ముందస్తు జాగ్రత్తల ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు: సీపీ సుధీర్ బాబు

- February 08, 2025 , by Maagulf
ముందస్తు జాగ్రత్తల ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: ఇటీవల తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న  నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో విపత్తు నిర్వహణ కొరకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు మరియు నష్ట నివారణ కొరకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యల గురించి అవగాహనా కల్పించారు. అందులో భాగంగా కమిషనర్ సుధీర్ బాబు రాచకొండ కార్యాలయంలో రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు కమిషనరేట్ పరిధిలోని అందరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ చర్యల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పెట్రోలియం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ బృంద ప్రతినిధులు తాము పాటించే విపత్తు నిర్వహణ విధానాల గురించి వివరించారు. 

ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు అనేవి ఆకస్మాత్తుగా సంభవించేవని, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జరిగే ప్రాణనష్టం మరియు ఆస్తినష్టం అత్యధికంగా ఉంటుందని పేర్కొన్నారు. కర్మాగారాల్లో, పారిశ్రామిక వాడల్లో అకస్మాత్తుగా జరిగే అగ్నిప్రమాదాలను అదుపు చేయడంలో  సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరియు విపత్తు నిర్వహణ బృందాలకు సత్వరమే సమాచారం అందించకపోవడం వల్ల నష్టం మరింతగా పెరుగుతోందని తెలిపారు. పారిశ్రామిక వాడల్లో జరిగే బాయిలర్ పేలుళ్ల వల్ల సమీప కర్మాగారాలకు మంటలు అంటుకోవటంతో ప్రాణనష్టం, ఆస్థినష్టం అధికంగా జరుగుతోందని అన్నారు. పెట్రోలియం కర్మాగారాల్లో జరిగే ప్రమాదాలు మరియు పెట్రోలియం ఉత్పత్తులను ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే సమయంలో జరిగే రోడ్ల ప్రమాదాలలో సంభవించే అకస్మాత్తు భారీ అగ్నిప్రమాదాల వల్ల సామాన్య ప్రజల వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో పాటు భారీస్థాయిలో ట్రాఫిక్ జామ్ వంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

సంఘటనా స్థలానికి వీలైనంత తక్కువ సమయంలో చేరుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని కాబట్టి అధికారుల స్పందన వేగంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో అత్యవసర విపత్తు నిర్వహణలో పాల్గొనే సిబ్బంది తగిన జాగ్రత్తలు మరియు శిక్షణ తీసుకోకపోవడం వల్ల వారు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని కాబట్టి వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.విపత్తు నిర్వహణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని, అధికారులు తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు అంతర్గత శిక్షణ కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించారు.పెట్రోలింగ్ వాహనాల్లో విపత్తు నిర్వహణ కిట్లను అందుబాటులో ఉంచాలని, విపత్తు నిర్వహణ మరియు అగ్ని మాపక సేవల శాఖ ద్వారా రాచకొండ పరిథిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్ లు మరియు ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి విపత్తు నిర్వహణ ప్రమాణాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ మల్కాజ్గిరి పద్మజ, డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్,డిసిపి క్రైమ్ అరవింద్ బాబు,డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్ఓటి 1 రమణారెడ్డి, ఎస్బి డిసిపి నరసింహారెడ్డి,డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, డిసిపి అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, ఏసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్, ఏసిపి సి.సి.ఆర్.బి రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com