ప్రపంచ పాల దినోత్సవం...!

- June 01, 2025 , by Maagulf
ప్రపంచ పాల దినోత్సవం...!

సుమారు 50 సంవత్సరాల క్రితం ఎటువంటి అవగాహన లేని కాలంలో కూడా ప్రతి ఇంట్లోను పాల వాడకం సంవృద్ధిగా ఉండేది. స్వచ్ఛమైన ఆవు, గేదె, మేక, పాలు, పాలఉత్పత్తులైన, పెరుగు, మజ్జిగ, నెయ్యి, విరివిగా వాడేవారు. పశువుల పెంపకం గ్రామాల్లో ఎక్కువ కాబట్టి అక్కడ పుష్కలంగా పాలు దొరికేవి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డెయిరీలు వెలిశాయి.

అయితే, డెయిరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పోషకాల సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్ర భాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఫుడ్‌ మరియు అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌  2001, జూన్‌ 1 నుండి  పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు. పాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికై.. ఏటా జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

పాలపై అవగాహన, పాడి పరిశ్రమ అభివృద్ధిపై వివిధ సభలు నిర్వహించవచ్చు. పిల్లల నుంచి పెద్దలవరకు దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేవచ్చు. ఆరోగ్యానికే కాకుండా.. అందానికి పాడిపరిశ్రమకు కలిగే లాభాలు తెలిపవచ్చు. ఖాళీగా ఉండేవారికి జీవనోపాధిని చూపించవచ్చు. ఎందుకంటే పాలు కేవలం పాడి పరిశ్రమకే కాకుండా.. బ్యూటీకోసం పలు క్రీమ్లు, మాయిశ్చరైజర్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి బ్యూటీ పరిశ్రమలో, కొన్ని రకాల కాస్మోటిక్ చికిత్సలో దీనిని వినియోగించవచ్చు. సోషల్ మీడియాలో కూడా పాలు, పాల ఉత్పత్తులపై అవగాహన కల్పించవచ్చు

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఒక తాజా నివేదిక, భారతీయ ఆహారపు అలవాట్లలో కీలక మార్పులను, దైనందిన పోషక ఎంపికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గోద్రేజ్ జెర్సీ ప్రచురించిన "బాటమ్స్ అప్... ఇండియా సేస్ చీర్స్ టు మిల్క్!" నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు పాలను తమ ప్రధాన శక్తినిచ్చే పానీయంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో, 28 శాతం మంది వినియోగదారులు పాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, 53% మంది వినియోగదారులు సాధారణ పాలకు బదులుగా ఫ్లేవర్డ్ పాలను తీసుకోవడానికి లేదా ఇంట్లో పాలకు సహజమైన ఫ్లేవర్లను కలపడానికి ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో పాలను ఒక సులభమైన మార్గంగా చూస్తున్నారు. 47% మంది తల్లిదండ్రులు పగటిపూట తమ పిల్లలకు పాలను అందిస్తుండగా, 40% మంది ఆడుకునేటప్పుడు వారికి పోషకాలను అందించే పానీయంగా ఉపయోగిస్తున్నారు.

ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు ప్రతి మనిషి రోజూ కనీసం అరలీటరు పైన పాలు స్వీకరించాలని చెప్తున్నారు. అయితే రానురాను పాలు, పాల ఉత్పత్తులు కల్తీబారిన పడ్డాయనేది నిర్వివాదాంశం. 100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన సమతులాహారం పాలు. ముఖ్యంగా ఇవి టీనేజి పిల్లల్లోను, విద్యార్థుల్లోను, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. కల్తీ లేకుంటే పాలకు మించిన పోషకాహారం లేదు. కల్తీ జరగకుండా ప్రభుత్వాలే నిరంతర పర్యవేక్షణ చేయాలి. చిన్న, పెద్ద డెయిరీలు, సహకార సంఘాలు, నష్టాల బారిన పడకుండాను సహకరించాలి.

- డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com