ఏపీలో కూడా కులగణన చేపట్టాలి: వైఎస్ షర్మిల

- February 04, 2025 , by Maagulf
ఏపీలో కూడా కులగణన చేపట్టాలి: వైఎస్ షర్మిల

అమరావతి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని.. ఇదో చారిత్రాత్మక ఘట్టమని.. ఈ సర్వే యావత్ భారతవనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసించారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన.. బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం అన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతుందన్నారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని.. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయాలని.. మనమెంతో మనకంతా అన్నట్టుగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాల్లో వారి వాటా వారికి దక్కాలని జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని షర్మిల డిమాండ్ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా, బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టి, బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని విమర్శించారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే, రిజర్వేషన్లు రద్దుకు కుట్ర పన్నుతుందని బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని, వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని చంద్రబాబును కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com