ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

- February 16, 2025 , by Maagulf
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం మారిందనే అపోహతో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, 5 మంది చిన్నారులు ఉన్నారు.ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నెంబర్ 14 పైకి వస్తుందని, రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుందని తొలుత అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, రాత్రి 9:55 గంటలకు ఈ రైలు మరో ప్లాట్‌ఫాం పైకి మారిందనే ప్రచారం జరిగింది. ఈ ట్రైన్‌కు 1500 జనరల్ టికెట్లు అమ్మినందున పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై వేచి ఉన్నారు.అదే సమయంలో, స్వతంత్రతా సేనాని ఎక్స్‌ప్రెస్ (14వ ప్లాట్‌ఫాం) మరియు భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (13వ ప్లాట్‌ఫాం) రైళ్లు ఆలస్యంగా ఉండటంతో ఇప్పటికే అక్కడ భారీ రద్దీ నెలకొంది. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం మారిందనే వార్త రావడంతో ప్రయాణికులు మెట్లవైపు పరుగులు తీశారు. రైలు మిస్ అవుతుందన్న భయంతో ఒక్కసారిగా జనం గుమిగూడడంతో తోపులాట పెరిగింది. దీంతో అనేక మంది కిందపడిపోయారు, వారిని ఇతరులు తొక్కుతూ వెళ్లారు.

ప్రభుత్వం చర్యలు, పరామర్శ
ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

ఈ క్రమంలోనే పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు స్పృహ తప్పి పడిపోయినట్లు పేర్కొన్నారు. ఇక సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇక ఘటనా స్థలంలో బట్టలు, బ్యాగులు, చెప్పులు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులున్నాయి , వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రమాదం రైల్వే స్టేషన్లలో సరైన ప్లాన్, స్పష్టమైన సమాచారం అందకపోతే ఎంతటి విపత్తు సంభవిస్తుందో నిరూపించింది. ప్రయాణికులకు సమయానుకూలమైన సమాచారం అందించకపోవడం, రద్దీ నిర్వహణలో వైఫల్యం ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నివారించేందుకు రైల్వే అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com