గుజరాత్ జాతిపిత-ఇందూలాల్ యాగ్నిక్

- February 22, 2025 , by Maagulf
గుజరాత్ జాతిపిత-ఇందూలాల్ యాగ్నిక్

ఇందూలాల్ యాగ్నిక్ ....స్వాతంత్ర భారతావనిలో పశ్చిమ ప్రాంత ప్రజల గొంతుకగా నిలిచిన మహానాయకుడు. స్వాతంత్య్ర ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలోనే రైతాంగ సంక్షేమం కోసం నడుంబిగించిన నాయకుల్లో యాగ్నిక్ ఒకరు.గుజరాతీ ప్రజల కోసం  గుజరాత్ రాష్ట్ర ఏర్పాటుకు యాగ్నిక్ ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించారు.వామపక్ష సామ్యవాద భావజాలాన్ని గాంధేయ మార్గంలో భావ ప్రసరణ చేసారు. నేడు గుజరాత్ జాతిపిత ఇందూలాల్ యాగ్నిక్ జయంతి.

ఇందూలాల్ యాగ్నిక్ పూర్తి పేరు ఇందూలాల్ కన్నయ్య లాల్ యాగ్నిక్. 1892,ఫిబ్రవరి 22న అవిభక్త బొంబాయి రాష్ట్రంలో భాగమైన సౌరాష్ట్ర ప్రాంతంలోని పురాతన పట్టణమైన నాడియడ్ పట్టణంలో కన్నయ్య లాల్ యాగ్నిక్, మణిగౌరి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. స్వస్తలంలోనే మెట్రిక్యులేషన్ వరకు పూర్తి చేసిన తర్వాత అహ్మదాబాద్‌లోని గుజరాత్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అనంతరం బొంబాయి(ముంబై) నగరంలోని సెయింట్‌ జేవియర్స్ కాలేజీలో బీఏ, బొంబాయి యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు.

యాగ్నిక్ చిన్నతనం నుంచే జాతీయ భావాలను కలిగి ఉండేవారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే అరబిందో ఘోష్, బిపిన్ చంద్రపాల్ మరియు అనిబిసెంట్ రచనలు చదివి వారి పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. స్వతహాగా రచయితల కుటుంబం నుంచి రావడం, గుజరాతి, ఆంగ్ల సాహిత్యాన్ని చిన్నతనంలోనే అవపోస పట్టడంతో ఆయనకు రాయడంలో తిరుగులేకుండా పోయింది. కళాశాల సమయంలోనే పలు పత్రికలకు రాస్తూ ఉండేవారు. ఆయన ఆరోజుల్లో యువతను బాగా ఆకట్టుకునేవి. ఇదే సమయంలో ఆయనకు తన మాతృభాషకు కె.యం. మున్షి, జమ్నాదాస్ ద్వారకాదాస్, శంకర్ లాల్ బంకర్ వంటి జాతీయ వాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

యాగ్నిక్ లా చదివినప్పటికి అటువైపు వెళ్లకుండా పాత్రికేయుడిగానే తన ప్రయాణాన్ని సాగించారు. గుజరాతీ భాషలో నవజీవన్ ఆనే సత్య మరియు యుగధర్మ మరియు ఇంగ్లీషులో యంగ్ ఇండియా పత్రికలను నడిపారు. ఇవే కాకుండా గుజరాతి దినపత్రిక హిందూస్తాన్ మరియు ఇంగ్లిష్ పత్రిక " థి బాంబే క్రానికల్" పత్రికల సంపాదక వర్గంలో పనిచేసారు.

పాత్రికేయ రంగంలో ఉంటూనే అనిబిసెంట్ ప్రభావంతో ఆమె నడిపిన హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోని స్వాతంత్య్ర పోరాటంలో భాగమయ్యారు. గోపాల కృష్ణ గోఖలే నేతృత్వంలోని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యత్వం తీసుకోని ఆ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1918లో ఖేడా సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన కులనిర్ములనకు కోసం అహర్నిశలు కృషి చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం పట్ల మొగ్గుచూపడంతో పాటు బొంబాయి కాంగ్రెస్ కార్యవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

 కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి వామపక్ష భావజాలం పట్ల అంతే ఆసక్తి చూపేవారు. యూరోప్ వామపక్ష మేధావులతో ఉత్తరాల ద్వారా వారితో సంప్రదింపులు జరిపారని చరిత్రకారులు పేర్కొంటారు. 1928 పటేల్ నాయకత్వంలో జరిగిన బోర్డాలి సత్యాగ్రహం విజయవంతం అయిన నాటి నుండి రైతాంగ సమస్యల పట్ల దృష్టి సారించారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ విభాగంలో పనిచేస్తున్న సమయంలోనే రైతుల కోసం ఒక ప్రత్యేక వేదిక అవసరం ఉందని గుర్తించి, అందుకు తగ్గట్లు జాతీయస్థాయిలో అన్ని ప్రాంతాల రైతు నాయకులతో చర్చలు మరియు సమావేశాలు నడిపారు.

యాగ్నిక్, స్వామి సహజానంద, ఆచార్య రంగా మరియు ఇతర నేతలు కలిసి 1936లో లక్నో కేంద్రంగా అఖిల భారత కిసాన్ సభను స్థాపించారు. ఆ సంఘం తరపున యాగ్నిక్ కార్యదర్శిగా ఉంటూ పశ్చిమ భారత ప్రాంతంలోని బొంబాయి రాష్ట్రంలో పలు రైతు ఆధారిత పోరాటాలకు నాయకత్వం వహించారు. 1939లో గుజరాత్ కిసాన్ సభను స్థాపించి రైతు ఆందోళన ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో ఉన్నప్పటికి కిసాన్ సభ కార్యక్రమాలను తన అనుచరుల ద్వారా పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. అయితే, జాతీయ స్థాయిలో ఉన్న కిసాన్ సభ కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్లడంతో యాగ్నిక్ ఆ సంస్థతో పరోక్ష బంధాలను కొనసాగించలేకపోయారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత నాటి సమాజంలో ఉన్న సాంఘిక రుగ్మతలను నివారించేందుకు ఇందూలాల్ యగ్నిక్  కృషి చేయడం మొదలుపెట్టారు. సమాజాభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తున్న సామాజిక అంతరాల మీద పోరాడుతూ వచ్చారు. ఇదే సమయంలో గాంధీ ఆలోచనల్లో భాగమైన గాంధేయవాద అస్పృశ్యత నివారణ మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యా మరియు ఉద్యోగాల్లో సమానమైన అవకాశాలు దక్కాలని నినదిస్తూ వచ్చారు. ఆయన స్పూర్తితో గుజరాతి రాజకీయ నాయకులు సైతం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి యాగ్నిక్ పూర్తిగా సామ్యవాదం నుంచి బయటపడి గాంధేయవాదిగా మారిపోయారు. 1947-56 వరకు ఆయన రాజకీయాలకు దూరంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. 1955లో భాషా ఆధారితంగా దేశంలో రాష్ట్రాల విభజన జరుగుతున్న తరుణంలో అనాదిగా బొంబాయిలో రెండో తరగతి ప్రజలుగా వివక్షకు గురవుతున్న గుజరాతి ప్రజలకు సైతం ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదాన్ని యాగ్నిక్ మొదలుపెట్టారు. 1956లో మహాగుజరాత్ జనతా పరిషత్ పేరుతో గుజరాత్ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పరిషత్ 5 లోక్ సభ స్థానాలను, 30 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని నాటి ప్రధాని నెహ్రూను ఆశ్చర్యపరిచారు. అదే ఎన్నికల్లో అహ్మదాబాద్ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.  

యాగ్నిక్ ఉద్యమం వల్ల జరిగిన నష్ట నివారణను తగ్గించే క్రమంలో నెహ్రూ బొంబాయి రాష్ట్ర విభజనకు పూనుకున్నారు.1960, మే 1వ తేదీన బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా ఏర్పరిచారు. గుజరాత్ రాష్ట్ర సాధనకు శ్రమించిన ఇందూ యాగ్నిక్ పేరు ప్రఖ్యాతలు శిఖారంతానికి చేరుకున్నాయి. 1962,1967,1972లలో సైతం అహ్మదాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

యాగ్నిక్ పాత్రికేయ రంగంలో ఉన్న సమయం నుంచే పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు. ఆయన జీవిత కాలంలో 15 పుస్తకాలను రాయగా, అవన్ని మాతృబాష గుజరాతీలోనే కావడం విశేషం. గుజరాతి భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. బొంబాయి రాష్ట్రంలో గుజరాతి భాష పరిరక్షణకు గుజరాతి సాహిత్య పరిషత్, గుజరాతి రంగస్థల సమాజం సంస్థలను ఏర్పాటు చేశారు.

ఐదున్నర దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఉత్థానపతనాలు చవిచూసినప్పటికి యాగ్నిక్ చివరి శ్వాస వరకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు.రాజకీయాల్లో అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాడిన తొలితరం నేతల్లో యాగ్నిక్ ఒకరు. సామాన్య కుటుంబాల నుంచి రాజకీయ నేతలు రావాలని కోరుకున్నారు.గుజరాత్ జాతిపితగా నిలిచిన ఇందూలాల్ యాగ్నిక్ 1972, జూలై 17న తన 80వ ఏట అహ్మదాబాద్‌లో మరణించారు.

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com