రివ్యూ: రంగస్థలం

- March 29, 2018 , by Maagulf
రివ్యూ: రంగస్థలం

చిత్రం: రంగస్థలం 
నటీనటులు: రామ్‌చరణ్‌.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్‌.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్‌.. రోహిణి.. రాజీవ్‌ కనకాల తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు 
కూర్పు: నవీన్‌ నూలి 
కళ: రామకృష్ణ, మౌనిక 
పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌ 
సాహిత్యం: చంద్రబోస్‌ 
రచన: తోట శ్రీనివాస్‌.. కాశీ విశాల్‌.. బుచ్చిబాబు.. శ్రీనివాస్‌ రంగోలి 
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని.. వై. రవిశంకర్‌.. మోహన్‌ చెరుకూరి 
దర్శకత్వం: సుకుమార్‌ 
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌ 
విడుదల: 30-03-2018
మె గా ఫ్యామిలీ వారసుడిగా వెండితెరకు పరిచయమైన రామ్‌చరణ్‌ తొలి నుంచి తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మాస్‌, కమర్షియల్‌ హీరోగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక దర్శకుడు సుకుమార్‌ది విభిన్న శైలి. కొత్తదనం ప్లస్‌.. అనవసర సన్నివేశాలు మైనస్‌.. ఎమోషన్స్‌ ఇంటూ.. కథ డివైడెడ్‌ బై.. స్క్రీన్‌ప్లే స్క్వేర్‌ రూట్‌.. ప్లస్‌ ఐటమ్‌ సాంగ్‌. ఇది సుకుమార్‌ సినిమా ఈక్వేషన్‌. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే 'లెక్కలు' ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అంతటి భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'రంగస్థలం'. 1985లో 'రంగస్థలం' అనే గ్రామంలో జరిగిన రాజకీయ చదరంగం ఇతివృత్తంగా సినిమా సాగుతుందంటూ ప్రచారం చేశారు. పైగా చరణ్‌ ఇందులో చెవిటివాడిగా నటించడం మరో విశేషం. మరి చరణ్‌-సుకుమార్‌ల కొత్త ప్రయత్నం ఎలా ఉంది? చరణ్‌ ఏడాదికి పైగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందా? ఆయన కెరీర్‌లో మరో మైలురాయిలా నిలిచే చిత్రమైందా?

కథేంటంటే: రంగస్థలం అనే గ్రామానికి ప్రెసిడెంట్‌ ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). 30ఏళ్లుగా ప్రెసిడెంట్‌ పదవిలో ఉంటాడు. మరొకరికి అవకాశం ఇవ్వడు. గ్రామంలో అతను చెప్పిందే వేదం. అతని పేరు పలకడానికి కూడా జనం భయపడుతుంటారు. ప్రెసిడెంట్‌ ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా చెప్పులు విడిచి వెళ్లాలి. ఇదే గ్రామంలో పొలాలకు నీరు పెట్టే ఇంజిన్‌ను నడుపుతూ ఉంటాడు చిట్టిబాబు(రామ్‌ చరణ్‌). అతడికి చెవుడు. పెద్దగా వినిపించదు. గ్రామంలో అందరితోనూ సరదాగా ఉంటాడు. తండ్రి(నరేష్‌) గ్రామంలో దర్జీ. అన్న కుమార్‌బాబు(ఆది) చదువుకుని దుబాయ్‌లో ఉద్యోగం చేసి వస్తాడు. అదే ఊరిలో ఉండే రామలక్ష్మి(సమంత)కి చిట్టిబాబు అంటే ఎంతో ఇష్టం. గ్రామంలోని అమాయక రైతులను తన సహాయకుడితో కలిసి ఫణీంద్రభూపతి మోసం చేస్తూ ఉంటాడు. అలా రామలక్ష్మి(సమంత) తండ్రిని మోసం చేసి డబ్బు కట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ విషయంలో కుమార్‌బాబుకి ప్రెసిడెంట్‌ సహాయకుడికి మధ్య గొడవ జరుగుతుంది. మరి ఆ గొడవ దేనికి కారణమైంది? ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? 'రంగస్థలం' గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో కుమార్‌బాబు ఎందుకు నామినేషన్‌ వేయాల్సి వచ్చింది? తన అన్నకు అండగా నిలిచిన చిట్టిబాబు ఏం చేశాడు? అన్నదే కథ.

ఎలా ఉందేంటే: ఇది 1985 నాటి కాలంలో సాగే కథ. భూస్వామ్య వ్యవస్థ.. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండటం.. 30ఏళ్లుగా గ్రామాన్ని పాలిస్తున్న ఓ ప్రెసిడెంట్‌ చేసే అరాచకాలను నిలదేసే ఓ యువకుడు.. ఇదీ స్థూలంగా రంగస్థలం నేపథ్యం. ఈ కాన్సెప్ట్‌ గతంలో ఎన్నో చిత్రాల్లో మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి కథకు సుకుమార్‌ శైలిని జోడిస్తే ఎలా ఉంటుందో అదే 'రంగస్థలం'. కథ పరంగా పాత్రల ఎంపిక, వాటిని చిత్రీకరించిన విధానం, ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. ఇలాంటి వాతావరణం ఎక్కువగా తమిళ సినిమాల్లో ఉంటుంది.
ప్రథమార్ధమంతా ఊళ్లో చిట్టిబాబు చేసే సందడి.. రామలక్ష్మితో వచ్చే సరదా సన్నివేశాలతో సరదా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా రామలక్ష్మిగా సమంత నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. పాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా వచ్చిపోతుంటాయి. మరోపక్క గ్రామంలో ప్రెసిడెంట్‌ చేసే అన్యాయాలను కుమార్‌బాబు నిలదీయడంతో పాటు, సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అయితే ఈ పరిణామాలేవీ చిట్టిబాబుకు తెలియవు. తన తండ్రి, అన్నను ప్రెసిడెంట్‌ అవమానించడం తెలిసిన తర్వాత చిట్టిబాబు ఎలా స్పందించాడన్నదే ద్వితీయార్ధం. పాత్రల పరిచయం వాటిని ఎస్టాబ్లిష్‌మెంట్‌ చేసే క్రమంలో ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కథను మరింత విపులంగా చెప్పే క్రమంలో దర్శకుడు ఇలా ఆలోచించి ఉండవచ్చు.

ప్రథమార్ధమంతా సరదా సన్నివేశాలతో నడిపించిన దర్శకుడు అసలు కథను ద్వితీయార్ధం కోసం అట్టిపెట్టుకున్నాడు. కుమార్‌బాబు నామినేషన్‌ వేయడం, ప్రెసిడెంట్‌ అరాచకాలను ఊరి వాళ్లకు తెలియజేయడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు తదితర సన్నివేశాలతో సెకండాఫ్‌ను తీర్చిదిద్దాడు దర్శకుడు. అక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని ఆశ్చర్య పరుస్తాయి. రంగమ్మత్తగా అనసూయతో ఒక ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. కుమార్‌బాబుపై దాడి జరగడం ఆ తర్వాత పరిణామాలు కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఇక చివర్లో ఎవరూ ఊహించని విధంగా ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చే షాక్‌ ప్రేక్షకులను మరింత ఆశ్చర్య పరుస్తుంది. ఇలా ద్వితీయార్ధం మొత్తం సుకుమార్‌ శైలి ట్విస్ట్‌లతో సాగుతుంది.

ఎవరెలా చేశారంటే: చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ ఒదిగిపోయారు. గోదావరి యాస.. చెవిటి వ్యక్తిగా అతను పండించే నవ్వులు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకూ చరణ్‌ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్ర మరో ఎత్తు. పాత్ర కోసం రామ్‌చరణ్‌ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చెవిటి వ్యక్తిగా ప్రియురాలి వద్ద తడబడే సన్నివేశాల్లో నవ్వులు పంచిన చెర్రీ ద్వితీయార్ధంలో అన్నకోసం తపన పడే తమ్ముడిగా భావోద్వేగాలను పలికించడంలో నూటికి నూరుపాళ్లు విజయవంతమయ్యారు. కొన్ని రోజుల వరకూ రామ్‌చరణ్‌ చిట్టిబాబుగానే మనకు గుర్తిండిపోతారు. రామలక్ష్మిగా తన నటనతో మరోసారి కట్టిపడేశారు సమంత. సుకుమార్‌ చిత్రాల్లో కథానాయిక పాత్ర బలంగా ఉంటుంది. ఈ చిత్రంలో సమంత పాత్ర చాలా కీలకం. పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. కుమార్‌బాబు పాత్రలో ఆది ఇమిడిపోయారు. మృదు స్వభావిగా.. గొడవలకు దూరంగా ఉంటూనే అన్యాయంపై పోరాటం చేసే వ్యక్తిగా చక్కగా నటించారు. ప్రెసిడెంట్‌గా జగపతిబాబు, ఎమ్మెల్యేగా ప్రకాశ్‌రాజ్‌ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. సినిమాలో రంగమ్మత్తగా అనసూయ పాత్ర ఓ ట్విస్ట్‌. సుకుమార్‌ ఎంపికకు ఆమె న్యాయం చేశారు. ఆ పాత్రలో చక్కగా నటించారు.
ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌ హిట్‌ అని మరోసారి 'రంగస్థలం' నిరూపించింది. ప్రతీ పాట.. సన్నివేశంతో పాటే వస్తుంది. ఎక్కడా ఇరికించిన భావన ఉండదు. సుకుమార్‌-దేవిల మార్కు ఐటమ్‌సాంగ్‌లో పూజా హెగ్డే అలరిస్తుంది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సెట్స్‌. 1985నాటి నేపథ్యంలో కనిపించేలా రామకృష్ణ తీర్చిదిద్దిన సెట్స్‌ మనల్ని ఆకాలం నాటికి తీసుకెళ్తాయి. ప్రతీ సన్నివేశంలో ఆ నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా వాతావరణం సృషించారు. ఇందుకోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. అదంతా తెరపై కనిపిస్తుంది. సినిమా నిడివి ఎక్కువైనా ప్రతీ సన్నివేశానికీ ప్రాధాన్యం ఉంది. దీంతో నవీన్‌ నూలి ఎడిటింగ్‌కు పెద్దగా పని చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. రామ్‌-లక్ష్మణ్‌ పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఇక 'రంగస్థలం' కెప్టెన్‌ సుకుమార్‌ 'లెక్క' అదిరిపోయింది. ప్రతీ సన్నివేశంలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రలను ఎంపిక చేసుకున్న విధానం, వాటిని తీర్చిదిద్దిన తీరులో సుక్కు 'మార్కు' కనపడుతుంది. మొత్తం 24 విభాగాలనూ సమర్థంగా ఒకే తాటి పైకి తీసుకొచ్చారు సుకుమార్‌. తాను అనుకున్న కథను తెరపై తీసుకొచ్చి, మనల్ని కూడా 'రంగస్థలం'లోకి తీసుకెళ్లిపోయారు సుకుమార్‌.

బలాలు 
+ పాత్రలను చిత్రించిన విధానం 
+ రామ్‌చరణ్‌ నటన 
+ పాటలు, నేపథ్య సంగీతం 
+ ట్విస్ట్‌లు
బలహీనతలు 
- ప్రథమార్ధం కాస్త మందగమనం 

--మాగల్ఫ్ రేటింగ్ 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com