ఢిల్లీ జాట్-పర్వేశ్ వర్మ
- March 18, 2025
పర్వేశ్ వర్మ ... ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న రాజకీయ నాయకుడు. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మట్టి కరిపించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తన స్వశక్తితోనే హస్తిన రాజకీయ యవనికపై తిరుగులేని నేతగా ఎదిగి, ఢిల్లీ కోటపై తమ జెండా పాతాలని ప్రయత్నిస్తున్న 27 ఏళ్ళ భాజపా నిరీక్షణకు ముగింపు పలకడంలో పర్వేశ్ కీలకమైన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న పర్వేశ్ వర్మ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం ...
పర్వేశ్ వర్మ పూర్తిపేరు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. 1977, నవంబర్ 7న ఢిల్లీ నగరంలో జాట్ సామాజిక వర్గానికి చెందిన సాహిబ్ సింగ్ వర్మ, సాహిబ్ కౌర్ దంపతులకు జన్మించారు. ఢిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. పర్వేశ్ తండ్రి సాహిబ్ సింగ్ ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సైతం పనిచేశారు. భాజపా అగ్రనేత ఎల్.కె.అద్వానీకి అత్యంత సన్నిహితుడు. వాజపేయీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.
తండ్రి సాహిబ్ సింగ్ స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన పర్వేశ్ 2009 లోక్ సభ ఎన్నికల్లో భాజపా నుంచి పశ్చిమ ఢిల్లీ ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికి దక్కలేదు. 2009-13 మధ్యలో ఢిల్లీ భాజపాలో పలు పదవులను నిర్వహించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మెహ్రౌలీ నుంచి పోటీ చేసి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా ఆదేశాల మేరకు పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో సైతం అదే స్థానం నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. అయితే, 2024లో టిక్కెట్ దక్కలేదు.
ఆప్ అధినేత, అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా 2020 నుంచే భాజపా అగ్రనాయకత్వం పర్వేశ్‌ను ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకం చేసింది. ఆప్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై పర్వేశ్ నాయకత్వంలో భాజపా శ్రేణులు పలు పోరాటాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన సీఏఎ వ్యతిరేక ఆందోళనలు, పంజాబ్ కిసాన్ మార్చ్ వంటి కార్యక్రమాలపై చేసిన విమర్శలు దేశ రాజకీయాల్లో కాక పుట్టించాయి. అయితే, ఈ విమర్శలే పర్వేశ్‌ను ఢిల్లీ భాజపాలో మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి.
1998 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పీఠాన్ని కోల్పోయిన తర్వాత నుంచి తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినప్పటికి అవన్ని విఫల యత్నాలుగానే మిగిలిపోయాయి. మోడీ - షాల ఎన్నికల విజయ పరంపరలో సైతం ఢిల్లీ మొండికేస్తూ వచ్చింది. అయితే, 2024లో కేంద్రంలో రెండోసారి వచ్చిన నాటి నుంచి ఢిల్లీ మీద దృష్టి సారించిన మోడీ - షాల ద్వయం గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే పర్వేశ్ వర్మను కేజ్రీవాల్‌పై విమర్శల దాడి చేసేలా ఉసిగొల్పింది. అధిష్టానం ఆశీస్సులు తనపై పుష్కలంగా ఉండటంతో పర్వేశ్ సైతం విజృంభించారు.
2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే న్యూఢిల్లీ స్థానం నుంచి ఎమ్యెల్యేగా ఉన్న కేజ్రీవాల్‌పై పోటీ చేసేందుకు పర్వేశ్ ఆసక్తిగా ఉండటంతో అదే స్థానం నుంచి పార్టీ టిక్కెట్ కన్ఫర్మ్ చెసింది. ఆ స్థానం నుంచి వరుసగా ఎమ్యెల్యేగా ఎన్నికైన కేజ్రీవాల్ మూడు సార్లు ఢిల్లీ సీఎం కావడంతో పాటుగా కేజ్రీ సామాజిక వర్గం సైతం బలంగా ఉండటం వల్ల పర్వేశ్ గెలుపు మీద ఎవరికి అంచనాలు లేనప్పటికి పోటీ రసవత్తరంగా సాగుతుందని మాత్రం రాజకీయ విశ్లేషకులు ఊహించారు. వారి ఊహలను పాట పంచలు చేస్తూ పర్వేశ్ ఏకంగా కేజ్రీవాల్‌పై సంచలన విజయం సాధించి దేశ రాజకీయాల్లో స్ఫరైజ్ పొలిటికల్ స్టార్‌గా నిలిచారు.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో పర్వేశ్‌తో పాటుగా భాజపా విజయం సాధించి తమ రెండున్నర దశాబ్దాల కలను నెరవేర్చుకుంది. ఎన్నికల అనంతరం సీఎంల నియోజకవర్గం నుంచి ఎన్నికైన వర్మను ఢిల్లీ సీఎం చేస్తారని అనుకున్నప్పటికి కొన్ని రాజకీయ లెక్కల్లో భాగంగా ఆ పదవి రేఖా గుప్తాకు దక్కగా ఆమె డెప్యూటీగా పర్వేశ్ నియమితులయ్యారు. ప్రస్తుతానికి ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న పర్వేశ్ రాబోయే రోజుల్లో ఢిల్లీ సీఎం పీఠమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేస్తున్నారని హస్తిన రాజకీయ వర్గాల సమాచారం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్