మరాఠా రాజకీయ యోధుడు-శరద్ పవార్

- April 26, 2025 , by Maagulf
మరాఠా రాజకీయ యోధుడు-శరద్ పవార్

దేశ రాజకీయాల్లో అత్యున్నత గౌరవాభిమానాలను సంపాదించుకున్న నాయకుడు  శరద్ పవార్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మరాఠా రాజకీయాలను నాలుగు దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్నారు. రైతాంగ ప్రయోజనాలే తన సైద్ధాంతిక భావజాలంగా  మార్చుకొని సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో సైతం మైత్రి నెరిపే ఆయనకు గల్లీ నుంచి ఢిల్లీ దాక ఆయన్ను అభిమానించే నేతలకు కొదవలేదు. పవార్ వల్లే కేంద్రంలో యూపీఏ 1,2 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి సంపూర్ణ న్యాయం చేయగల సత్తా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నేడు మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ మీద ప్రత్యేక కథనం.

శరద్ పవార్ పూర్తి పేరు శరద్ చంద్ర గోవిందరావ్ పవార్. 1940, డిసెంబర్ 12న అవిభక్త బొంబాయి రాష్ట్రంలోని పూణే జిల్లా బారామతి తాలూకా కాటేవాడి గ్రామంలో మరాఠా సామాజికవర్గానికి చెందిన గోవిందరావ్ పవార్, శారదాబాయి దంపతులకు జన్మించారు. పవార్ తండ్రి హయాంలోనే వారి కుటుంబం సతారా జిల్లా నుంచి వచ్చి  కాటేవాడి గ్రామంలో స్థిరపడింది. పవార్ ప్రవార్ నగర్, బారామతి పట్టణాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత పూణేలోని బ్రిహన్ మహారాష్ట్ర కళాశాలలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు.  

పవార్ కుటుంబ నేపథ్యంలోకి వెళితే  తండ్రి గోవిందరావ్ బారామతి రైతాంగ సహకార సంఘంలో అధికారిగా పనిచేసేవారు. బారామతి ప్రాంతంలో సహకార చక్కర కర్మాగారాలు స్థాపనలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. తల్లి శారదాబాయి ఆరోజుల్లోనే మెట్రిక్ వరకు చదువుకొని వ్యవసాయం, రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఆరోజుల్లోనే ఆమె పూణే జిల్లా బోర్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పవార్ కుటుంబం తోలి నుంచి వామపక్ష భావజాలంతో నడిచే రైతు కూలీ పార్టీ (పి.డబ్ల్యూ.పి)లో ఉండేవారు. ఆ పార్టీ ముఖ్యనాయకులతో పాటుగా కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. పవార్ ఇంటికి తరచూ రాజకీయ నాయకులు వస్తూ, పోతూ ఉండటంతో తన చిన్నతనంలోనే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత స్కూల్లో చదివే రోజుల్లోనే గోవా విముక్తి ఉద్యమానికి మద్దతుగా తన స్నేహితులతో కలిసి పనిచేశారు. పుణేలో చదువుతున్న సమయంలోనే విద్యార్ధి రాజకీయాల్లో స్వతంత్ర నేతగా క్రియాశీలకంగా ఉంటూ పవార్ ప్యానల్ కింద అభ్యర్థులను నిలబెట్టి గెలిపించేవారు.

పూణే విద్యార్ధి రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగిన పవార్‌ను గుర్తించిన స్థానిక కాంగ్రెస్ దిగ్గజ నేతలైన భావు సాహెబ్ షిరోలే, రామ్ భావు తెలంగ్ గార్లు పవార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. బీకామ్ రెండో సంవత్సరానికే పూణే జిల్లా యూత్ కాంగ్రెస్ ముఖ్య నేతగా పవార్ ఎదిగారు. షిరోలే, తెలంగ్ సహకారంతో అప్పటి సీఎం యాశ్వంత్ రావ్ చవాన్‌కు దగ్గరయ్యారు. పవార్ రాజకీయ చతురత, కార్యనిర్వహణ దక్షతలు మెచ్చిన చవాన్‌, తన రాజకీయ వారసుడిగా ఆయన్ని రాజకీయంగా తీర్చిదిద్దుతూ వచ్చారు. చవాన్ సహకారంతో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

చవాన్ అండదండలతో 1967 అసెంబ్లీ ఎన్నికల్లో తన 27వ ఏట బారామతి అసెంబ్లీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్యెల్యేగా పవార్ ఎన్నికయ్యారు. ఆనాటి నుండి 1990 వరకు వరసగా 6 సార్లు ఎన్నికై బారామతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన కంచుకోటలాగా మార్చుకున్నారు. చవాన్ కేంద్ర క్యాబినెట్లో కీలకమైన మంత్రిగా తీరికలేకుండా ఉన్నప్పటికి పవార్ రాజకీయ ఎదుగుదలకు ప్రత్యేక శ్రద్ద తీసుకోని రాజకీయాల్లో ప్రయోగించాల్సిన సామ, దాన, భేద, దండోపాయాలను బోధించేవారు. చవాన్ ప్రాపకంలోనే పవార్ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు. 1972 నుంచి 78 వరకు వసంతరావ్ నాయక్, శంకర్ రావ్ చవాన్ మరియు వసంత్ దాదా పాటిల్ మంత్రివర్గాల్లో వ్యవసాయం, హోమ్, రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖల మంత్రిగా పనిచేశారు.

1977 లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడి కాంగ్రెస్ సీనియర్ నేతలైన దేవరాజ్ అర్స్, యశ్వంతరావ్ చవాన్ మరియు కాసు బ్రహ్మానందరెడ్డి తదితరులు కాంగ్రెస్(ఆర్స్) పార్టీగా ఏర్పడ్డారు. పవార్ సైతం చవాన్ బాటలోనే పయనించి మహారాష్ట్రలో కాంగ్రెస్(ఆర్స్) పార్టీ నేతగా ఉంటూనే వసంత్ దాదా మంత్రివర్గంలో కొనసాగారు. 1978లో కాంగ్రెస్(ఆర్స్) నుంచి తనకు మద్దతుగా ఉన్న 40 మంది ఎమ్యెల్యేలతో విడిపోయి సోషలిస్టు కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్(ఎస్)గా ఏర్పడి, జనతా పార్టీ, రైతు కూలీ పార్టీలతో చేతులు కలిపి ఐక్య ప్రజాస్వామ్య కూటమి (పి.డి.ఎఫ్) ప్రభుత్వాన్ని ఏర్పాటు 38 ఏళ్లకు సీఎంగా బాధ్యతలు చేపట్టి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. మహారాష్ట్ర సీఎంగా పవార్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం మొదలుపెట్టారు.

1978-80 వరకు మహారాష్ట్ర సీఎంగానే కాకుండా కాంగ్రెస్(ఎస్) పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు తన రాజకీయ గురువు చవాన్ గారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. అయితే, 1980 ఎన్నికల్లో ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ) అధికారంలోకి వచ్చిన వెంటనే పవార్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో పవార్ నేతృత్వంలోని కాంగ్రెస్(ఎస్) పార్టీ  ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. ఇదే సమయంలో చవాన్ ఇందిరా ఆహ్వానం మేరకు తిరిగి ఆమె పార్టీలో చేరిన రెండేళ్లకే మృతి చెందడం పవార్ రాజకీయ జీవితంలో అది ఒక తీవ్ర విషాదంగా పరిణమించింది.  

చవాన్ మరణం తర్వాత పవార్ రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్(ఎస్) పార్టీని బలోపేతం చేస్తూ వచ్చినప్పటికి, ఆ పార్టీకి చెందిన మిగిలిన జాతీయ నాయకులు తమతమ రాష్ట్రాల్లో రాజకీయ ప్రాభవం కోల్పోవడం, ఆకస్మిక మరణాలు, తిరిగి ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరడం మరియు రాజకీయాల నుంచి విరమణ తీసుకోవడం వంటి కారణాల మూలంగా జాతీయ స్థాయిలో పూర్తిగా తెరమరుగై, కేవలం మహారాష్ట్రలో మాత్రమే పవార్ నాయకత్వంలో కొన ఊపిరితో ఉండిపోయింది. పార్టీకి తిరిగి జాతీయ స్థాయిలో పునర్వైభవం తేవడమే లక్ష్యంగా 1984 లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసిన పవార్ ఎంపీగా ఎన్నికైనప్పటికి పార్టీ నాయకులందరూ ఓటమి చెందారు.

1985 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటనలు చేసి తన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసినప్పటికి ఆ ఎన్నికల్లో కేవలం 54 సీట్లకే పరిమితం అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు. 1986 నాటికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డ తర్వాత క్రమక్రమంగా కాంగ్రెస్ జాతీయ నాయకులతో పునః పరిచయాలు ఏర్పరచుకున్నారు. 1987లో తన పార్టీని కాంగ్రెస్ (ఐ)లో విలీనం చేసి రాజీవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 1988లో శంకర్ రావ్ చవాన్ స్థానంలో మహారాష్ట్ర సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. 1988-90 వరకు మహారాష్ట్రలో బలహీనమైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు వేశారు.

పవార్ నాయకత్వంలో కాంగ్రెస్ 1990 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన పవార్ 1991 వరకు కొనసాగారు. 1991 ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హఠాన్మరణంతో రిజల్ట్స్ తర్వాత  ప్రధానమంత్రి పదవిని ఎవరు చేపట్టబోతున్నారు అని ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో శరద్  పవార్ సైతం ఆ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే, కాంగ్రెస్ పార్టీలోని తన మిత్రులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు పోటీ నుంచి విరమించుకోని నరసింహారావు దేశ ప్రధాని అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు. పవార్ బలాన్ని తక్కువ అంచన వేయమని పి.వి నరసింహారావు వ్యూహాత్మకంగా తన మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. 1991-93 వరకు రక్షణ మంత్రిగా పవార్ భారత త్రివిధ దళాల బలోపేతానికి తన వంతు కృషి చేశారు.  

1993లో ముంబైలో జరిగిన మారణహోమం సమయంలో నాటి సీఎం సుధాకర్ రావ్ నాయక్ పరిస్థితిని అదుపులోకి తీసుకోని రావడంలో ఫెయిల్ అవ్వడంతో ప్రధాని అభ్యర్థన మేరకు ఆయన స్థానంలో పవార్ నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి పరిస్థితిని చక్కబెట్టారు. 1993-95 మధ్యలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసిన పవార్ 1995 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన- భాజపా కూటమి చేతిలో ఓటమి పాలైన తర్వాత 1995-96 వరకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పవార్, కాంగ్రెస్ పెద్దల సహాయనిరాకరణ వల్ల సీతారామ్ కేసరి చేతిలో ఓడిపోయారు.

1998 లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి బారామతి ఎంపీగా గెలిచి 12వ లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1999లో ఢిల్లీ ఏఐసిసి సమావేశాల్లో అధినేత సోనియా గాంధీ జాతీయతను ప్రశ్నించారనే నెపంతో పవార్, సంగ్మాలను పార్టీ నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. వారి బహిష్కరణ కంటే ముందే పవార్, సంగ్మాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1999,జూన్ 10వ తేదీన ముంబైలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని పవార్ స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పవార్ అనుచరగణం మొత్తం ఈ కొత్త పార్టీలో చేరారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా పవార్ ఎన్నికయ్యారు.

1999 అసెంబ్లీ ఎన్నికల్లో 223 స్థానాల్లో పోటీ చేసి 58 స్థానాలను కైవసం చేసుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. పవార్ ఐదోసారి సీఎం అవుతారని ప్రకటించిన రాజకీయ విశ్లేషకులు అంచనాలను తారుమారు చేస్తూ ఒకప్పటి తన కాంగ్రెస్ సహచరుడైన విలాస్ రావ్ దేశముఖ్ సీఎంను చేశారు. విలాస్ రావ్ పేరుకే సీఎంగా ఉన్నప్పటికి పవార్ తెరవెనుక ఉంటూ మహారాష్ట్రను ఐదేళ్ళ పాటు పాలించారు.    

2004 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీయే ప్రభుత్వాన్ని మూడోసారి రాకుండా నిలువరించేందుకు శరద్ పవార్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. 2004 -14 వరకు యూపీఏ 1,2 ప్రభుత్వాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టిన పవార్, వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధుల వరదను పారించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సరికొత్త వంగడాల పరిశోధనకు శాస్త్రవేత్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా మహారాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వరి, చెరుకు పంటలకు గరిష్ట మద్దతు ధరను ప్రకటించారు. అలాగే, స్వామినాథన్ కమిటీ సిఫారస్సుల్లో భాగంగా పలు విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు సుదీర్ఘ కాలం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడిగా పవార్ రికార్డ్ సృష్టించారు.

2004-14 వరకు కేంద్రంలో బిజీగా ఉంటూనే మరో పక్క మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. విలాస్ రావ్, షిండే, అశోక్ చవాన్ మరియు పృథ్వీరాజ్ చవాన్ ఇలా సీఎం ఎవరైనప్పటికి కింగ్ మేకర్ పాత్రలో రాష్ట్రాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంతో పాలిస్తూ వచ్చిన ఆయనకు 2014లో బ్రేక్ పడింది. ఆ ఏడాది మోడీ మ్యానియా వల్ల దేశవ్యాప్తంగా భాజపా పూంజుకోని కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఆ ప్రభావం మహారాష్ట్రపైన కూడా పడింది. ఫలితంగా 2014 ఎన్నికల్లో 15 ఏళ్ళ కాంగ్రెస్- ఎన్సీపీ పాలనకు ముగింపు పడింది. ఆ తర్వాత కూడా రాజకీయంగా శరద్ పవార్ వ్యతిరేక పవనాలు వీస్తూ వచ్చాయి.

దేశంలోని ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీ- షా ద్వయం 2019 లోక్ సభ ఎన్నికల నాటి నుంచి శరద్ పవార్ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టింది. వాటికి దీటుగా పవార్ సైతం బాదులిస్తూ  వచ్చారు. అయితే, శరద్ పవార్ ను విమర్శించడం ద్వారా రాజకీయ ప్రయోజనం ఓనగురని పరిస్థితుల్లో ఎన్సీపీ కీలక నేతల మీద దృష్టి సారించి వారిని దర్యాప్తు సంస్థల ద్వారా భేదిరింపులకు గురి చేస్తూ వచ్చింది. ఆ విపత్కర పరిస్థితుల్లో సైతం పవార్ సంయమనం కోల్పోకుండా తన పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని తన పార్టీకి ఘననీయమైన స్థానాలను తెచ్చిపెట్టారు. 

2019లో సీఎం పీఠం విషయంలో శివసేన భాజపా మధ్య ఉన్న పొత్తు బంధం తెగిపోవడంతో, శివసేన, ఎన్సీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి మహావికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే, కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కూటమిలోని శివసేన ఎమ్యెల్యేలను భయపెట్టి పార్టీని చీల్చి ఎన్డీయేలోకి అధికారంలోకి తీసుకువచ్చారు. అదే సమయంలో 2023లో తన అన్న కుమారుడు, రాజకీయ వారసుడైన అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి భాజపాతో చేతులు కలిపి మహాయుతి ప్రభుత్వంలో చేరడం పవార్ కొంత మానసికంగా కృంగి పోయారు.

అయితే, అదే రెట్టించిన ఉత్సాహంతో పోయిన వాళ్ళు పోగ మిగిలిన వాళ్లతో కలిసి ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీని బలోపేతం చేస్తూ 2024 లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమిని 48 స్థానాల్లో 31 లోక్ సభ సీట్లలో గెలిపించి తన సత్తా ఏంటో మోడీ- షా ద్వయానికి రుచి  చూపించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇచ్చిన జోష్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా కొన్ని తీవ్రమైన సంస్థాగత తప్పిదాలతో పాటుగా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం కొరవడి బూత్ స్థాయిలో కార్యకర్తల మధ్య వైరం కారణంగా మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో జరిగిన సంస్థాగత తప్పిదాలను శరద్ పవార్ సైతం అంగీకరించారు. 

శరద్ పవార్ రాజకీయ జీవితంలో ఎందరితోనో సన్నిహితంగా ఉన్నప్పటికి, శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరే ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. బాల్ థాకరే కార్టూనిస్టుగా ఉన్న సమయంలోనే పవార్ మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్‌లో ప్రధాన కార్యదర్శిగా ముంబై వచ్చారు. వీరిద్దరికి కావాల్సిన సన్నిహితుల ద్వారా తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఇద్దరు సన్నిహితులుగా మారారు. థాకరే శివసేన స్థాపించిన సమయంలోనే పవార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన యువనేతగా ఎదిగారు. శివసేన రాజకీయ కార్యకలాపాల్లో థాకరే బిజీగా ఉన్నప్పటికి పవార్‌తో మాత్రం మునుపటి బంధాన్ని కొనసాగించారు.

పవార్ రెండోసారి సీఎం తర్వాత నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యం మొదలైంది. శివసేన పార్టీని మహారాష్ట్రవ్యాప్తంగా విస్తరించకుండా చేయడంలో పవార్ విజయవంతం అయ్యారు. పైగా శివసేన పార్టీలో ఉన్న కీలకమైన నేతలను తనవైపు తిప్పుకొని రాజకీయంగా థాకరేపై పైచేయి సాధించారు. అయితే, రాజధాని ముంబైలో శివసేన ప్రాబల్యం తగ్గించేందుకు పవార్ ఏనాడు మనస్ఫూర్తిగా కృషి చేయాలేదని అప్పటి కాంగ్రెస్ నేతలు సైతం బహిరంగంగానే అంగీకరిస్తారు. 90వ దశకంలో మధ్య నాటికి థాకరే సైతం రాజకీయంగా పుంజుకొని మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.

రాజకీయాలు ఎలా ఉన్నప్పటికి వీరికి వ్యక్తిగతంగా బంధుత్వం కూడా ఉండటం విశేషం. పవార్ ఏకైక కుమార్తె సుప్రియ భర్త సదానంద్ సూలే థాకరే చెల్లెలి కుమారుడు. పవార్ రాజకీయాలను వ్యతిరేకించిన థాకరే సుప్రియ రాజకీయాల్లోకి రావడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. థాకరే మరణించినప్పుడు పవార్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు అని అంటారు. ఒకటి మాత్రం వాస్తవం వారిద్దరూ వేరువేరు భావజాలాలతో రాజకీయాల్లో కొనసాగినప్పటికి ఇరువురూ ఒకరినొకరు రాజకీయంగా ప్రోత్సహించుకుంటూ వచ్చారు. భారత దేశ రాజకీయాల్లో ఇటువంటి అరుదైన రాజకీయ బంధం మరెక్కడ కానరాదు.        

శరద్ పవార్ రాజకీయంగా ప్రతిపక్ష నాయకులతో విభేదించినప్పటికి, వారితో వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగేవారు. శరద్ పవార్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకున్న విస్తృతమైన రాజకీయ స్నేహ బాంధవ్యాల కారణంగానే రాజకీయాల్లో కొందరివాడుగా కాకుండా అందరివాడిగా నిలుస్తూ వచ్చారు. రాజకీయ, సినీ, వ్యాపార ఇలా సహాయం అర్థిస్తూ ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడుతూ వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకుంటూ వచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని వర్గాలతో ఉన్న విస్తృతమైన పరిచయాల మూలంగానే ఆయన దేశంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన వ్యక్తిగా రూపాంతరం చెందారు. బహుశా భారతదేశ రాజకీయాల్లో పవార్‌కి ఉన్నంత పరిచయాల వేరేవరికి లేవంటే అతిశయోక్తి కాదు అనిపిస్తుంది.

పవార్ రాజకీయాలతో పాటుగా క్రీడా రంగంలో సైతం కీలకమైన పాత్ర పోషించారు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, ఫుట్ బాల్ సంఘాలకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా భారత ఒలింపిక్ సంఘం ఆర్థిక స్థిరత్వానికి పవార్ కృషి చేసారు అనే వాదన ఉంది. వీటితో పాటుగా భారత్ క్రికెట్ రంగం అభివృద్ధికి పవార్ పనిచేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా, ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పవార్ హయాంలోనే ఇండియా జట్టు 2011లో రెండోసారి ప్రపంచ కప్ సాధించింది. వయోభారం కారణంగా క్రీడా రంగం నుంచి వైదొలిగారు.        

పవార్ సామాజిక మరియు విద్యారంగంలో సైతం తనదైన ముద్రవేశారు. రాజకీయాల్లో చేయలేని సేవలను తమ కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయిస్తూ ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు మరియు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విద్యారంగానికి వస్తే 70వ దశకంలోనే పలు ప్రాథమిక విద్యాసంస్థలను ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత విద్య ప్రాముఖ్యత అధికంగా ఉండటంతో పలు ఇంటర్, డిగ్రీ మరియు సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు పలు విద్యా సంస్థలకు నిధులు సమకూర్చారు.

ఏడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో శరద్ పవార్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తన చిరకాల వాంఛ అయిన ప్రధాని పదవి దక్కకపోయినప్పటికి ఏనాడు నిరాశ చెందలేదు. ఎందుకంటే ఆశనిరాశల ఊబిలో కొట్టుకు పోవడం ఆయనకు అలవాటు లేని విషయం. ఎన్నికల  రాజకీయాల్లో ఓటమెరుగని అజేయుడిగా నిలిచిన పవార్, తన గురువు యాశ్వంత్ రావ్ చవాన్ స్థాయిలోనే మరాఠా రాష్ట్ర ప్రజల ఆదరణ పొందారు. ఎనిమిది పదుల వయస్సులోనూ తన పార్టీని బలోపేతం చేసేందుకు, తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పిస్తూ  రోజుకు 15 గంటల పాటు శ్రమిస్తూ తనలో ఇంకా పోరాట పటిమ తగ్గలేదని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు.    

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com