గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త..
- March 08, 2025
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ప్రభుత్వం మళ్లీ వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) ను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్కీం అమల్లో ఉండనుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు ప్రభుత్వం స్పందించి.. ఆస్తిపన్ను బాకాయిదారులకు వన్‌టైం సెటిల్మెంట్ విధానాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వన్‌టైం సెటిల్మెంట్ లో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కేవలం 10శాతం వడ్డీతో మాత్రమే బకాయిలు చెల్లించవచ్చు. అయితే, జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు మూడు సార్లు వన్‌టైం సెటిల్మెంట్ స్కీం అమలు చేశారు. మొదటి సారి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 15వరకు అమలు చేయగా రూ.400 కోట్లు ఆదాయం వచ్చింది. 2022-23లో జూలైలో అమలు చేయగా రూ. 170 కోట్లు, 2024-25 మార్చిలో రూ. 350కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రూ. 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో 15ఏండ్లుగా ఆస్తి పన్ను బాకాయిలు రూ.11,668 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తి పన్నే రూ. 5,500 కోట్లు ఉన్నాయి. మిగతా రూ.5వేల కోట్లు ప్రజల నుంచి రావాల్సి ఉంది. మొత్తం 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో ఆరు లక్షల మంది మొండి బకాయిదారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2వేల కోట్లు పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.1,540 కోట్లు వసూలైంది. వడ్డీ మాఫీ రాయితీ వర్తించే వారి నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.5వేల కోట్లు ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీలతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. వారు చెల్లించిన మొత్తాన్ని వారి రాబోయే ఆస్తిపన్ను చెల్లింపులో అడ్జెస్ట్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!