దర్శక దిగ్గజం-పి.పుల్లయ్య
- May 02, 2025
ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తారు. తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు సి.పుల్లయ్య కాగా, మరొకరు పి. పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. వారిలో పి.పుల్లయ్య తన అభిరుచికి తగ్గ చిత్రాలనూ అందించారు. నేడు ప్రఖ్యాత దర్శక దిగ్గజం పి.పుల్లయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
పి.పుల్లయ్య పూర్తి పేరు పోలుదాసు పుల్లయ్య 1911 మే 2న నెల్లూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలపై విపరీతమైన మక్కువ ఉండేది పుల్లయ్యకు. అలా ఆ ఇష్టం పెరిగి పెరిగి పుల్లయ్య చిత్రసీమకు పరుగు తీసేలా చేసింది. అప్పట్లో కలకత్తాలో కానీ, బొంబాయిలో కానీ సినిమాల నిర్మాణం సాగేది. అక్కడకు వెళ్ళి సినిమాలకు దర్శకత్వం వహించిన వారిలో పి.పుల్లయ్య ఒకరు. 1935లో ‘హరిశ్చంద్ర’ చిత్రం ద్వారా పుల్లయ్య దర్శకునిగా పరిచయం అయ్యారు. అదే సమయంలో ‘శశిరేఖా పరిణయం’లో శశిరేఖగా నటించి, విశేషాదరణ చూరగొన్నారు నటి శాంతకుమారి. ఆమె అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. ఆమెను చిత్రాంగిగా నటింపచేసి, పి.పుల్లయ్య ‘సారంగధర’ రూపొందించారు. ఆ సినిమా తరువాత పుల్లయ్య, శాంతకుమారి నడుమ ప్రేమ చిగురించింది. తరువాత కళ్యాణం జరిగింది.
శ్రీవేంకటేశ్వర స్వామి లీలల నేపథ్యంలో ‘బాలాజీ’ చిత్రాన్ని 1939లో తెరకెక్కించారు పుల్లయ్య. ఇందులో పద్మావతిగా శాంతకుమారి నటించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ తరువాత ఇదే ఇతివృత్తంతో 1960లో తమ పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రం రూపొందించారు పుల్లయ్య. ఇందులో శ్రీనివాసునిగా యన్టీఆర్ నటించగా, శాంతకుమారి వకుళామాతగా నటించడం విశేషం! ఈ సినిమా అప్పట్లో థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని ప్రతీతి.
పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘ధర్మపత్ని’ ద్వారానే ఏయన్నార్ తొలిసారి తెరపై కనిపించారు. “ప్రేమబంధం, సుభద్ర, భాగ్యలక్ష్మి, మాయామశ్చీంద్ర, భక్త జన, ధర్మదేవత, రేచుక్క, కన్యాశుల్కం, అర్ధాంగి, ఉమాసుందరి, జయభేరి, బండరాముడు, సిరిసంపదలు, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు, అల్లుడే మేనల్లుడు, కొడుకు-కోడలు, అందరూ బాగుండాలి” వంటి తెలుగు చిత్రాలు, “మచ్చ రేకై, వీటుకారి, మనం పోల మాంగల్యం, పెన్నిన్ పెరుమై, ఇల్లారమే నల్లారం, ఆసై ముగం, తాయే ఉనక్కాగ” మొదలైన తమిళ చిత్రాలను పి.పుల్లయ్య రూపొందించారు. యు.విశ్వేశ్వరరావు నిర్మించి, దర్శకత్వం వహించిన ‘హరిశ్చంద్రుడు’ చిత్రంలో పి.పుల్లయ్య నటించి అలరించారు. ‘హరిశ్చంద్ర’ (1935) చిత్రంతో దర్శకునిగా పరిచయమైన పి.పుల్లయ్య, ‘హరిశ్చంద్రుడు’ (1980)లో నటించడం విశేషం!
చిత్రసీమ తొలి రోజుల్లోనే అలా పలువురి చేత ‘మమ్మీ-డాడీ’ అని పిలిపించుకొని ఆనందించారు దర్శకనిర్మాత పి.పుల్లయ్య, ఆయన సతీమణి శాంతకుమారి. అలా పిలిపించుకోవడమే కాదు, నిజంగానే పలువురికి అండగా నిలచి, ఆదుకున్నారు ఆ దంపతులు. ఈ భార్యాభర్తల మధ్య సరసం కూడా అలాగే ఉండేది. కోపం వస్తే చాలు పి.పుల్లయ్య అగ్గిమీద గుగ్గిలమైపోయి తనకు తెలిసిన ‘బూతులన్నీ’ వల్లించే దాకా శాంతించేవారు కారు. ఇక శాంతకుమారి పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. భర్త తీరు తెలిసిన శాంతకుమారి ఆయన శాంతించే దాకా పన్నెత్తు మాటనే వారు కారు. అంతా సద్దుమణిగాక, “అంత ఆయాసపడడం ఎందుకూ!?” అనేవారు. దాంతో పుల్లయ్య కూడా “ఈ పాడు కోపం…” అంటూ మళ్ళీ రెండు మూడు బూతులు తనను తాను తిట్టుకున్నాకే స్తిమితపడేవారట!
తాను దర్శకత్వం వహించే చిత్రాలలో తప్పకుండా భార్య శాంతకుమారికి తగిన పాత్రలు ఇచ్చేవారు. తాను తీసిన ‘బాలాజీ’ (శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం)లో శాంతకుమారిని పద్మావతిగా నటింపచేశారు. తరువాత అదే కథతో 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా తెరకెక్కించిన సమయంలో శాంతకుమారిని అందులో వకుళమాత పాత్రలో చూపించారు. ఇలా తన అర్ధాంగికి తగ్గ పాత్రలలోనే ఆమెను నటింపచేశారు పుల్లయ్య.
పి.పుల్లయ్య తీసిన ‘అర్ధాంగి’ సమయంలోనూ ఈ దంపతుల సరసం గురించి ఇప్పటికీ భలేగా చెప్పుకుంటారు. పుల్లయ్య ‘అర్ధాంగి’ చిత్రం తెరకెక్కించే రోజుల్లో ఏయన్నార్ ను ప్రధాన పాత్రకు, అందులో ప్రతినాయక పాత్రను పోలిన పాత్రలో జగ్గయ్యను ఎంపిక చేసుకున్నారు. ఇక వారి తల్లిగా శాంతకుమారిని ఎంచుకున్నారు. ఆమెకు తగ్గ భర్త పాత్రధారి కోసం అన్వేషించసాగారు పుల్లయ్య. ఆ క్రమంలో రోజుకో నటుణ్ణి తీసుకు వచ్చి “ఏమేవ్… నీకు మొగుణ్ణి పట్టుకు వచ్చాను ఇలా రా…చూద్దువు…” అనేవారు. ఆ సినిమాకు ఆ దంపతులు నిర్మాణబాధ్యతలూ నిర్వహించడంతో శాంతకుమారి సైతం నటీనటుల ఎంపికలో పాల్గొనేవారు.
తన సరసన నటించడానికి పనికి రాడని భావిస్తే “అబ్బే…” అనేవారు శాంతకుమారి. చివరకు గుమ్మడిని ‘అర్ధాంగి’లో శాంతకుమారి భర్త పాత్రకు తెచ్చారు. గుమ్మడిని ఎగాదిగా చూసి, ఇతను మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాడండీ అంటే – నిజమే మరి నాగేశ్వరరావు కంటే చిన్నవాడే అని పుల్లయ్య చెప్పారట. “మరింకెందుకు…?” అన్నారట శాంతకుమారి. ‘వయసుతో పనేముందే… నటనలోనే ఉంది… ఇతనే నీకు మొగుడు… ఇది ఫైనల్’ అన్నారట. “మీ మాటలకు ఆ అబ్బాయి కంగారు పడేట్టున్నాడు… ఏమనుకోమాకు బాబూ… మా ఆయన ఎప్పుడూ అంతే…” అని శాంతకుమారి చెప్పారట. ఈ విషయాన్ని గుమ్మడి పదే పదే చెప్పేవారు. ‘అర్ధాంగి’లో నటించిన తరువాతే నాయికానాయకులకు తండ్రి పాత్రల్లో గుమ్మడి బిజీ కావడం విశేషం!
పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు ప్రేక్షకుల రివార్డులతో పాటు, ప్రభుత్వ అవార్డులనూ అందుకున్నాయి. 1981లో పి.పుల్లయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేశారు. ఆ తరువాత 1999లో ఆయన భార్య శాంతకుమారి కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకోవడం విశేషం! అప్పట్లో తెలుగు సినిమా రంగంలోని వారు పి.పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అని పిలిచేవారు. 1987 మే 29న పి.పుల్లయ్య కన్నుమూశారు. ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ఈ నాటికీ బుల్లితెరపై సందడి చేస్తూనే ఉన్నాయి.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







