భీమవరం బుల్లోడు-సునీల్

- February 28, 2025 , by Maagulf
భీమవరం బుల్లోడు-సునీల్

తెలుగులో మన తరానికి బ్రహ్మానందం తరువాత ఎవరిని చూస్తే నవ్వొచ్చేస్తుంది అంతే ఒకప్పుడు సునీల్ పేరే చెప్పేవాళ్లం.అందాల రాముడు సినిమాతో సునీల్ హీరో కాక ముందు వరకు ఎన్నో చిత్రాలలో కామిడీని పండించి మనల్ని కడుపుబ్బ నవ్వించారు.ఒకరకంగా చెప్పాలి అంటే కొన్ని సినిమాలు సునీల్ వల్లే హిట్ అయ్యాయి అంతే కూడా అతిశయోక్తి లేదు. సొంతం మరియు నువ్వు నేను లాంటి చిత్రాలలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ కి ఈక్వల్ గా సునీల్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ తో ఆ సినిమాల రేంజ్ ని పెంచారు డైరెక్టర్స్. ఇక ఆ తరువాత కొద్ది రోజులు హీరోగా చేసిన సునీల్ ఈ మధ్య పుష్పా సినిమాతో విలన్ గా మారి కూడా మనల్ని భయపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తో అల్లరిస్తున్న సునీల్ గురించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం… 

సునీల్ పూర్తి పేరు ఇందూకురి సునీల్ వర్మ. 1974 ఫిబ్రవరి 28న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించారు.చిన్నతనం నుంచీ ఇతరులను ఇమిటేట్ చేస్తూ అలరించేవారు సునీల్. కాలేజ్ లోనూ తన అభినయంతో ఆకట్టుకున్నారు.నేటి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ కాలేజ్ లో మంచి స్నేహితులు.అక్కడ నుంచే వారిద్దరూ చిత్రసీమలో రాణించాలని కలలు కన్నారు.

ఒకప్పుడు హాస్యనటుడు పద్మనాభం పలు చిత్రాల్లో నవ్వుల్లో వైవిధ్యం చూపిస్తూ నటించారు. అదే పంథాలోనే సునీల్ కూడా సాగారనిపిస్తుంది. ఆరంభంలో మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన చిత్రాల్లో కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించారు.ఆ తరువాత తనదైన మార్కు ప్రదర్శించారు. ఆ పై సొంత బాణీ పలికిస్తు, పలు చిత్రాలలో పకపకలు పంచారు. 

'అందాలరాముడు’లో కథానాయకునిగా అలరించిన సునీల్ కు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ మరింత మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ సినిమా సునీల్ కు కెరీర్ బెస్ట్ గా నిలచింది. ఆ తరువాత సునీల్ పలు చిత్రాల్లో నాయక పాత్రలే పోషించారు. ‘పూలరంగడు’ మినహా, సునీల్ హీరోగా నటించిన చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో మిత్రుడు త్రివిక్రమ్ సూచన మేరకు మళ్ళీ నవ్వించే ప్రయత్నం మొదలు పెట్టారు సునీల్. కొన్ని సార్లు కితకితలు పెట్టారు. మరికొన్ని సార్లు సెంటిమెంట్ తోనూ కొట్టారు. అయినా మునుపటి వైభవం సునీల్ కు కనిపించలేదు.ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న సునీల్.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. 

హీరో వేషాలు మాత్రమే వేస్తానని కూర్చోకుండా, అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కామెడీ పాత్రలే కాకుండా, విలన్ రోల్స్ చేయడానికి కూడా ఉత్సాహం చూపించారు. ఈ విధంగా నెగెటివ్ షేడ్స్ తో చేసిన 'కలర్ ఫోటో' సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సునీల్ విలన్ వేషాలు కూడా వేయగలడని నిరూపించింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో నటించిన 'పుష్ప: 1,2' సినిమాలు అతనికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. ఆయన చేసిన మంగళం శ్రీను పాత్రకు అందరి ప్రశంసలు అందుకున్నారు. 

 సునీల్ కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.క్యారెక్టర్ ఏదైనా తనదైన నటనతో మెప్పిస్తున్న ఈ భీమవరం బుల్లోడు.. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. 

--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com