విలక్షణమైన నటుడు-చంద్రమోహన్

- May 23, 2025 , by Maagulf
విలక్షణమైన నటుడు-చంద్రమోహన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుల జాబితా తీస్తే అందులో ముందువరసన చంద్రమోహన్ పేరు కచ్చితంగా ఉండి  తీరుతుంది. హీరో అవ్వాలనే కోరికతో మద్రాస్ వచ్చిన ఆయన దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా నటించారు. తనకు దక్కిన పాత్ర చిన్నదా, పెద్దదా అనే తారతమ్యాలు లేకుండా పాత్రలో వొదిగిపోయి అబాల గోపాలన్ని అలరిస్తూ తన నట ప్రస్తానాన్ని ముందుకు సాగించారు. నేడు విలక్షణ నటుడు చంద్రమోహన్ జయంతి సందర్బంగా ప్రత్యేక కథనం..

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1945 మే 23న ఉమ్మడి కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో  మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, చంద్రమోహన్‌కు అన్న వరుస అవుతారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్‌లో అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు.

కెరీర్ ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు. బి.యన్. తెరకెక్కించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో కథానాయకునిగా పరిచయమైన చంద్రమోహన్, తరువాత తన దరికి చేరిన పాత్రలన్నిటికీ న్యాయం చేయడానికి తపించారు. నాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య గార్ల చిత్రాల్లో కీలకమైన పాత్రలు సంపాదించారు. ఇక తన తరం హీరోలైన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిత్రాలలోనూ ముఖ్యపాత్రలు ధరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఒకానొక దశలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. ఆ సమయంలో ఏడాదికి ఇరవై చిత్రాల్లో నటించి భళా అనిపించారు .

ప్రతిభ లేకుంటే ఏ అన్న కూడా ఆదరించలేడు కదా! అలాగే విశ్వనాథ్ తన చిత్రాల్లో చంద్రమోహన్ కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన “సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం” వంటి చిత్రాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి. “ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, పెళ్ళిచూపులు, రాధాకళ్యాణం, మూడుముళ్ళు” మొదలైన చిత్రాల్లోనూ చంద్రమోహన్ హీరోగా నటించి మెప్పించారు.

చంద్రమోహన్ సరసన నటించే కొత్త హీరోయిన్ ఎవరైనా ఇండస్ట్రీని దున్నేస్తారనే సెంటిమెంట్ ఆ రోజుల్లో బలంగా ఉండేది. ఆయన సరసన నాయికలుగా నటించిన జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి వంటి వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు. అప్పటి నుంచీ కొత్త అమ్మాయిలు చంద్రమోహన్ సరసన నటించడానికి ఉత్సాహం ప్రదర్శించేవారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. వారికి ఇద్దరు కుమార్తెలు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. కానీ చంద్రమోహన్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు.

ఓ వైపు కథానాయకునిగా నటిస్తూనే మరోవైపు ఇతరుల చిత్రాల్లోనూ కీలక పాత్రలు ధరించేవారు. అదే ఆయన కెరీర్ ను ఇంతకాలం లాక్కువచ్చిందని చెప్పవచ్చు. హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలకు చాలా తేలిగ్గా షిఫ్ట్ అయిన తర్వాత అక్కడా తనదైన ప్రత్యేకత చాటారు. తనతో కో హీరోగా కలిసి నటించిన చిరంజీవికి తండ్రిగా కూడా చేసి తన నట వైదుష్యాన్ని నిరూపించుకున్నారు. తరువాతి తరం హీరోల చిత్రాలలో అన్నగా, బావగా, మామగా, తండ్రిగా నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇప్పటి యంగ్ హీరోస్ సినిమాల్లో తాతగానూ కనిపించారు. చనిపోయే ముందు వరకూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు.  2017లో వచ్చిన ఆక్సిజన్ సినిమా చంద్రమోహన్ చివరి చిత్రం.  
 
కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన చంద్రమోహన్ దాదాపు 932 సినిమాల్లో విరామం లేకుండా నటించారు. పదహారేళ్ల వయసు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నారు. అతనొక్కడే సినిమాకు ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు.  

‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు. అలా పలు ప్రశంసలు అందుకుంటూనే  తనదైన అభినయంతో జనాన్ని పరవశింపజేసిన చంద్రమోహన్ 2023, నవంబరు 11న దీపావళి పండుగకు ఒకరోజు ముందు అనారోగ్యంతో తన 81వ ఏట చెన్నైలో కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com