ఈ నెల 30నే శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటా విడుదల..

- April 29, 2025 , by Maagulf
ఈ నెల 30నే శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటా విడుదల..

తిరుమల: తిరుపతి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? శ్రీవారి సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్త సేవను అమల్లోకి తీసుకొస్తోంది.ఇందు కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ఆధ్యాత్మిక సంస్థలను టీటీడీ అధికారులు సందర్శించి అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో భాగంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.

శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) జనరల్ కోటాను ఉదయం 11 గంటలకు, పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) మధ్యాహ్నం ఒంటి గంటకు, నవనీత సేవ (మహిళలకు మాత్రమే) మధ్యాహ్నం 12 గంటలకు, గ్రూప్ లీడర్ సేవ (కొత్త సేవ) మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

గ్రూప్ లీడర్లు ఈ సేవకు 45 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండాలి. అప్పుడు తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు.15 రోజులు, నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేసేందుకు ఆన్‌లైన్ ఆప్షన్ ఎంచుకోవాలి.

శ్రీవారి సేవకులుగా పనిని పర్యవేక్షించడం, సేవకు వచ్చిన సేవకుల వివరాలు తీసుకోవడం, ప్రతి సేవకుని పనితీరును మూల్యాంకనం చేయడం బాధ్యతలు ఉంటాయి. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్‌లైన్ పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com