హాస్యనట చక్రవర్తి-సుత్తి వీరభద్రరావు

- June 06, 2025 , by Maagulf
హాస్యనట చక్రవర్తి-సుత్తి వీరభద్రరావు

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం‘ అన్న హాస్యబ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన వరం సుత్తి వీరభద్రరావు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు ఆయన తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అని సినీ పండితులు సైతం తేల్చేశారు. చిత్రమైన పాత్రల్లో నటిస్తూ మరింత విచిత్రమైన అలవాట్లు, సంభాషణలతో చలచిత్ర హాస్యానికి కొత్త నిర్వచనాన్ని అందిచారు. నేడు హాస్యనట చక్రవర్తి సుత్తి వీరభద్రరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

వెండితెరపై సుత్తి వీరభద్రరావుగా సుపరిచితులైన మామిడిపల్లి వీరభద్రరావు 1947, జూన్ 6న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని  ముమ్మిడివరం తాలూకా ఐనాపురం గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన కారణంగా విజయవాడకు బదలీ అవ్వడంతో వీరభద్రరావు బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అక్కడే గడిచింది. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలో  డిగ్రీ పూర్తిచేశారు.

వీరభద్రరావుకు చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. అయితే కాలేజీకి వచ్చే నాటికి అది వ్యామోహంగా మారి కాలేజీ డ్రామా ట్రూపులో భాగమయ్యేలా చేసింది. కాలేజిలోనే ప్రముఖ దర్శకుడు జంధ్యాల కూడా చదువుతూ డ్రామాలు వేసేవారు. అక్కడ మొదలైన వారి పరిచయం సినీ పరిశ్రమలో అద్భుతాలు సృష్టించే దాక సాగింది. చదువైన తర్వాత కూడా విజయవాడలో పలు నాటకాలు వేస్తూ కాలం గడుపుతున్న సమయంలోనే ఆయనకు ఆకాశవాణిలో పనిచేయడానికి అవకాశం వచ్చింది. బాలతంత్రపు రజనీకాంతరావు గారి మార్గదర్శనంలో ఆకాశవాణిలో సైతం నాటకాలు వేస్తూ వచ్చారు. ఇక్కడే అనేక మంది సినీ, నాటక రంగ ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాల వల్ల సినిమాల అవకాశాలు వచ్చాయి.

వీరభద్రరావు నటుడిగానే కాకుండా రచయితగా కూడా రాణించారు. 1981లో జాతర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత ఏడాది తన మిత్రుడైన జంధ్యాల తీసిన నాలుగు స్థంబాల ఆట చిత్రంతో ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఆ సినిమా తర్వాత వరసగా నటిస్తూ కేవలం 8 ఏళ్లకే 200 పైగా చిత్రాల్లో నటించారు. ఈ కాలంలో జంధ్యాల తీసిన ప్రతి చిత్రంలో సుత్తి వారు కనిపించేవారు. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా జంధ్యాల తీసిన బాబాయ్ అబ్బాయ్ చిత్రంలో అయితే హీరోతో సమానమైన పాత్ర పోషించి తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

వేడితెరపై తన అలవాట్లతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడం, అవతలివాళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యేలా గుక్క తిప్పుకోకుండా  మాట్లాడడం, తిట్లు కాని తిట్లతో హింసించడం వీరభద్రరావుకే చెల్లింది. ఎంతటి కఠినమయిన వాక్యానైనా అక్షర, ఉచ్చారణ దోషాలు లేకుండా అనర్గళంగా చెప్పడమే కాకుండా చక్కని నటనను జోడించి ఆ పాత్రకు జీవం పోయడం ద్వారా హాస్య నటనలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. తర్వాత కాలంలో ఆయనలా నటించాలని చూసిన చాలా మంది హాస్య నటులు తేలిపోయారు.

కేవలం హాస్య పాత్రలే కాకుండా స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ ఆస్తి కాజేసే విలన్ పాత్ర పోషించారు. అహనా పెళ్ళంట సినిమాలో తన పిసినారి బావ (కోట శ్రీనివాసరావు) చేష్టలకు మతికోల్పోయే కలెక్టరుగా చిన్న పాత్రలో కనిపిస్తారు. పడమటి సంధ్యారాగం సినిమాలో గుమ్మలూరి శాస్త్రిగారిగారి మాటలు వింటూ, నటన చూస్తుంటే ఆయనకు డబ్బింగ్ చెప్పిన సుత్తి వీరభద్రరావుగారే గుర్తుకొస్తారు. ఇక వివాహ భోజనంబు తర్వాత వచ్చిన ఆయన చివరి చిత్రం చూపులు కలసిన శుభవేళ సినిమాలోని "గుండు పాండురంగం" ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర.

ఘంటసాల పాటలను అమితంగా ఇష్టపడుతూ ఆరాధించే గుండు పాండురంగం ఆరోగ్యానికి మంచిదని తన దగ్గరకు వచ్చిన వాళ్ళనూ, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులనూ కిలోమీటర్ల కొద్దీ నడిపించుకొని వెళ్ళి వాళ్ళను అక్కడే వదిలేసి తన కారులో తిరిగి వచ్చేస్తాడు. ఇప్పటికీ ఎవరయినా "అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందామా" అంటే ఒక్క క్షణం గుండు పాండురంగం గుర్తుకొచ్చి గుండె గుభేల్మంటుంది!

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే గొప్ప హాస్య నటుడిగా వెలుగొందిన వీరభద్రరావు గారు వ్యక్తిగత జీవితంలో చాలా చలాకీగా ఉండేవారు. తన సంపాదనలో సామాజిక సేవా కార్యక్రమాలు బాగా నిర్వహించేవారు. ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో నటించిన ఖ్యాతి వీరి సొంతం.  చూపులు కలసిన శుభవేళ సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరగా, వైద్యం వికటించి 1988,జూన్ 30న తన 41వ ఏట చెన్నైలో కన్నుమూశారు. మరణించి దశాబ్దాలు గడుస్తున్నా ఎన్నో మరచిపోలేని పాత్రల్లో నటించి ఆరోగ్యకరమైన హాస్యానికి ప్రాణం పోసిన ఆయనని తెలుగు ప్రేక్షకులు ఎన్నటికి మరిచిపోరు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com