హజ్‌ యాత్రికులకు శుభాభినందనలు : సీఎం రేవంత్

- May 16, 2025 , by Maagulf
హజ్‌ యాత్రికులకు శుభాభినందనలు : సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణలోని మైనారిటీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో అవసరమైన మేరకు ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ముస్లింలలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో వారి జనాభా మేరకు అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

హజ్‌ యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ…సంబంధించిన బస్సులను నాంపల్లి హజ్‌ హౌజ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, యాత్రికులకు శుభాభినందనలు తెలియజేశారు.

హజ్ యాత్రికుల సౌకర్యార్థం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మామిడిపల్లిలో వసతి భవనం (రూబత్) నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లి ప్రార్థనలు చేయాలని అనుకుంటారని, ఈసారి ప్రభుత్వానికి 6 వేల దరఖాస్తులు అందితే వాటన్నింటినీ ఆమోదించినట్టు చెప్పారు.

“హజ్‌కు వెళుతున్న యాత్రికులు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ప్రజల శాంతియుత జీవనం కోసం అల్లాను ప్రార్థించండి. హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంది. భవిష్యత్తులోనూ మీ నుంచి వచ్చే అభ్యర్థనల విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేస్తుంది. అది మా బాధ్యత” అని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com