ఫ్రీగా వస్తుందని పబ్లిక్ Wi-Fi తెగ వాడేస్తున్నారా?

- April 27, 2025 , by Maagulf
ఫ్రీగా వస్తుందని పబ్లిక్ Wi-Fi తెగ వాడేస్తున్నారా?

పబ్లిక్ వై-ఫైతో తస్మాత్ జాగ్రత్త.. ఫ్రీగా వస్తుందిగా అని పబ్లిక్ వై-ఫై తెగ వాడేస్తున్నారా? అన్‌సేఫ్ వై-ఫై సర్వీసులను అసలు వినియోగించకూడదు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన అనేక ప్రదేశాలలో ఫ్రీ Wi-Fi కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ Wi-Fi కనెక్షన్లకు సెక్యూరిటీ ఉండదు. ఎక్కువగా మోసాలు జరిగే ప్రమాదం ఉంటుంది. స్కామర్లు, హ్యాకర్లు ఈ పబ్లిక్ వై-ఫైలతో ట్రాప్ చేస్తుంటారు. మీ ఫోన్‌‌తో కనెక్ట్ చేయడం వల్ల మీ ప్రైవేట్ డేటాతో పాటు బ్యాంకుల లావాదేవీలు వంటి విషయాలకు చాలా ప్రమాదకరమని గమనించాలి. పబ్లిక్ వై-ఫై కనెక్షన్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

ఇలాంటి మోసాలను అరికట్టేందుకు డిజిటల్ భద్రతా అవగాహన పెంచేందుకు CERT-In ‘జాగ్రూక్త దివాస్’ చొరవ కింద పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ సున్నితమైన లావాదేవీల విషయంలో పౌరులను హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేసింది.

వ్యక్తిగత డేటా, డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు సురక్షితమైన ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. పబ్లిక్ Wi-Fi ద్వారా లావాదేవీలు చేయొద్దని CERT-In హెచ్చరిస్తోంది. కేఫ్‌లు, విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలలో పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అసురక్షిత కనెక్షన్‌లతో సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

వినియోగదారులు బ్యాంకింగ్, షాపింగ్ లేదా అసురక్షిత నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయినప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని రిజిస్టర్ చేయడం వంటి పనులను చేయడం చాలా ప్రమాదకరం. దాతో మీ వ్యక్తిగత డేటాతో పాటు ఆర్థికంగా నష్టోపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అవర్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలపై సలహాదారు సూచనలు చేసింది.

అనుమానాస్పద లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, ప్రతి ఆన్‌లైన్ అకౌంట్ లాంగ్ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని, ముఖ్యమైన ఫైల్స్ ఎక్స్‌ట్రనల్ డ్రైవ్‌లకు క్రమం తప్పకుండా బ్యాకప్ చేయాలని కోరుతోంది. వ్యక్తిగత సమాచారం విషయంలో మల్టీ లేయర్ ప్రొటెక్షన్ ఉండాలని సూచిస్తోంది.

పబ్లిక్ వై-ఫైలో ఇమెయిల్‌లను చెక్ చేయడం లేదా సోషల్ మీడియాలోకి లాగిన్ అవ్వడం వంటి ఆన్‌లైన్ యాక్టివిటీల్లో కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అదనపు భద్రత కోసం సురక్షితమైన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ని ఉపయోగించాలి. బ్రౌజర్‌లలో ఆటోఫిల్ ఆప్షన్లను కూడా నివారించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com