ఇండియా-పాక్ సరిహద్దులో భారీ విన్యాసాలు

- February 17, 2019 , by Maagulf
ఇండియా-పాక్ సరిహద్దులో భారీ విన్యాసాలు

జవాన్లపై ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత భద్రతా దళాలు ఎదురుచూస్తున్నాయి. భారత ప్రభుత్వం సైతం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ప్రకటించడంతో సమరానికి సై అనేందుకు భద్రతా దళాలు సిద్ధమయ్యాయి. అందుకే యుద్ధానికి సన్నాహంగా భావిస్తూ.. భారత వాయుసేన భారత్-పాక్ సరిహద్దులో భారీ విన్యాసాలు చేపట్టింది. ఇందులో ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్లు సహా అన్ని రకాల యుద్ధ విమానాలు పాలుపంచుకుని వాయుసేన శక్తిని చాటాయి. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత భారత వాయుసేన విన్యాసాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాయుశక్తి విన్యాసాల్లో భాగంగా భారత వాయుసేన తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగలిగే ఆకాశ్ క్షిపణి, గాల్లోంచి గాల్లోని లక్ష్యాలను తుత్తునియలు చేసే ఆస్త్ర వంటివాటితో విన్యాసాలు నిర్వహించారు. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు రాత్రీ, పగలు తేడా లేకుండా లక్ష్యాలను ఛేదించాయి. మిలటరీ విన్యాసాల్లో ఏఎల్‌హెచ్, ఆకాశ్‌లను మోహరించడం ఇదే తొలిసారి.

వీటితో పాటు అప్‌గ్రేడ్ చేసిన మిగ్ – 29 యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. ఎస్-30, మిరాజ్ 2000, జాగ్వార్, మిగ్-21, బైసన్, మిగ్-27, మిగ్-29, ఐఎల్ 78, హెర్క్యులస్, ఏఎన్-32 తదితర మొత్తం 137 యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, భారత వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ అయిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తదితరులు విన్యాసాలను తిలకించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com