నేచురల్ స్టార్-నాని

- February 24, 2025 , by Maagulf
నేచురల్ స్టార్-నాని

‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది.తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు. మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడనీ చాలామంది అంటారు. అందుకే కాబోలు జనానికి ఇట్టే కనెక్ట్ అయిపోయాడు అనిపిస్తుంది.

నాని కటౌట్ లో పెద్ద స్పెషాలిటీ ఏమీ ఉండదు. అయితే అతని రూపురేఖలు మాత్రం నాని మనోడే అనేలా ఉంటాయి. అందుకనే జనం కూడా మనోడి సినిమా ఓ సారి చూస్తే పోలా అంటూ నాని సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు..’అష్టాచెమ్మా’తో మొదలయిన నాని నటన, మొన్నటి ‘సరిపోదా శనివారం’ దాకా జనాన్ని అలరిస్తూనే ఉంది. ప్రతి చిత్రంలో ఏదో ఒక వైవిధ్యం కోసం తపించాడు నాని. ఆ తపనలోనే విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ విలక్షణమే జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాజమౌళి సినిమాలో చిన్న వేషం వేసినా చాలు అనుకొనేవారు ఎందరో ఉన్నారు. నానిలోని టాలెంట్ ను గుర్తించి తన ‘ఈగ’ చిత్రంలో ప్రధాన పాత్రనే అందించారు రాజమౌళి. ఇంకేముంది, ‘ఈగ’తో నాని స్టార్ డమ్ కూడా రివ్వున పైకి దూసుకుపోయింది.. తనకు లభించిన స్టార్ డమ్ ను నిలుపుకోవడానికి నాని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు… వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నాడు… అదే అందరిలోకి నానిని భిన్నంగా చూపిస్తోంది. అక్కడ నుంచీ వైవిధ్యంతోనే సాగుతూ వచ్చాడు నాని.

విజయాలు పలకరించగానే నాని పులకరించిపోయాడు. వెండితెరపై వెలిగిపోవడమే కాదు, నిర్మాతగానూ అలరించాలని తపించాడు. ప్రథమ ప్రయత్నంగా ‘అ!’ అనే చిత్రాన్ని నిర్మించాడు. టైటిల్ లో వైవిధ్యమున్నట్టే సినిమాలోనూ అది కనిపించేలా చేశాడు. ఆ తరువాత విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ తీసి టైటిల్ జస్టిఫికేషన్ చేశాడు. నిర్మాతగానూ నాని తన అభిరుచిని చాటుకోవడానికి ఈ రెండు చిత్రాలు ఉపయోగపడ్డాయి.

ఒక మంచి కథ దానికి తగిన కథనం వినసొంపైన పాటలు.. టికెట్ కొన్న ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్.. ఇదే నాని ఒక సినిమా చేయడానికి చూసే ప్రధాన అంశాలు. అంతేకాదు నూతన దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు నాని. ప్రతిభ గల దర్శకులను పరిశ్రమకు పరిచయం చేస్తూ పరిశ్రమకు కూడా సాయం చేస్తున్నాడు నాని.అంతేకాదు ఎక్కడ లాభపడ్డామో అక్కడే ఇన్వెస్ట్ చేయాలని హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారి సక్సెస్ ఫుల్ సినిమాలు అందిస్తున్నాడు నాని.

ఛాన్స్ ఉన్నంత వరకు ఏడాదికి రెండు కనీసం ఒక సినిమా అయినా చేస్తూ అష్టా చమ్మతో మొదలైన నాని సినీ ప్రయాణం సరిపోదా శనివారం వరకు వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు. ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్న నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్‌ని కూడా లైన్‌లో పెట్టాడు. వైవిధ్యమే ఆయుధంగా సాగుతున్న నాని మరిన్ని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని మా గల్ఫ్ మనస్పూర్తిగా కోరుకుంటుంది.
 
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com