ఇండియన్ మైకెల్ జాక్సన్-ప్రభుదేవా
- April 03, 2025
ప్రభుదేవా… ఈయన డ్యాన్స్ చేస్తే.. స్టేజ్ షేక్ అవుతుంది. స్టెప్పేస్తే.. ఆడియన్స్ చూపు స్టక్ అవుతుంది. మూమెంట్ ఇస్తే.. ప్రేక్షకుల మతి పోతుంది. ఒంట్లో ఉన్నవి ఎముకలా... లేక స్ప్రింగులా అన్నట్టుంటుంది ప్రభుదేవా డ్యాన్స్‌ని చూస్తే! తన నరాల్లోనే స్వరాలు ఇమిడిపోయాయా అనిపిస్తుంది ఆయన డ్యాన్స్‌లో లయని గమనిస్తే! ఇలా తన స్పీడ్ డ్యాన్స్‌తో.. గ్రేస్ ఫుల్ మూవ్స్‌తో ఇండియన్ మైకెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్నారు. దక్షిణాది నుంచి... బాలీవుడ్ వరకు పలువురు కథానాయకులతో అదిరిపోయే స్టెప్పులేయించి ప్రభుదేవా నృత్య దర్శకుడిగా తన విశిష్టతని ప్రదర్శించారు. నర్తకునిగా, నటునిగా, దర్శకునిగా, గీతరచయితగా, గాయకునిగా ఇలా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ చిత్రసీమలో తనదైన పయనం సాగిస్తూనే ఉన్నారు. నేడు ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం ..
ప్రభుదేవా 1973, ఏప్రిల్ 3న కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో ఎం. సుందరం, మహాదేవమ్మ దంపతులకు జన్మించారు. అయితే, ప్రభు బాల్యం, విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే జరిగింది. తండ్రి సుందరం డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు ఇతర భాషలు కలిపి దాదాపు 1000కి పైగా చిత్రాలకు పనిచేశారు. ఆయన వద్ద పనిచేసిన వారందరు తర్వాత కాలంలో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్‌గా రాణిస్తూ వచ్చారు. తండ్రి స్పూర్తితో డ్యాన్స్ పట్ల చిన్న తనంలోనే ఆసక్తి పెచుకున్న ప్రభు చెన్నైలోనే భారతనాట్యం, పాశ్చాత్య నాట్యాలు నేర్చుకొని తండ్రి వద్దే అసిస్టెంట్‌గా చేరారు.
తండ్రి వద్ద పనిచేస్తున్న సమయంలోనే 1989లో కమల్ హాసన్, ప్రభు గణేశన్ హీరోలుగా నటించిన వెట్రీ విజా చిత్రంతో పూర్తి స్థాయిలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా మారారు. ప్రభు వేసే స్టెప్పులకు దర్శకులతో సహా హీరోలకు బాగా నచ్చడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒకానొక దశలో తమిళం, తెలుగు చిత్రాల్లో ప్రభుదేవా హవానే నడిచిందంటే అతిశయోక్తి కాదు అనిపిస్తుంది. అలాగే, కొరియోగ్రాఫర్‌గా బాగా రాణిస్తున్న సమయంలోనే నటుడిగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ప్రభు సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమికుడు చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయాన్ని అందుకోవడం విశేషం.
నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న సమయంలోనే తెలుగు చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తోనే ప్రభుదేవా దర్శకునిగా మారారు. తరువాత ఆ చిత్ర నిర్మాత యమ్.ఎస్.రాజు, ప్రభాస్ హీరోగా నిర్మించిన ‘పౌర్ణమి’కీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘పోకిరి’ చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా ‘పోక్కిరి’ పేరుతో రీమేక్ చేశారు. ఇక సరైన సక్సెస్ కోసం చాలా ఏళ్లగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎదురుచూస్తున్న సమయంలో ‘పోకిరి’ రీమేక్ గా ఆయనతో ‘వాంటెడ్’ గా తీసి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు.
తెలుగులో రాజమౌళి రూపొందించిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా, ఆ చిత్రం బంపర్ హిట్ అయ్యింది. ఇప్పటి దాకా 15 చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవ, నిర్మాతగా తమిళంలో “దేవి, బోగన్, సమ్ టైమ్స్” అనే మూడు చిత్రాలు నిర్మించారు. నటునిగా 2021లో ‘పొన్ మనిక్కావెల్’ తమిళచిత్రంతో యాభై సినిమాలు పూర్తి చేసుకున్న ప్రభుదేవ ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు.
డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ , డైరెక్టర్ , యాక్టర్. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ.. .. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా కొత్త కొత్త డ్యాన్స్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేసి మరీ.. సినీ డ్యాన్సుల్లో మార్పు తీసుకొచ్చారు.పరువైన ఘనవిజయాలు, పరితాపం పంచిన పరాజయాలు ప్రభుదేవా కెరీర్ లో ఉన్నాయి. అయినా ఎప్పుడూ చెరగని నవ్వుతో కనిపించే ప్రభు మళ్ళీ డాన్స్ మాస్టర్ గా తన పని తాను చేసుకుంటున్నారు. ఈ నాటికీ ఆయన నృత్యభంగిమలకు తకధిమితై అంటూ స్టెప్స్ వేస్తే చాలు అనుకొనేవారెందరో! ప్రభుదేవ మెలికలు తిరిగే నృత్యం చూసి జనం ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అన్నారు. నిజం చెప్పాలంటే, అతనికంటే ఘనుడు మన ప్రభు.
ప్రభు తన అభినయంతో నవ్వించాడు, కవ్వించాడు, కొండొకచో ఏడ్పించాడు. అన్నిటా ఆకట్టుకున్నారు. ఆపై దర్శకునిగా, నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. తన ప్రతిభను ఎన్ని విధాలుగా చాటుకున్నా, ప్రభుదేవా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన డాన్సులే. ఇప్పటికీ స్టార్ హీరోస్ ప్రభు నృత్య దర్శకత్వాన్నే కోరుకుంటున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్