అరుణాచల్ రాజకీయ దిగ్గజం-దోర్జీ ఖండు
- March 19, 2025
దోర్జీ ఖండు... ఈశన్య భారత రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. హిమాలయ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన నాయకుడు. సంక్షోభ రాజకీయాలకు నిలయమైన ఆ రాష్ట్ర రాజకీయాలను గాడిలోపెట్టేందుకు ఆయన ఎంతో చొరవ చూపారు. నేడు అరుణాచల్ రాజకీయ దిగ్గజం దోర్జీ ఖండు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
దోర్జీ ఖండు 1955, మార్చి 19న ఈశాన్య ఫ్రాంటియర్ ఏజెన్సీలోని తవాంగ్ జిల్లా గ్యాంగ్‌ఖర్ గ్రామంలో బౌద్ధ మతానికి చెందిన కుటుంబంలో జన్మించారు. హైస్కూల్ విద్య వరకు చదువుకున్న ఖండు ఆర్మీలోని ఈశాన్య ఫ్రాంటియర్ విభాగంలో పనిచేశారు. 1971లో జరిగిన బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొని గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత తమ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్మీ నుంచి విరమణ పొందారు.
ఖండు రాజకీయాల్లో క్రియాశీలకంగా కాకముందు రెండు దశాబ్దాల పాటు తవాంగ్ జిల్లాలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. ఆయన్ని తమ పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రయత్నించగా వ్యక్తిగత కారణాలు మరియు అప్పటి అరుణాచల్ ప్రదేశ్ సీఎం గెగోంగ్ అపాంగ్ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1980-83 వరకు అంచల్ సమితి సభ్యుడిగా పనిచేశారు. 1982లో సాంస్కృతిక మరియు సహకార సొసైటీల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1983లో వరకు పశ్చిమ కామెంగ్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1987 వరకు పనిచేశారు.
1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున థింగ్బు-ముక్తో నియోజకవర్గం నుండి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో అదే నియోజకవర్గం నుంచి 1995,1999,2004 మరియు 2009లలో ఎన్నికయ్యారు. గెగోంగ్ అపాంగ్ మంత్రివర్గంలో 1995 నుంచి 1999 వరకు ఎనిమల్ హస్బెండరీ & వెల్ఫేర్, డెయిరీ డెవలప్మెంట్, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2003 వరకు ముకుట్ మిథి మంత్రివర్గంలో గనులు మరియు పునరావాస శాఖల మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు తన రాజకీయ గురువైన గెగోంగ్ అపాంగ్ మంత్రివర్గంలో విద్యుత్, పునరావాసం మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.
2007లో కాంగ్రెస్ అధిష్టానం గెగోంగ్ అపాంగ్ స్థానంలో దోర్జీ ఖండును అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎంగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఖండు తనదైన పాలనాదక్షతతో రాష్ట్రా అభివృద్ధిని పరుగులు పెట్టించారు. తన హయాంలోనే రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అన్ని మౌలిక సదుపాయాలు వేగంగా సమకూరాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సత్వరమే వారి పనులు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించి రాష్ట్ర ప్రజల్లో అశేషమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి పనులే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది.
2011 ఏప్రిల్ 30న తవాంగ్ నుండి ఇటానగర్‌కు అధికారిక పర్యటనకు వెళ్లిన ఖండూతో పాటుగా మరో నలుగురు వ్యక్తులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది. సీఎం అదృశ్యం అవ్వడంతో కేంద్ర బలగాలన్నీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మరంగా గాలిస్తున్న సమయంలో 2011, మే 4న, ఉదయం 11 గంటల సమయంలో పశ్చిమ కామాంగ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ అవశేషాలను స్థానికులు కనుగొన్నారు. ఆ తర్వాత రోజున దోర్జీ ఖండూ మరణ వార్తను అప్పటి భారత హోం మంత్రి పి.చిదంబరం ధృవీకరించారు. అరుణాచల్ రాష్ట్ర అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన దోర్జీ ఖండు ఆ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







