నట దిగ్గజం-ముక్కామల

- February 28, 2025 , by Maagulf
నట దిగ్గజం-ముక్కామల

నిటారైన విగ్రహం, నటనలో నిగ్రహం, వాచకంలో వైవిధ్యం వెరసి ముక్కామల కృష్ణమూర్తిని విలక్షణ నటునిగా నిలిపాయి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల.హీరోగా, విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన. తెలుగువారి హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించారు ముక్కామల. నేడు సీనియర్ నటుడు ముక్కామల జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రయాణం మీద ప్రత్యేక కథనం... 

ముక్కామలగా సూపరిచితులైన ముక్కామల కృష్ణమూర్తి 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు, తల్లి సీతారావమ్మ. ముక్కామల కన్నవారికి సైతం కళలంటే మక్కువ ఎక్కువ. బాల్యంలోనే ముక్కామల ఇంటనే పలు పుస్తకాలు చదివి మన పురాణాలు, ఇతిహాసాలపై పట్టు సాధించారు. చదువుకొనే రోజుల్లో నాటకాలు వేస్తూ సాగారు.

‘బొబ్బిలియుద్ధం’ నాటకంలో బుస్సీ దొరగా నటించి అనేక మార్లు జేజేలు అందుకున్నారు ముక్కామల. నాటకాలపై ఎంత ఇష్టమో, చదువుపై కూడా అంత శ్రద్ధ ఉండేది. న్యాయశాస్త్రంపై అభిమానంతో లా చదివారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకాలలోనూ నటించి ఆనందించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లోనే షేక్స్ పియర్ నాటకాలు వేసి అలరించారు. ఆయనకు టెన్నిస్ ఆటలోనూ మంచి ప్రావీణ్యముంది. 

చదువయ్యాక దర్శకులు పి.పుల్లయ్య వద్ద అసిస్టెంట్ గా చేరారు. 1945లో పి.పుల్లయ్య తెరకెక్కించిన ‘మాయామచ్చీంద్ర’ చిత్రంలో గోరఖ్ నాథ్ గా నటించారు ముక్కామల. అదే ఆయన తొలి చిత్రం. తరువాత నటనపైనే మనసు లగ్నం చేసి “లైలా మజ్ను, స్వప్నసుందరి, ప్రేమ, ధర్మదేవత, రేచుక్క” చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. 1951లో హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన ‘నిర్దోషి’లో నాయకునిగానూ నటించారు. తానూ హీరోగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంతో స్వీయ దర్శకత్వంలో ‘మరదలు పెళ్ళి’ అనే చిత్రం నిర్మించి, నటించారు. తెలుగునాట డిటెక్టివ్ మూవీగా తెరకెక్కిన తొలి చిత్రంగా ‘మరదలు పెళ్ళి’ నిలచింది. 1961లో గీతా పిక్చర్స్ నిర్మించిన ‘ఋష్యశృంగ’ చిత్రానికీ ముక్కామల దర్శకత్వం వహించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దాంతో నటనలోనే రాణించే ప్రయత్నం చేశారు. 

ఆ రోజుల్లో ప్రతిభ ఉన్న నటీనటులకు పలు చిత్రాలలో నటించే అవకాశాలు లభించేవి. కారణం అప్పట్లో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు రూపొందేవి. అలా ముక్కామల సైతం పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మాయాబజార్’, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రాల్లో దుర్యోధనునిగా, ‘జగదేకవీరుని కథ’లో మహారాజుగా, ‘సత్య హరిశ్చంద్ర’లో విశ్వామిత్రునిగా నటించి ఆకట్టుకున్నారు ముక్కామల. ఎన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన అనేక సాంఘిక చిత్రాలలో కీలక పాత్రలు ధరించి మెప్పించారు. 

ఎన్టీఆర్ తన సొంత చిత్రాలలో ముక్కామలకు ఏదో ఒక ప్రధాన పాత్ర ఇచ్చేవారు. అలా “గులేబకావళి కథ, శ్రీక్రిష్ణ పాండవీయం, ఉమ్మడికుటుంబం, దానవీరశూర కర్ణ, డ్రైవర్ రాముడు, శ్రీమద్విరాట పర్వము, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర” చిత్రాలలో కీలక పాత్రలు ధరింప చేశారు. బాపు దర్శకత్వంలోనూ ముక్కామల పలు చిత్రాలలో నటించారు. చివరి దాకా నటనలో సాగుతూనే ముక్కామల 1987 జనవరి 10న తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనా తన నటనతో అనేక పాత్రలకు జీవం పోసిన ముక్కామల జనం మదిలో చిరస్థాయిగా నిలిచారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com