ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పై సీఎం రేవంత్ స‌మీక్ష!

- May 07, 2025 , by Maagulf
ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పై సీఎం రేవంత్ స‌మీక్ష!

హైదరాబాద్: హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ నిర్వహించిన నేపథ్యంలో పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మరోసారి సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (8వ తేదీ) సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీ, అందుకు తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించారు. ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. “తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటన” గా ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.

అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలి..

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైన ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు సీఎం.

వైద్యం, పౌరసరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రక్షణ రంగంలో వ్యూహాత్మకమైన హైదరాబాద్‌లో అవసరమైన అన్ని చోట్ల గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల‌ని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సందర్భంగా పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. పాత నేరస్తులు, ఇతర నేర చరిత్ర కలిగిన వారిపట్ల పోలీసులు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని… కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com