మానవతావాది-ఎజికె
- April 29, 2025
ఎజికె...ఈ మూడు అక్షరాలను తల్చుకుంటే నాటి రాజకీయవేత్తల నుంచి సాంప్రదాయ వాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. మూఢ నమ్మకాల జడిలో కొట్టుకుపోతున్న ఒక తరం సమాజాన్ని తన కలంతో మానవతావాదం వైపు నడిపించారు. సమాజానికి మానవవాదమే మహోన్నతమైన మార్గంగా ప్రవచిస్తూ చేసిన తార్కిక ప్రసంగాలు,హేతుబద్దమైన రచనలు సమాజాన్ని ఒక ఊపు ఊపాయి. వృత్తిరీత్యా న్యాయవాదిగా, ప్రవృత్తిరీత్యా హేతువాదిగా ఆయన రెండిట్లో సవ్యసాచిగా నిలిచారు. నేడు ప్రముఖ హేతువాద నాయకుడు ఎజికె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
ఎజికెగా సుపరిచితులైన ఆవుల గోపాల కృష్ణమూర్తి 1917,ఏప్రిల్ 29న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామంలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తురిమెళ్ళ హై స్కూల్లో ఎస్.ఎల్.సి వరకు చదివిన ఆయన గుంటూరులోని ప్రముఖ ఏసీ కాలేజీలో ఇంటర్ మరియు డిగ్రీ విద్యలను పూర్తి చేశారు. ఆ తర్వాత లక్నో యూనివర్సిటీ నుంచి ఎంఏ మరియు ఎల్.ఎల్.బి పూర్తి చేసి తెనాలిలో న్యాయవాదిగా స్థిరపడ్డారు.
ఎజికె బాల్యం నుంచి చదువుల్లోనే ముందుండడమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞాన సారాన్ని సంగ్రహణ చేస్తూ వచ్చారు. రామాయణ మరియు మహాభారతం గ్రంథాలను హైస్కూల్లో ఉన్నప్పుడే చదివేశారు. తమ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సాధు పుంగవులతో జరిపిన సంపర్కం వల్ల తాత్విక జ్ఞానాన్ని పొందారు. గుంటూరులో చదువుతున్న సమయంలోనే ఆయన ప్రపంచం మొత్తం విశాలమైన భావ తీరంలా అనిపించింది. చరిత్ర, రాజకీయ, ఆర్థిక. తర్కశాస్త్రం మరియు వామపక్ష రచనలు చదువుతూ వచ్చారు. ముఖ్యంగా హేతువాద రాజర్షిగా జేజేలు అందుకున్న త్రిపురనేని రామస్వామి రచనలు ఆయన్ని హేతువాదం వైపు నడిపించాయి. ముఖ్యంగా రామస్వామి రచనల్లో ఒకటైన సూతపురాణంలోని పద్యాలను కంఠస్తం చేశారు.
రామస్వామి రచనలు ఆవుల వారిని హేతువాదం వైపు నడిపిస్తే రాడికల్ హ్యుమానిష్టు సిద్ధాంతకర్త ఎం.ఎన్.రాయ్ రచనలు మరియు ఆలోచనలు మానవతావాదం వైపు నడిపించాయి. ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసే నాటికి హేతువాదం, మానవతావాదం పట్ల సంపూర్ణ అవగాహన తెచ్చుకున్న ఎజికె, వాటిని తన చివరి శ్వాస వరకు తన సిద్ధాంత భావజాలంగా పాటిస్తూ వచ్చారు. 1940లో రాయ్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరిన వీరు తెనాలి కేంద్రంగా ఆ పార్టీని ఆంధ్ర దేశంలో విస్తరణకు కృషి చేశారు. 1942 డిసెంబర్‌లో లక్నోలో జరిగిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మహాసభల్లో పాల్గొన్నారు.
ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే వారి సన్నిహితులు సైతం ఆయన విధానాలతో రాజీ పడలేక పార్టీకి రాజీనామా చేసినప్పటికి, మొక్కవోని దీక్షా దక్షతలతో పార్టీని నిలబెట్టేందుకు తన శాయశక్తులా కృషి చేశారు. 1946లో డెహ్రాడూన్ పార్టీ శిక్షణ తరగతుల్లో రావిపూడి వేంకటాద్రి, జి.వి.కృష్ణారావు, యలవర్తి రోశయ్య మరియు పలువురు నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇదే సమయంలోనే రాయ్ భావజాల వైఖరిలో వస్తున్న మార్పులను పసిగట్టారు. 1948లో రాడికల్ డెమొక్రటిక్ పార్టీని రాయ్ రద్దు చేయడాన్ని తీవ్రంగా విభేదించిన ఎజికె రాడికల్ డెమొక్రటిక్ వాదాన్ని పక్కనబెట్టి రాడికల్ హ్యుమానిష్టుగా కొనసాగారు.
ఎజికె పార్టీ రాజకీయాలకు దూరమైనప్పటికి తెనాలి పురపాలక సంఘం వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. న్యాయవాదిగా రాణిస్తూనే పురపాలక సంఘానికి కౌన్సిలర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. 1954-56 వరకు తెనాలి పురపాలక సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తెనాలి నగరంలో రోడ్లు, వీధిదీపాలు మరియు పార్కులను అభివృద్ధి పరిచారు. తన పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా మరోసారి పోటీ చేయాలని కోరినా నిర్ద్వందంగా తిరస్కరించారు.
ఎజికె రాజకీయాలకు దూరం జరిగినప్పటి నుంచి రాడికల్ హ్యుమానిష్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. మానవతావాదం అందరి వాదంగా మారాలని, అందుకు చేయాల్సిన కృషిని చేస్తూ పోయేందుకు అధ్యయ, శిక్షణ తరగతులు విస్తృతంగా నిర్వహించారు. 1948 నాటి నుండి మరణించే వరకు హ్యూమనిజం ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అఖిలభారత స్థాయిలో మానవవాద, హేతువాద, లౌకిక వాద, నాస్తిక వాద నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. తెనాలిలో అఖిలభారత హేతువాద సభలు పెట్టి, ద్రవిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైను పిలిచారు. కులమతాలకు అతీతంగా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని చేరదీశారు. కులమత జాడ్యాలను సమాజంలో రూపుమాపేందుకు తెనాలి కేంద్రంగా లౌకిక వివాహాలకు శ్రీకారం చుట్టి కొన్ని వందల వివాహాలను జరిపించారు.
1940 నాటికే తెలుగు ప్రాంతంలో అడిగిన చిన్న పత్రికలన్నింటికీ వ్యాసాలు రాశారు. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉపన్యాసాలు చేసి ఎందరినో తర్ఫీదు చేశారు. అప్పుడే ఆయన్ను వ్యాసోపన్యాసకుడు అన్నాడు. ఎంతటి జటిలమైన విషయాన్నయినా విడమరచి చూపడంలో ఆయన సిద్ధహస్తుడు. 1940లోనే 'రాడికల్' అనే పత్రిక తెనాలి నుండి వెలువడింది. ఆ తరువాత 'సమీక్ష', 'రాడికల్ హ్యూమనిస్ట్' అనే పత్రికలుగా అవి రూపాంతరం చెందాయి. వాటిలో కూడా నిర్విరామంగా ఎజికె 'వాహిని పత్రిక'లో 'నా చుట్టూ ప్రపంచం' శీర్షిక నిర్వహించారు. 'ప్రజావాణి', 'కృష్ణాపత్రిక', 'ఆంధ్రపత్రిక', 'భారతి' ఇలా ఎన్నో పత్రికలలో ఆయా విషయాలపై విశ్లేషణ చేశారు.
అలాగే ఎలాంటి సిద్ధాంతానైనా అందరికీ అర్థమయ్యేటట్లు రాయడంలో ఎజికె చాకచక్యం చూపించారు. వాదోపవాదాలలో నిగ్గుదేలిన వ్యక్తి. రాజకీయాలలో ఉన్న ప్రతిభ సాహిత్యరంగంలోనూ కనబరిచారు. ఇంగ్లీషులో ఆయన రాడికల్ హ్యూమనిస్ట్, ఇండియన్ రేషనలిస్ట్, వంటి పత్రికలకు వ్యాసాలు రాశారు. రవీంద్రనాథ టాగోర్ పై నిశిత పరిశీలనతో కూడిన విమర్శలు చేసినప్పుడు, కొందరు బెంగాలీ రాడికల్ హ్యూమనిస్ట్ లు నొచ్చుకున్నారు. కానీ సమాధానం చెప్పలేకపోయారు.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలి అనేది ఎజికె నినాదం. ఔచిత్య లోపాన్ని చూపి ఎంతటి వారినైనా ఘాటుగా విమర్శించేవారు. ఔచిత్యం వుంటే ఎంతటి చిన్న కవి అయినా ఆదరించి, మెచ్చుకొని అభినందించేవారు. అలాంటి విషయంలో కుల, మత మరియు ప్రాంతీయ పక్షపాతాలుండేవి కావు.
జాషువా, తల్లా పిచ్చయ్య శాస్త్రి, కాటూరి వెంకటేశ్వరరావు, పరుపూరు కోదండరామిరెడ్డి, ఏటుకూరి వెంకటనరసయ్య త్రిపురనేని రామస్వామి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి, వివి నరసింహారావు, అమ్మిసెట్టి లక్ష్మయ్య, కొల్లా శ్రీకృష్ణారావు, గౌరిబోయిన బోలయ్య, కొండవీటి వెంకటకవి, రావిపూడి వెంకటాద్రి, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఎన్.వి.బ్రహ్మం, దేవరకొండ వెంకట సుబ్బయ్య రచనలకు అర్థవంతమైన లోతుపాతులతో కూడిన పీఠికలు రాశారు. ఇలా ఎందరిని గురించో చక్కగా రాశారు. అలాగే మరెందరిని గురించే తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన విమర్శకు గురయిన కల్లూరి చంద్రమౌళి, విశ్వనాథ సత్యనారాయణ ఉన్నారు.
సాహిత్య రంగంలో లోతుపాతులతో కూడిన విమర్శలు చేసినప్పుడు ఆయన్ని ఎదుర్కొనటానికి ప్రయత్నించినవారు వాదనలో విఫలమయ్యారు. నన్నయ భారతం పై ఆయన విమర్శలు చాలా గంభీరంగా లోతుపాతులతో వుండేవి. లౌకిక వివాహాలు జరిపినప్పుడు ప్రతి పెళ్ళికి ఆయన ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అది ఒక ప్రత్యేక ఆకర్షణ. చిన్నా పెద్దా సభలు అని చూడకుండా మారుమూల గ్రామాలతో సహా ఎక్కడకు ఎవరు పిలిచినా ఒక్కొక్కసారి వెళ్ళేవాడు. అందువలన న్యాయవాద వృత్తి కూడా దెబ్బతిన్నది.
రాజకీయ నాయకుల్లో కొందరు ఆయన విమర్శకు బాగా గురయ్యారు. మరికొందరు ఆకర్షితులయ్యారు. సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా, చందూలాల్ త్రివేదీ గవర్నర్ గా, దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా, కల్లూరి చంద్రమౌళి, ఎస్. వి.వి.బి.పి. పట్టాభిరామారావు మంత్రులుగా ఆయన విమర్శ బాణాలకు గురయ్యారు. ఒకే ఒకసారి తెనాలి మున్సిపల్ ఛైర్మన్ అయిన ఎజికె హయాములో రాష్ట్ర గవర్నర్ త్రివేది వచ్చారు. తెనాలిలో ప్రోటోకోల్ పాటించకుండా మరేదో సభకు వెళ్ళి మునిసిపాలిటీ కార్యక్రమానికి ద్వితీయ ప్రాధాన్యత ఇచ్చి వచ్చారు. అప్పుడు స్వాగతం పలుకుతూ ఎజికె ఐసిఎస్ అధికారి రూల్స్ తెలిసిన గవర్నర్ ఔచిత్యం పాటించకుండా అవతల సభకు వెళ్ళి మునిసిపాలిటీని చిన్న చూపు చూశారని ఎత్తిపొడిచి విమర్శించిన ఎజికెను గవర్నర్ మెచ్చుకొనక తప్పలేదు.
ముఖ్యమంత్రిగా వుండగా తెనాలి వచ్చిన నీలం సంజీవరెడ్డి మునిసిపాలిటీ వారు కోరిన రెండు రోడ్లలో ఒకటి మంజూరు చేశామని ఇటీవల ఏ మునిసిపాలిటీకి చేయలేదని సంజీవ రెడ్డి చెప్పగా జనం తప్పట్లు కొట్టారు. దానికి మునిసిపల్ ఛైర్మన్ గా ఎజికె. స్పందిస్తూ అడిగిన రెండు రోడ్లలో ఒకటి లక్షన్నర రూపాయల విలువగలదని, రెండవది ఏభైవేల రూపాయల విలువగలదని సంజీవరెడ్డిగారు లక్షన్నర విలువగల రోడ్డును మంజూరు చేస్తే వారి మాటకు తెనాలి పౌరుల శ్లాఘిస్తారని అనడంతో తప్పట్లు మిన్నుముట్టాయి. అర్థం చేసుకున్న సంజీవరెడ్డి వేదిక మీద ఏమీ అనలేక ఆయన్ను పిలుచుకు వచ్చిన మున్సిపల్ మంత్రి ఆలపాటి వెంకట్రామయ్యపై ట్రావెలర్స్ బంగళాలో ఆగ్రహించారు.
దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా విజయవాడ వచ్చి ఒక కొండ గుట్టమీద దళిత బాలికల వసతి గృహాన్ని సందర్శించాల్సి వుండగా 'నేను ఆ గుట్ట ఎక్కలేనని' వెళ్ళిపోయారు. దళిత బాలికలు ఎంతో నిరుత్సాహ పడ్డారు. ఆ విషయాన్ని ఆంధ్రపత్రిక విలేఖరి వెంకటప్పయ్య శాస్త్రి ఎజికెకి చెప్పినప్పుడు 'ముఖ్యమంత్రి పదవికి దేక గలిగినపుడు చిన్న గుట్ట ఎక్కలేకపోయాడా' అన్నాడు. ఆ విషయాన్ని ఆంధ్రపత్రికలో పతాక శీర్షికలతో ప్రచురించారు. సంజీవయ్య స్పందిస్తూ మీ విమర్శ నాకు తగిలింది. నచ్చింది. తక్షణమే బాలికల వసతి గృహాన్ని సందర్శిస్తానని ఎజికెకి తెలియపరిచారు.
బుద్ధుణ్ణి కలియుగంలో రాక్షసుడిగా చిత్రించిన విశ్వనాథ సత్యనారాయణ రచనను ఐదవతరగతి పాఠ్యగ్రంథంలో పెట్టినప్పుడు విద్యామంత్రి పట్టాభిరామారావు పైన, ప్రభుత్వం పైన ఆయన చేసిన తీవ్ర విమర్శకు ఫలితంగా ఆ పాఠాన్ని తొలగించారు. సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోవిందరాజులు నాయుడు గారు గౌరవ డాక్టరేట్ ఆయనకు ప్రసాదించారు. అప్పుడు యూనివర్సిటీ సెనేట్ మెంబర్‌గా ఉన్న విజయరాజకుమార్, సెనేట్‌కు చెప్పకుండా అలాంటి డిగ్రీ ఇవ్వటం చట్ట విరుద్ధమని కోర్టులో దావా వేశారు.
అప్పుడు ఆ కేసును వాదించేందుకు ముందుకు వచ్చింది ఎజికె మాత్రమే. కోర్టులో ఆయన అవతల ప్లీడరును ముప్పుతిప్పలు పెట్టినా చివరకు ఎజికె వాదనను తట్టుకోలేక నెల్లూరు కోర్టులో నడుస్తున్న కేసును తన పరిధిలో అది లేదని జడ్జి లౌకికంగా తిరుపతిలో అది వేసుకోమని తప్పుకున్నాడు. అప్పట్లో ఎజికె వాదనలు కోర్టులో వినటానికి చాలామంది నెల్లూరు కోర్టుకు ఆసక్తిగా వచ్చేవారు
ఎజికె గొప్ప వక్త. 1955లో ఎమ్.ఎన్. రాయ్ చనిపోయారు. దేశంలోని పత్రికలన్నీ ప్రధానంగా ఆ వార్తను ప్రచురించాయి. కానీ, ఆనాడు తెలుగువారిలో తిరుగులేని పత్రికగా వున్న ఆంధ్రప్రభ నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన ఆ వార్తను వెయ్యలేదు. గుంటూరు హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో పెద్ద సభ జరగగా వల్లభ జోస్యుల సుబ్బారావు అధ్యక్షత వహించారు.
ఆవుల గోపాల కృష్ణమూర్తి మాట్లాడుతూ "ఎవడో ఒక టొంపాయ్ చనిపోతే 'ఒక వట వృక్షం కూలింది. ఒక తార రాలింది" అని పెద్దక్షరాలతో ప్రచురించే ఆంధ్రప్రభ సంపాదకుడికి ఎమ్.ఎన్.రాయ్ ఎవరో తెలియదా?” ఆని ప్రసంగించారు. అక్కడున్న ఆంధ్రప్రభ విలేఖరి సోమయాజులు ఆ వార్తను పంపగా నార్ల వెంకటేశ్వరరావు దిగి వచ్చి గుత్తికొండ నరహరికి ఫోను చేసి ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యాన్ని తెప్పించుకుని చదివి మానవవాదిగా మారారు. ఆ తరువాత ఎజికెతో గాఢ స్నేహం కూడా పెరిగింది. అది ఎజికె ప్రసంగ పలుకు విశేషం.
"ఎజికె మాట్లాడిన తరువాత ఇక నేను మాట్లాడవలసినదేమీ లేదు. అద్భుతంగా విషయ విశదీకరణ చేసారు” అని 1957లో చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) బాపట్ల బహిరంగ సభలో చెప్పిన మాటలు చరిత్రాత్మకాలు. ఆనాడు కాంగ్రెసు ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా దేశంలో సహకార వ్యవసాయం ప్రవేశపెట్టాలని దీనికి గాను రాజ్యంగా సవరణ చేయాలని (17వ సవరణ) తలపెట్టారు. దీనిపై రైతుల స్వేచ్ఛ స్వాతంత్య్రం హరించే ప్రయత్నంగా దేశంలో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఆ ఘట్టంలో గుంటూరు జిల్లా బాపట్లలో పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు మాజీ గవర్నర్ జనరల్, మదరాసు మాజీ ముఖ్యమంత్రి రాజాజీ, రైతు నాయకుడుగా ఆచార్యరంగా, మదరాసు కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు బెజవాడ రామచంద్రారెడ్డి వంటి వాళ్లంతా సభావేదికపై వున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనం జెండాలు పట్టుకుని కూర్చున్నారు.
అప్పుడు ఎజికె తొలి ప్రసంగం చేస్తూ నెహ్రూ నియంతృత్వ పోకడలు, సహకార వ్యవసాయం పేరిట రైతుల స్వామ్యాన్ని హరించే యత్నం, సోవియట్ రష్యాను అనుకరించే ప్రణాళికా విధానం, అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు హర్షధ్వానాల మధ్య ప్రసంగించారు. అంతటితో ముగ్ధుడైపోయిన రాజాజీ " ఇక నేను ఇక్కడ మాట్లాడవలసిందేమీ లేదు. నాకు బాగా నచ్చిన ఉపన్యాసమిది" అని జనం తప్పట్లు కొడుతూండగా అన్నారు. అది ఎజికె ప్రతిభకు ఒక గీటురాయి.
ఎజికె రచనలు ఎక్కువగా వ్యాసాలుగానే వుండిపోయాయి. 'సాహిత్యంలో ఔచిత్యం', 'హ్యూమనిజం', 'ఎజికె సూక్తులు' అనే శీర్షికలతో కొన్ని రచనలు పుస్తకరూపం దాల్చాయి. అమెరికా పర్యటన గురించి ఎజికె తెలుగులో 'నా అమెరికా పర్యటన' పేరిట పుస్తకం రాశారు. ఎజికె 1967, సెప్టెంబర్ 6న గుండెపోటుతో తన 50 వ ఏట తెనాలిలోనే కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!