జాతీయ సైన్స్ డే....!

- February 28, 2025 , by Maagulf
జాతీయ సైన్స్ డే....!

సైన్స్‌ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ, నడిపించే శక్తిగా సైన్స్ కీలకపాత్ర పోషిస్తోంది.

సైన్స్ ప్రభావాన్ని మనందరికీ తెలియజేయడంలో ‘నేషనల్ సైన్స్ డే’ (National Science Day) ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇక ఈ ‘నేషనల్ సైన్స్ డే’ పుట్టుక విషయానికి వస్తే.. భారతదేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న తన ప్రఖ్యాత “రామన్ ఎఫెక్ట్” (Raman Effect)‌ను కనుగొన్నారు. ఈ ప్రాచుర్యం చెందిన శాస్త్రీయ పరిశోధనకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం 1987 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటోంది. 

జాతీయ సైన్స్ డేను జరుపుకోవడం ద్వారా ప్రజలకు సైన్స్ ప్రాముఖ్యత, సాంకేతికత వినియోగం, దాని ఉపయోగాలు గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించడం, దేశంలో కొత్త ఆవిష్కరణలు రావడానికి పునాది వేయడం దీని ఉద్దేశం.

1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC) భారత ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 28ను ‘నేషనల్ సైన్స్ డే’గా ప్రకటించాలని అభ్యర్థించింది. దానిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం 1987 నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, శాస్త్రీయ సంస్థలు ఈరోజున ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రదర్శనలు, సెమినార్లు, వ్యాసరచన పోటీలు, శాస్త్ర సదస్సులను నిర్వహిస్తాయి. 

1928 ఫిబ్రవరి 28న సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. ఈ పరిశోధన ప్రకారం, ఒక కాంతి కిరణం పారదర్శక పదార్థం గుండా వెళ్ళినప్పుడు దాని దిశలో మార్పు సంభవించడం అనే సిద్ధాంతాన్ని రామన్ నిరూపించారు. ఈ ఆవిష్కరణ భౌతికశాస్త్ర రంగానికి గొప్ప మైలురాయిగా నిలిచింది. 

రామన్ చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్‌హుడ్ బిరుదును ప్రదానం చేసింది. 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం “భారతరత్న” ప్రకటించింది. చివరకు 1970 నవంబర్ 21న సీవీ రామన్ తన చివరి శ్వాస విడిచినా, ఆయన సేవలు భారత శాస్త్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. 

ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ డేను వివిధ థీమ్‌ల ఆధారంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక అంశాన్ని (Theme) ప్రకటించి, దాని చుట్టూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక ఏడాది థీమ్ విషయానికి వస్తే.. “ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్​షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా.” దీని అర్థం.. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత విజ్ఞాన పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో పెంచే దిశగా మన దేశ యువతకు సాధికారిత కల్పించడమీ దీని లక్ష్యం. ఇది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రాధాన్యతను హైలైట్ గా చేయనుంది.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com