ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి: సీఎం రేవంత్
- January 29, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు,అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దేశీయంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పర్యాటక పాలసీలతో పాటు అంతర్జాతీయంగా ప్రముఖమైన పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణకు దేశీయ పర్యాటకులనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటక రంగంలో బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని సీఎం తెలిపారు. ఎంఎన్‌సీలు పెట్టుబడులు పెట్టినప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడతాయని.. అప్పుడు పర్యాటకుల ఆకర్షణ సులవవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.సమ్మక్క-సారక్క, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్య్యూట్‌గా తీర్చిదిద్దాలని, నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ల్లో కేరళ తరహాలో బోటు హౌస్‌ల ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. సమ్మక్క-సారక్క జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సింగపూర్ వంటి దేశాలు తక్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళికలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కైవాక్, సర్య్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అనంతగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపర్చాలని సూచించారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమీక్షలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







