సిక్కోలు సింహం-ఎర్రన్నాయుడు
- February 23, 2025
కింజరాపు ఎర్రన్నాయుడు .. భారతదేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన తెలుగు నేతల్లో ఒకరు. ఉత్తరాంధ్ర ప్రధాన ద్వారమైన సిక్కోలు జిల్లాలోని ఓ మారుమూల చిన్న కుగ్రామానికి చెందిన ఎర్రన్న దేశ రాజకీయాల్లో తదైన బాణిని పలికించారు.అన్న ఎన్టీఆర్ పిలుపు అందుకోని తెదేపా తరపున రాజకీయ రంగప్రవేశం చేసిన ఎర్రన్న చివరి శ్వాస వరకు ఆ పార్టీతోనే నడిచారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న నారా చంద్రబాబుకు అంతరంగికుడిగా పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉంటూ వచ్చారు. నాలుగు పర్యాయాలు ఎమ్యెల్యేగా, నాలుగు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన ఎర్రన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నేడు సిక్కోలు సింహం కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణంపై ప్రత్యేక కథనం..
కింజరాపు ఎర్రన్నాయుడు 1957, ఫిబ్రవరి 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని హరిశ్చంద్రపురం తాలూకా నిమ్మాడ గ్రామంలో కింజరాపు దాలి నాయుడు, కళావతమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గార గ్రామంలో, ఇంటర్మీడియట్ టెక్కలిలో, విశాఖలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ కళాశాలలో డిగ్రీ మరియు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.
ఎర్రన్నాయుడు కుటుంబం తోలి నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేది. ఎర్రన్న బాబాయి కృష్ణమూర్తి నాయుడు హరిశ్చంద్రపురం నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి దాలి నాయుడు సైతం గ్రామ రాజకీయాల్లో పెద్దగా వ్యవహరించేవారు. తండ్రి, బాబాయిల స్పూర్తితో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా వెంకయ్య నాయుడు నాయకత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు.
విద్యార్థి దశ తర్వాత కొంతకాలం నిమ్మాడ గ్రామంలో వ్యవసాయం చేస్తూ గడిపారు. 1982లో అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1984 ఆగస్టు సంక్షోభ సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ సీనియర్లు నాదెండ్ల పక్షాన ఉంటే ఎర్రన్న ఎన్టీఆర్ వైపు నిలబడి ఎన్టీఆర్ విశ్వాసాన్ని పొందారు. 1985లో అదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండో సారి ఎన్నికయ్యారు.
1989లో శ్రీకాకుళం జిల్లా పార్టీ నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కారణంగా ఎర్రన్నకు, గౌతు శివాజీకి పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఆ ఎన్నికల్లో ఇరువురూ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి మూడో సారి విజయం సాధించారు. ఆ తర్వాత తిరిగి పార్టీలో చేరారు. చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి హరిశ్చంద్రపురం నుంచి ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తెదేపా తరపున అసెంబ్లీలో 1994-95 వరకు అసెంబ్లీ చీఫ్ విప్ బాధ్యతలు నిర్వహించారు.
1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఏడాది కేంద్రంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 1996-98 వరకు పనిచేశారు. కూటమిలో కీలకమైన పాత్ర పోషించిన చంద్రబాబు ప్రతినిధిగా ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ప్రస్థానం మొదలైంది. 1998, 1999 మరియు 2004లో శ్రీకాకుళం నుండే వరసగా ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 వరకు ఎన్డీయే కూటమిలో తెదేపా కీలకమైన భాగస్వామిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి అవసరమైన నిధులను రాబట్టేందుకు ఎర్రన్న కీలకంగా కృషి చేశారు.
2004లో రాష్ట్రంలో తెదేపా అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ సర్కార్ హయాంలో తెదేపా నేతలపై జరుగుతున్న దాడులను పార్లమెంట్ వేదికగా ఎర్రన్న ఖండించారు. జాతీయ స్థాయి అంశాల చర్చల్లో సైతం తెదేపా తరపున మాట్లాడుతూ వచ్చారు. 2009లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 2009-12 వరకు తెదేపా కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు.
మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతి నిజాయితీ లే ఆరో ప్రాణంగా బ్రతికిన ఎర్రన్న నవంబర్ 2, 2012 న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







