విజయవాడ విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ హోదా

- December 17, 2017 , by Maagulf
విజయవాడ విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ హోదా

విజయవాడ నుంచి నేరుగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి త్వరలోనే మార్గం సుగమం కానుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ హోదాకు కేంద్ర మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ నుంచి విదేశాలకు విమానాలను నడపడానికి అతి ముఖ్యమైన ఘట్టం పూర్తైంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇమ్మిగ్రేషన్ హోదా వచ్చింది. ఇమ్మిగ్రేషన్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇక్కడ ఏర్పాట్లను, సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత నేరుగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సానుకూలంగా నివేదిక ఇవ్వడం, నోటిఫికేషన్ రావడం చకచకా జరిగిపోయాయి.

ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి తక్షణం వైర్‌లెస్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ కేబులింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ హోదా అందుకున్నప్పటికీ కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ హోదా రాకపోవడంతో ఇన్నాళ్లు కొంత నిరుత్సాహం నెలకొంది. కనీసం కస్టమ్స్ హోదా వచ్చినా దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు విమాన సర్వీసులు నడప వచ్చునని విమానాశ్రయ అధికారులు భావించారు. కస్టమ్స్ హోదా రాకముందే ఇమ్మిగ్రేషన్ హోదా ప్రకటన జారీ కావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న పాత టెర్మినల్‌ రూపురేఖలు మార్చి అంతర్జాతీయ టెర్మినల్‌గా తీర్చిదిద్దారు.

అంతర్జాతీయ టెర్మినల్‌కు కావాల్సిన అన్ని హంగులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇటీవల ఇమ్మిగ్రేషన్, కస్టమ్ అధికారులు కూడా టెర్మినల్‌లో గల సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ హోదా రావడంతో ఇక కస్టమ్స్ హోదా కూడా లాంఛనమే. కాగా విజయవాడ నుంచి ముంబైకి అక్కడి నుంచి దుబాయ్, షార్జాలకు విమాన సర్వీస్ నడపడానికి ఎయిరిండియా ఇటీవలే ఆసక్తి చూపించింది. ఇమ్మిగ్రేషన్ హోదా రాకపోతే ముంబై వరకు నడపాలని భావించింది. ఇప్పుడు తొలి అంతర్జాతీయ సర్వీసు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి దుబాయ్, షార్జాలకు విమానాన్ని నడపనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com