సింహాపురి రాజకీయ యోధుడు-సోమిరెడ్డి
- March 26, 2025
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. నెల్లూరు పెద్దారెడ్ల కుటుంబానికి చెందిన నిఖార్సయిన పసుపు పార్టీ సైనికుడు. బలమైన రాజకీయ నేపథ్యం కలిగినప్పటికి తన స్వయం కృషితోనే రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంత్రిగా పలుమార్లు పనిచేశారు. జనతా పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దినప్పటికి తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా తెలుగునాట రాజకీయాల్లో గుర్తింపు పొందారు. చంద్రబాబుకు అన్ని వేళలా అందుబాటులో ఉండే నాయకుల్లో సోమిరెడ్డి ఒకరు. నేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయనపై ప్రత్యేక కథనం...
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1956, మార్చి 26న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న అల్లీపురం గ్రామంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హైమవతమ్మ దంపతులకు జన్మించారు. అల్లీపురం, నెల్లూరులలో చదువుకున్నారు. నెల్లూరులోని ప్రముఖ కె.ఎ.సి జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్మీయట్ పూర్తిచేశారు. సర్వోదయ కళశాలలో డిగ్రీ చదువుతూ రెండో సంవత్సరంలోనే ఆపేశారు.
సోమిరెడ్డి కుటుంబం తోలి నుంచి సింహపురి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేది. తండ్రి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలియాస్ శ్రీనివాస మహల్ రాజయ్య జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు రాజకీయాలు నడిపారు. ఈ క్రమంలో తమ వందల ఎకరాల పొలాలను అమ్మేశారు. ఆదర్శ వంతుడైన సోషలిస్టు నేతగా రాజయ్యకు మంచి పేరుంది. జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం రాజయ్య గారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.
సోమిరెడ్డి మేనమామలైన కోట జమీందారులు నల్లపరెడ్డి సోదరులు సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణించారు. పెద్ద మేనమామ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉంటూనే ముఖ్యమంత్రులతో సన్నిహితుడిగా మెలిగారు. ఇక చిన్న మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అలియాస్ శీనయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేతగా వెలిగారు. నలుగురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేసిన అరుదైన అరుదైన ఘనత ఆయన సొంతం.
తండ్రి, మేనమామల ప్రభావం చిన్ననాటి నుంచే సోమిరెడ్డి పై ఉండేది. నెల్లూరు పట్టణం హై స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే వారి కుటుంబానికి చెందిన శ్రీనివాస మహల్ కేంద్రంగా జిల్లా ప్రతిపక్ష రాజకీయాలు నడిచేవి. జి.సి.కొండయ్య, వెంకయ్య నాయుడు, వీరి తండ్రి మరియు ఆనాటి ఇతర ముఖ్య నేతలు అక్కడే సమావేశం అయ్యేవారు. తండ్రి వారించినప్పటికి ఆయన మాత్రం ఆ సమావేశాల్లో పాల్గొంటూ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్ నాటికే విద్యార్ధి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు.
1972లో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం,1974లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగంగా నెల్లూరులో తన తండ్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో డిగ్రీ చదువుకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయ రంగంలోకి దిగారు సోమిరెడ్డి. 1977లో జనతా పార్టీ ఏర్పడిన సమయంలో రాష్ట్ర నేతల కోరిక మేరకు ఆయన తండ్రి నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో సోమిరెడ్డి సైతం జనతా పార్టీ యువ విభాగంలో పనిచేశారు. 1978 - 82 వరకు జనతా పార్టీలోనే సోమిరెడ్డి కొనసాగారు.
1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు మేనమామలైన నల్లపరెడ్లతో పాటుగా వీరి తండ్రిని పార్టీలోకి ఆహ్వానించినప్పటికి సిద్ధాంత వైరుధ్యాల వల్ల పార్టీలో చేరలేదు. అయితే చిన్న మేనమామ శీనయ్య ప్రోత్సాహంతో చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన నాటి నుండి మేనమామ శిష్యరికంలో రాజకీయంగా రాటుదేలుతూ వచ్చారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో నంబర్ టూగా ఉన్న శీనయ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రధాన అనునీయుడిగా ఉంటూ వచ్చారు. 1986లో జరిగిన నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో అల్లిపురం సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్నికై విపరీతమైన పోటీలో సైతం 1986 -87 మధ్యలో జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశారు.
జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మేనమామ శీనయ్య సీఎం ఎన్టీఆర్ గారిపై అకారణంగా ద్వేషం పెంచుకొని సన్నిహితుల తూలనాడుతూ ఉండేవారు. ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆగ్రహించిన శీనయ్య ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా శీనయ్య సేన పేరిట సంస్థను స్థాపించారు. ఈ క్రమంలోనే చంద్రమోహన్ రెడ్డి సైతం తన పదవికి, పార్టీకి రాజీనామా శీనయ్య సేన సంస్థ కన్వీనర్ బాధ్యతలు చూస్తూ వచ్చారు.
1989 ఎన్నికలకు ముందు శీనయ్య కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి చంద్రమోహన్ రెడ్డి మాత్రం తిరిగి ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యారు. 1990-94 వరకు నెల్లూరు జిల్లా టీడీపీ వ్యవహారాల్లో చంద్రమోహన్ రెడ్డి అందరితో కలిసి పనిచేస్తూ ఎన్టీఆర్‌కు బాగా దగ్గరయ్యారు. నెల్లూరులో మొదలైన సారా ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లడంలో సోమిరెడ్డి పాత్ర కీలకం. ఎన్టీఆర్ సైతం సోమిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 1994 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి టీడీపీ టిక్కెట్ కోసం ఎంతమంది పోటీలో ఉన్నప్పటికి ఎన్టీఆర్ పిలిచి మరీ చంద్రమోహన్ రెడ్డికి బీఫారం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
ఎన్టీఆర్ విధేయుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పట్టు పెంచుకుంటూ వచ్చిన సోమిరెడ్డి 1995లో వైస్రాయ్ హోటల్ ఘటనలో మాత్రం చంద్రబాబు పక్షం వైపు నిలిచారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు. 1996లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖల మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు.1996-99 వరకు ఆ బాద్యతల్లోనే కొనసాగారు. ఈ సమయంలోనే పాతతరం టీడీపీ నేతలు వయోభారం కారణంగా రాజకీయాల నుంచి వైదొలగగా, అప్పటి నుంచి నెలూరు జిల్లా తెలుగుదేశంలో సోమిరెడ్డి హవా మొదలైంది.
1999లో సైతం సర్వేపల్లి నుంచి సునాయాసంగా రెండోసారి విజయం సాధించిన చంద్రమోహన్ రెడ్డి 2001 వరకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. 2001లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు కొనసాగారు. ఇదే సమయంలో జిల్లా రాజకీయాల్లో వచ్చిన కీలక రాజకీయ మార్పులు చేర్పులు వల్ల సోమిరెడ్డి రాజకీయంగా బలహీనపడుతూ వచ్చారు. సొంత పార్టీ నేతలే ఆయన వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించి పార్టీ మారారు. 2004 ఎన్నికల్లో నెల్లూరులో తానూ ఓటమి పాలవ్వడమే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతలు ఓటమి పాలయ్యారు.
2004-09 వరకు జిల్లా పార్టీ బాధ్యతలను చేపట్టిన సోమిరెడ్డి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ వచ్చారు. ఒకవైపు పార్టీ నిర్మాణ కార్యక్రమాలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు నడిపారు. ఆ ఐదు సంవత్సరాలు పార్టీకి సోమిరెడ్డి చేసిన సేవలను అధినేత చంద్రబాబు గుర్తించి టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం కారణంగా తనతో పాటుగా ఇతర పార్టీ నేతలు ఓటమి పాలైనప్పటికి జిల్లాలోని 10 స్థానాల్లో 4 స్థానాల్లో టీడీపీ గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు.
2009-14 వరకు సైతం జిల్లాతో పాటుగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సైతం
పార్టీ ప్రతినిధిగా తన వాదాన్ని చర్చ వేదికల్లో బలంగా వినిపించారు. 2012లో జరిగిన కోవూరు ఉపఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు తన బావమరిది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పోటీ చేసి మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నప్పటికి పొత్తులో భగంగా ఆ సీటు భాజపాకు వెళ్లడంతో మళ్ళీ సర్వేపల్లి నుంచి పోటీ చేసి తాను ఓటమి చెందినప్పటికి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో సోమిరెడ్డి ఊపిరి పీల్చుకున్నారు.
2015లో ఎమ్యెల్యేల కోటాలో ఎమ్యెల్సీగా ఎన్నికైన సోమిరెడ్డి 2017 మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2019 వరకు కొనసాగారు. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఐదు సారి ఓటమి పాలయ్యారు. దివంగత సోషలిస్టు దిగ్గజం పరిపాటి జనార్దన్ రెడ్డి తర్వాత ఇన్నిసార్లు ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా తెలుగునాట నిలిచిపోయారు. అయినప్పటికి సోమిరెడ్డి 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి ఆరోసారి పోటీ చేసి మూడోసారి ఎమ్యెల్యేగా విజయం సాధించారు.
సోమిరెడ్డి రాజకీయంగా ఎంతో మందిని పైకి తీసుకురావడమే కాకుండా వారిని మంత్రులుగా, ఎమ్యెల్యేలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, బీద మస్తాన్ రావ్ యాదవ్, బీద రవిచంద్ర, బొలినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ వంటి ఎందరో ఆయన ద్వారానే రాజకీయాల్లోకి పైకి వచ్చారు. అందుకే సోమిరెడ్డిని నాయకులను తయారు చేసే యంత్రంగా పిలుస్తారు. ఆయన అండతో రాజకీయాల్లోకి ఎదిగిన ప్రతి ఒక్కరు తమ తమ స్థాయిల్లో బాగా రాణించారు.
సోమిరెడ్డి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కీలకంగా కృషి చేశారు. మంత్రిగా జిల్లావ్యాప్తంగా సాగు, తాగు నీటి ఎత్తిపోతల పథకాలు, చెరువుల మరమ్మత్తులు, రోడ్ల అభివృద్ధి, కండలేరు జలాశయం కాలువల పొడిగింపు, కృష్ణపట్నం పోర్టు మరియు థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అధికారం, ప్రతిపక్షం లాంటి తారతమ్యాలు లేకుండా జిల్లా అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరిని అభినందించేవారు.
సోమిరెడ్డికి తన సొంత ఊరు అల్లీపురం ఎంతో మమకారం. "మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు. జాఫర్ సాహెబ్ కాలవ మీద వంతెన నిర్మించేలా చేశా. మా కుటుంబం తరపున నవలాకులతోట లో పాఠశాలకు స్థలాన్ని ఇచ్చాం. అల్లీపురంలో ఉన్న పాఠశాలకు రెండున్నర ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి అర ఎకరా భూమిని నా సొంత డబ్బుతో కొనుగోలు చేసి వాటి ఏర్పాటుకు సహకరించాను. ఓవర్ హెడ్ ట్యాంకు, పశువుల ఆసుపత్రి నిర్మించేలా చేశాను.ఉద్యానవనం నిర్మించా. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల కాలువలు, విద్యుత్తు దీపాలు వంటి కనీస వసతులన్నీ కల్పించా. మా ఊరికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంకాఇంకా ఏదోఏదో చెయ్యాలనే అనిపిస్తుంది. నేనీ ఊళ్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఊపిరి ఉన్నంత వరకూ ఊళ్లోనే ఉంటాను. రాకపోకలకు, నివాసానికి సదుపాయమని ఎంతమంది చెప్పినా నెల్లూరులోనూ, హైదరాబాద్‌లోనూ నేను ఇళ్లు కట్టుకోలేదు. వేరే ఎక్కడా నివసించడం నాకిష్టం ఉండదు.ఎక్కడకెళ్లినా మా ఊరే గుర్తొస్త్తుంది" అంటారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికి పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ వస్తున్నారు తప్పించి మారలేదు. కాంగ్రెస్ వాదానికి ఊపిరిగా నిలిచే నెల్లూరు ప్రాంతంలో దశాబ్దాలుగా పసుపు జెండాను మోస్తున్న అలుపెరుగని సైనికుడిగా సోమిరెడ్డిని అన్ని పార్టీల నాయకులు గౌరవిస్తారు. రాజకీయంగా విమర్శలు గుప్పిస్తారు తప్ప వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లారనే పేరును ఆయన సంపాదించుకున్నారు. బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం కంటే తన వ్యక్తిగత క్రమశిక్ష, అకుంటిత అకుంటిత దీక్షా దక్షతలతో రాజకీయాల్లో ఎదిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకునే ఎందరో యువతీ, యువకులకు ఆదర్శంగా నిలుస్తారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్