నరమాంస భక్షకుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

- May 26, 2025 , by Maagulf
నరమాంస భక్షకుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

ఉత్తర్‌ప్రదేశ్‌: మనిషిని చంపి…ఆ తలతో సూప్ చేసుకుని త్రాగే నరమాంశ భక్షకుడికి ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నూ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

ఇద్దరు వ్యక్తుల హత్యకేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సీరియల్‌ కిల్లర్‌ రామ్‌ నిరంజన్‌ అలియాస్‌ రాజా కోలందర్, అతడి సహచరుడు బక్ష్‌రాజ్‌ కు లఖ్‌నవూ కోర్టు జీవితఖైదు విధించింది.

కోలందర్‌ నరమాంస భక్షకుడని, మనిషి తలతో చేసిన సూప్‌ తాగడానికి ఇష్టపడేవాడనే ఆరోపణలు ఉన్నాయి. జడ్జి శిక్ష విధించే సమయంలో కోలందర్‌ కోర్టు గదిలో నవ్వుతూ కనిపించాడు. అతడిలో ఎటువంటి పశ్చాత్తాపం, భయం కనిపించలేదు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్టు ధీరేంద్రసింగ్‌ హత్యకేసులో కోలందర్‌పై మొదటి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు అతడి బండారం బయటపడి, అనేక ఇతర నేరాలు వెలుగులోకి వచ్చాయి.

ధీరేంద్రసింగ్‌ హత్యకేసు దర్యాప్తు కోసం పోలీసులు కోలందర్‌ ఫామ్‌హౌసుకు వెళ్లగా అక్కడ మనుషుల పుర్రెలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని కోలందర్‌ను ప్రశ్నించగా… పాతికేళ్ల కిందట 2000 సంవత్సరంలో మనోజ్‌ అనే వ్యక్తిని, అతడి డ్రైవరు రవిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు కోలందర్, బక్ష్‌రాజ్‌ వెల్లడించారు.

జర్నలిస్ట్‌ ధీరేంద్రను పిప్రీలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించి చంపినట్లు కోలందర్‌ తెలిపాడు. ఇతడి ఇంట్లో 14 హత్యలను ప్రస్తావించిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంకర్‌గఢ్‌కు చెందిన కోలందర్‌ మొదట్లో ఛోకిలోని సెంట్రల్‌ ఆర్డినెన్స్‌ స్టోర్‌లో క్లాస్‌ 4 ఉద్యోగి. తనను తాను రాజుగా భావించే రామ్‌ నిరంజన్‌ పేరులో ‘రాజా’ చేర్చుకున్నాడు. భార్యను సైతం ‘పూలన్‌దేవి’ అని పిలిచేవాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com