు కావ్యగౌరవం కల్పించారు. అయినా శ్రీనాథుని కాలంలో, రాయల కాలంలో కావ్య ప్రబంధాలు మళ్లీ సంస్కృతానికి ప్రాధాన్యం, ఇచ్చి తెలుగు ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. వేమన లాంటి వారు తెలుగును బతికించినా, గిడుగు రామమూర్తి పంతులు రంగప్రవేశం చేసేవరకు గ్రాంధికభాష రాజ్యమేలింది. 

గిడుగు పిడుగు ధాటికి పండిత భిషక్కులు ఉలిక్కి పడ్డారు. జయంతి రామయ్య పంతులు, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి లాంటి గ్రాంధిక భాషావాదులతో గిడుగు పెద్ద యుద్ధమే చేశారు. వారితో నిరంతరం వాదనలు చేస్తూ ‘శిష్టవ్యావహారిక’ భాష అవసరాన్ని, ఆవశ్యకతను, జీవద్భాష ప్రాధాన్యతను నొక్కి వక్కాణించారు.అందుకోసం తన జీవితకాలాన్నే త్యాగం చేశారు. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కోసం ‘తెలుగు’ అనే మాసపత్రికను నడిపారు. గ్రాంధిక భాషను చీల్చి చెండాడుతూ ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం’ అన్న విమర్శాగ్రంథాన్ని రాశారు. 1906 నుంచి 1940 వరకు తెలుగు భాష వ్యాప్తి కోసం అలుపెరుగని పోరాటం చేశారు. 

గిడుగు భాషోద్యమాన్ని గురజాడ, వీరేశలింగం పంతులు, ఏట్స్ దొర లాంటి గొప్ప సృజనకారులు, మేధావులు సమర్థించారు. సహాయ సహకారాలు అందించారు. గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషా ప్రాధాన్యతను వివరిస్తూ అనేక పరిశోధనా గ్రంథాలు రాశారు. ప్రాచీన కావ్యాలను లోతుగా అధ్యయనం చేశారు. ప్రాచీన కావ్యాల్లో ఉన్న వ్యావహారిక భాషను చూపించే ప్రయత్నం చేశారు. ప్రజల వాడుకభాషలో ఉంటేనే సాహిత్యం అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతుందని చెప్పారు. గిడుగు రామమూర్తి పంతులు వ్యావహారిక భాషావాదం లేవనెత్తడంతో తెలుగు కావ్యభాషా స్వరూపం మారిపోయిందని శ్రీశ్రీ అన్నారు. 

సమాజంలోని అట్టడుగు కులాల పట్ల ప్రేమ, సంఘసంస్కరణ పట్ల అభిలాష, జీవద్భాష పట్ల మమకారం, ఆంధ్రదేశం పట్ల ఆత్మాభిమానం, విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణ లాంటి గొప్ప లక్షణాలున్న గిడుగు, తన జీవితంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుకే పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒరిస్సాలో చేర్చడం వల్ల తెలుగు వారికి అన్యాయం జరిగిందని 1936లో రాజమహేంద్రవరం వచ్చేశారు. అక్కడే తన శేషజీవితాన్ని గడిపారు. 

30 ఏళ్ల సర్వీసు పూర్తికాగానే అధ్యాపక వృత్తి నుంచి 1911లో ఆయన స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. సవర భాషకు చేసిన కృషికి గాను 1913లో మద్రాసు ప్రభుత్వం రావు సాహెబ్‌ బహదూర్‌ బిరుదును ఇచ్చి గౌరవించింది. 1919లో గిడుగు తెలుగు అనే మాస పత్రికను స్థాపించారు. సవరులకు గిడుగు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి 1934లో కైజర్‌ ఇ హిందు బంగారు పతకంతో సత్కరించింది. గాంగ వంశీయుల గురించి ఇంగ్లీష్‌లో ఆయన రాసిన ప్రామాణిక వ్యాసాలు మద్రాస్‌ లిటరేచర్‌ జర్నల్‌ ప్రచురించింది. 1936, ఏప్రిల్‌ 1న పర్లాకిమిడిని విడిచి రాజమండ్రికి చేరుకున్నారు గిడుగు. 1938లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైకు తీసుకువెళ్లారు. అక్కడే ఆయన 1940 జనవరి 22న కుమారుడు సీతాపతి ఇంట్లో కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com