శ్రీవారి భక్తులకు సాంప్రదాయ వంటకాలు అందించాలి
- May 09, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలోని ఆస్థానమండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను భక్తిశ్రద్ధలతో అందించాలన్నారు. తిరుమల యాత్ర భక్తులకు ఒక మధురానుభూతిని కల్పించాలన్నారు. హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళుతున్నారని చెప్పారు. హోటళ్ల యజమానులు చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్లిస్ట్ అందిస్తుందని, దానిని తప్పకుండా పాటించాలన్నారు. టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో 33 అన్నప్రసాద కౌంటర్లలో టీటీడీ నాణ్యమైన భోజనం అందిస్తోందన్నారు. అదేవిధంగా భగవంతుని సన్నిధిలోని హోటళ్ల యజమానులు కూడా మంచి తినుబండారాలు అందించాలన్నారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
హోటల్లో నిర్వాహకులు, పనిచేసే సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణ ధరించి భక్తులకు సేవలందించాలని, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడాలన్నారు.
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. హోటల్లో వద్ద ట్రేడ్ లైసెన్స్, జిఎస్టి వంటి ధ్రువీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలా డిస్ప్లే చేయాలన్నారు.భక్తులు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.హోటల్ నిర్వహణ లైసెన్సును నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు. అన్ని దుకాణాలలో ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు సిలిండర్ ఏర్పాటు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులు నడిగి తెలుసుకోవాలన్నారు.హోటళ్ల లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, హోటల్లో యజమానులు సమిష్టిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
భక్తులకు సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు నీరు, విద్యుత్తు వృధా కాకుండా వినియోగించుకోవాలని చెప్పారు. త్వరలో ఐదు నుండి 10 హోటళ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధి విధానాలు అమలు అయ్యేలా నిర్వాహకులు సహకరించాలన్నారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను టీటీడీ అధికారులు అందిస్తారని వివరించారు.
అనంతరం హోటళ్ల నిర్వాహకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అదనపు ఈవోకి వివరించారు.దీని పై ఆయన అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈ వో సోమన్నారాయణ, ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శాస్త్రి, విజిఓలు సదాలక్ష్మి,సురేంద్ర ఇతర అధికారులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI