దొర రివ్యూ

- July 01, 2016 , by Maagulf
దొర రివ్యూ

 సినిమా: దొర తారాగణం: సత్యరాజ్‌, శిబిరాజ్‌, బిందుమాధవి, కరుణాకరన్‌, జచేరీ, రాజేంద్రన్‌ తదితరులు ఛాయాగ్రహణం: యువరాజ్‌, సంగీతం: సిద్ధార్థ్‌ విపిన్‌, నిర్మాత: జక్కం జవహర్‌ బాబు, దర్శకత్వం: ధరణీ ధరన్‌. విడుదల: 1-07-2016
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు సత్యరాజ్‌. 'బాహుబలి'తో ఆయన పేరు కట్టప్పగా మారిపోయింది. ఆ గుర్తింపును సద్వినియోగం చేసుకొంటూనే,ఆయన తనయుడు శిబిరాజ్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో భాగంగా 'దొర'గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళంలో తెరకెక్కిన 'జాక్సన్‌ దొరై' తెలుగులో 'దొర'గా విడుదలైంది. ఈ చిత్రం తర్వాత నన్ను దొర అనే పిలుస్తారని చెప్పారు సత్యరాజ్‌. నిజంగా కట్టప్ప పాత్రని మరిచిపోయేంత బలమైన పాత్రా అది? ఇంతకీ దొర ఎవరు? ఎలా ఉంటాడు? తెలుసుకొందాం పదండి...
కథేంటంటే వెయ్యి మంది జనం ఉన్న వూరు దొరపురం. ఆ వూళ్లొ జాక్సన్‌ బంగ్లా అంటే అందరికీ హడల్‌. అందులో ప్రేతాత్మలు ఉన్నాయని, ఆ ఇంట్లోకి ఎవ్వరు వెళ్లినా వెనక్కి తిరిగి రాలేరని చెప్పుకొంటుంటారు. కానీ అక్కడెలాంటి దెయ్యాలు లేవనీ, అదంతా అపోహే అని నిరూపిస్తూ, వూరి జనాల్లో ధైర్యం నూరిపోయడానికని పై అధికారులు ఎస్సై సత్య (శిబిరాజ్‌)ని పంపిస్తారు. వూళ్లొకి అడుగుపెట్టగానే సర్పంచ్‌ కూతురు విజ్జి (బింధుమాధవి)ని చూసి ప్రేమిస్తాడు సత్య. కానీ ఆమెని పెళ్లి చేసుకొనేందుకు విజ్జి మామ కొడుకు వీర (కరుణాకరన్‌) కూడా లైన్లో ఉంటాడు. అయితే జాక్సన్‌ బంగ్లాలోకి వెళ్లి వెనక్కి తిరిగొచ్చిన వాళ్లకే విజ్జిని ఇచ్చి పెళ్లి చేస్తానని సర్పంచ్‌ చెబుతాడు. దాంతో ఆ ఇద్దరూ జాక్సన్‌ బంగ్లాలోకి వెళ్తారు. మరి ఎవరు వెనక్కి తిరిగొచ్చారు? నిజంగానే అందులో దెయ్యాలున్నాయా? అనే విషయాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే? బ్రిటిష్‌ కాలం నాటి ప్రేతాత్మల ప్రతీకార కథతో తెరకెక్కిన చిత్రమిది. సగటు దెయ్యం ఫార్ములాతోనే సినిమా మొదలైనా... బంగ్లాలో చోటు చేసుకొనే సంఘటనలు మాత్రం కొత్తదనాన్ని పంచుతాయి. బ్రిటిష్‌ పాలనపై పోరాటం చేసిన దొర (సత్యరాజ్‌), దొరపురం జనాల్ని ముప్పుతిప్పలు పెట్టిన జాక్సన్‌ (జచేరీ)లు మరణించినా... వాళ్ల మధ్య పగ, ప్రతీకారం మాత్రం సజీవంగానే ఉంటాయి. మరి ఆ ఇద్దరూ ఆత్మలుగా మారాక వారి పోరాటం ఎలా సాగింది? చివరికి గెలుపు ఎవరిది? వాళ్ల ప్రతీకార కథలోకి సత్య ఎలా ప్రవేశించాడు? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. చిన్న కథే ఇది. ప్రేతాత్మలు, వాటిద్వారా ఏర్పడే భయాన్ని వాడుకొంటూ తొలి సగభాగాన్ని నడిపాడు దర్శకుడు. సత్య, వీరలు కలిసి... జాక్సన్‌ బంగ్లాలోకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. దొర, జాక్సన్‌ పాత్రలు తెరపై కనిపించాక ఆ కథ మరింతగా వూపందుకొంటుంది. కానీ కథనంతా బంగ్లాలోని నాలుగు గోడల చుట్టూనే నడపాల్సి రావడంతో సాగదీత ధోరణి కనిపిస్తుంది. హారర్‌ - కామెడీ మేళవింపుగానే ఈ చిత్రం తెరకెక్కినా... దర్శకుడు ఎక్కువగా కామెడీపైనే దృష్టిపెట్టాడు. దీంతో తెరపై ప్రేతాత్మలు కనిపించినా ప్రేక్షకుడు మాత్రం భయపడడు. దెయ్యం కథల్లో లాజిక్‌లు వెదక్కూడదు. ఈ సినిమా కూడా లాజిక్‌కి దూరంగానే సాగుతుంది. దర్శకుడు సినిమాటిక్‌ లిబర్టీని ఎక్కువగా వాడుకొని చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ తరచుగా వస్తున్న దెయ్యం సినిమాలతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. నేపథ్యం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది.
 
ఎవరెలా చేశారంటే? సత్యరాజ్‌ పాత్రతో పోలిస్తే శిబిరాజ్‌ పాత్రకే కథలో ఎక్కువగా ప్రాధాన్యముంది. మొదటి నుంచి చివరి వరకు ఆ పాత్ర తెరపై కనిపిస్తుంటుంది. కానీ శిబిరాజ్‌ ఆ పాత్రని పెద్దగా రక్తి కట్టించలేకపోయాడు. ముఖ్యంగా భావోద్వేగాల పరంగా ఆయన మైనస్‌ అయ్యారు. ప్రతీ సన్నివేశంలోనూ ఒకలాగే కనిపిస్తుంటారు. సత్యరాజ్‌ మాత్రం దొర పాత్రని రక్తికట్టించారు? ప్రేతాత్మగా, బ్రిటిష్‌ పాలకుల్ని ఎదిరించిన నాయకుడిగా చక్కటి అభినయం ప్రదర్శించారు. బిందుమాధవి పాత్రకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యమేమీ లేదు. నల్ల మహేష్‌బాబుగా కనిపించిన హాస్య నటుడు కొన్ని నవ్వులు పండించాడు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. పాడుపడిన బంగ్లాని యువరాజ్‌ సింగ్‌ కెమెరా చక్కగా చూపించింది. సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం పర్వాలేదు. కథలో మరింత వినోదం పండిచేందుకు, మరింత భయం పుట్టించేందుకు ఆస్కారమున్నా దర్శకుడు ఆ విషయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. కథనం రాసుకొన్న విధానం బాగుంది.
బలాలు + కథ + సత్యరాజ్‌ + ఫస్ట్ ఆఫ్‌
బలహీనతలు - శిబిరాజ్ - సెకండ్ ఆఫ్‌
చివరిగా: కొత్త నేపథ్యంతో కూడిన ప్రేతాత్మల కథ గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com