ఎన్.ఆర్.ఐల సమస్యలపైనా పోరాటం

- December 17, 2018 , by Maagulf
ఎన్.ఆర్.ఐల సమస్యలపైనా పోరాటం

డల్లాస్‌: ప్రవాస భారతీయుల సమస్యలపైనా తమ పార్టీ పోరాటం సాగిస్తుందని, వారికి అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అమెరికాలోని డల్లాస్‌ టయోటా మ్యూజిక్‌ ఫ్యాక్టరీలో జరిగిన జనసేన ప్రవాస గర్జన సభలో ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికాలో తాను పర్యటిస్తున్నది పార్టీ నిధుల కోసం కాదనీ, ఇక్కడ ఉన్న వారందరికీ అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పడానికేనని పవన్‌ అన్నారు. వాషింగ్టన్‌లో ఇప్పటికే ఇరవైకి పైగా సమావేశాల్లో పాల్గొని ఇమ్మిగ్రేషన్‌ సంబంధిత సమస్యలపై చర్చించామని తెలిపారు. అనంతపురం, అరకు, నెల్లూరు, ఉద్దానం ప్రాంతాలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని ఎలాగైతే పోరాటాలు సాగిస్తున్నామో, అమెరికాకు కూడా అదే ఉద్దేశ్యంతోనే వచ్చామన్నారు. బిజినెస్‌ చేయాలనే ఎన్‌ఆర్‌ఐల కోసం సింగిల్‌ విండో విధానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ల విభాగం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాలు ఏర్పాటు చేసి వారి సేవలు వినియోగించుకుంటామన్నారు. ఉద్యోగాల కోసం యువత విదేశాలకు వెళ్లడం కాదని, మనదేశంలోనే ఉద్యోగాలు సంపాదించు కోవాలన్నారు. ఉన్నత విద్యావంతులు ప్రజలను ఎక్కువ ప్రభావితం చేయగలరని అందుకే ఎన్‌ఆర్‌ఐలు రాజకీయాల్లోకి రావాలని కోరారు. దేశ వ్యవస్థను మార్చే శక్తి, అవినీతి వ్యవస్థను తరిమికొట్టే సత్తా యువతకు మాత్రమే ఉందన్నారు. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువత నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలు, పర్యాటక, సాంకేతిక రంగాలతోపాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తామనీ, నాణ్యతతో కూడిన ఉచిత విద్యతో పాటు కామన్‌ హాస్టల్‌ విధానాన్ని తీసుకొస్తామన్నారు. 
దేశాన్ని మార్చేస్తానని చెప్పడం లేదుకానీ తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తానని పవన్‌ తెలిపారు. డల్లాస్‌లోని ప్రవాస వైద్యులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జనసేన మ్యాని ఫెస్టోలో గ్రామాల్లో పనిచేసే వైద్యులకు రెట్టింపు జీతాలు, మండల కేంద్రాల్లో సకల సౌకర్యాలతో గృహసము దాయాలు నిర్మిస్తామని చెప్పామన్నారు. అలాగే సమాజానికి సేవ చేయడానికి సిద్ధమైన ప్రవాస వైద్యుల కోసం ఎన్‌ఆర్‌ఐ వైద్యుల విభాగం ఏర్పాటు చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com