'ఉన్నది ఒకటే జిందగీ' రివ్యూ

- October 27, 2017 , by Maagulf
'ఉన్నది ఒకటే జిందగీ' రివ్యూ

సినిమా పేరు: 'ఉన్నది ఒకటే జిందగీ'
విడుదల తేదీ: 27.10. 2017
దర్శకత్వం : కిశోర్ తిరుమల
నిర్మాత : కృష్ణ చైతన్య, స్రవంతి రవికిశోర్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు : రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి తదితరులు
రామ్ పోతినేని 2006 నుంచి హీరోగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. 2014 మినహా ప్రతి ఏడాది రామ్ సినిమాలు వచ్చాయి. అయితే, వీటిలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మాత్రం చాలా తక్కువ. రామ్ కెరీర్ లో దేవదాసు (2006), రెడీ(2008) ఇటీవల చేసిన నేను శైలజ తప్ప రామ్ కు చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. నేను శైలజ హిట్ కొట్టిన ఉత్సాహంతో తాజాగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేశాడు రామ్. కిశోర్ తిరుమల డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ : అభి(రామ్‌), వాసు(శ్రీవిష్ణు) చిన్ననాటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఒక రాక్ బ్యాండ్‌ పార్టీలో అభి గిటారిస్ట్ గా పనిచేస్తూ ఉండగా, వాసు ఓ పని మీద రెండు నెలలపాటు ఢిల్లీలో ఉంటాడు.

ఈ టైంలో అభికి, డాక్టర్ అయిన మహా(అనుపమ పరమేశ్వరన్‌) పరిచయం అవుతుంది. మహాకు సింగింగ్ అంటే ఇష్టం. దీంతో మహా ఇష్టాన్ని గౌరవించి ఆమెకు తన రాక్ బ్యాండ్ లో పాడే అవకాశం ఇస్తాడు అభి. దీంతో వీళ్ల స్నేహం ప్రేమగా మారుతుంది కాని ఒకరికి ఒకరు చెప్పుకోరు.

ఇదిలాఉంటే, వాసుకి మహా స్వయానా మరదలని ఆమెను తన ప్రాణ స్నేహితుడైన వాసు కూడా ప్రేమిస్తున్నానడన్న విషయం అభికి తెలుస్తుంది. ఈ క్రమంలో మహా వాసునే పెళ్లిచేసుకునేందుకు ఇష్టపడుతుంది. అభి, వాసు మధ్య గొడవ జరగడంతో ఎవరికీ చెప్పకుండా అభి ఇటలీ వెళ్లిపోతాడు? అక్కడ మళ్లీ కథలో అనుకోని ట్విస్ట్‌లు ఎదురవుతాయి.

చివరికి మహాను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ప్రాణస్నేహితులిద్దరూ ఒక్కటవుతారా కొత్తగా వచ్చిపడ్డ మ్యాగీ క్యారెక్టర్ కథను ఎలా మలుపు తిప్పింది? వంటి సంగతులు వెండితెరపైనే చూడాలి.
 
విశ్లేషణ : సినిమా ఫస్టాఫ్ అంతా సాగదీత వ్యవహారంలాగే సాగి ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. స్క్రీన్ ప్లే పేలవంగా ఉండటం, కామెడీ లేకపోవడం ఫస్టాఫ్ లో మైనస్ పాయింట్లనే చెప్పాలి.

సెకండాఫ్ లో కొంచెం ప్రేక్షకుడికి ఊరట కలుగుతుంది. రామ్, అనుపమ నటన బావుంది. హీరో ప్రాణ స్నేహితుడిగా శ్రీవిష్ణుకు మంచి మార్కులే పడతాయి. క్లైమాక్స్ లో లావణ్య త్రిపాఠి నటన హైలైట్ అనే చెప్పాలి.

సెకండాఫ్ లో లావణ్య, హిమజ కామెడీ బావుంది. అభి వాసు స్నేహితులుగా కౌశిక్‌, ప్రియదర్శి, కిరీటి బాగాచేశారు. దేవిశ్రీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగిన కథ అయినప్పటికీ వాళ్ల ప్రెండ్ షిప్ ని డైరెక్టర్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం సినిమా లైన్ ను దెబ్బతీసింది.

పసలేని లవ్ ట్రాక్స్ రెగ్యులర్ ఆడియన్స్ ని బాగా ఇబ్బందిపెట్టే అంశాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com