అద్వితీయమైన 'ఉత్తమ్' నాయకుడు..!
- June 20, 2025
తెలంగాణ రాజకీయాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానం చాలా ప్రత్యేకమైనది. సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికి దేశ వైమానిక దళంలో పనిచేశారు. వైమానిక దళంలో పనిచేస్తున్న సమయంలోనే అనుకోని పరిస్థితుల వల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆరంభం పరాజయంతో మొదలైనప్పటికి ఆ తర్వాత నుండి నేటి వరకు అజేయుడిగా నిలుస్తూనే వస్తున్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలియాస్ నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 1962, జూన్ 20న సూర్యాపేట తాలూకా తాటిపాముల గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చేసందిన పురుషోత్తం రెడ్డి, ఉషారాణి దంపతులకు జన్మించారు. పుట్టింది గ్రామంలోనైనా బాల్యం, హైస్కూల్ వరకు చదువుకున్నది మాత్రం హైదరాబాద్ నగరంలోనే. ఆ తర్వాత ఎన్డీయే పరీక్ష రాసి పూణే డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైపు అడుగులేశారు. డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ నుంచి బీఎస్సి, సికింద్రాబాద్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫెర్ నుంచి పైలెట్ శిక్షణ పొందారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న సమయంలోనే పైలట్‌గా ఎం.ఐ.జి 21, ఎం.ఐ.జి 23 వంటి యుద్ధ విమానాలను అలవోకగా నడిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలర్‌గా సేవలనందించారు. 1991లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉత్తమ్ ఎయిర్ ఫోర్స్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో, తమ సొంత వ్యాపారాల్లో బిజీగా గడపాలనుకుంటున్న సమయంలోనే నల్గొండ కాంగ్రెస్ దిగ్గజ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి వారి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉత్తమ్ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కోదాడలో ఓటమి పాలైన నాటి నుంచి ఆ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తమలో ఒకడిగా కలిసిపోయెవారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో సైతం అదే స్థానం నుంచి రెండోసారి ఎన్నికైన ఉత్తమ్ అప్పటి సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉండేవారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడ్డ హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2009లో మూడోసారిఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
వైఎస్సార్ జానారెడ్డి మధ్య ఉన్న విభేదాల కారణంగా జానారెడ్డిని పక్కనబెట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, ఉత్తమ్‌ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య మంత్రివర్గంలో కూడా ఉత్తమ్ మంత్రిగా ఉన్నారు. కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్స్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. రోశయ్య తర్వాత తన మితుడైన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చేశారు. 2009-14 వరకు గృహ నిర్మాణం మరియు సహకార శాఖల మంత్రిగా ఉన్నారు.
2014లో జరిగిన మొదటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం హుజూర్నగర్ నుంచి నాలుగోసారి ఎమ్యెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా తన భార్య పద్మావతిని కోదాడ నుంచి ఎమ్యెల్యేగా గెలిపించుకున్నారు. 2015లో పొన్నాల లక్ష్మయ్య నుంచి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2020 వరకు కొనసాగారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి, జానారెడ్డిలు ఓటమి పాలైనప్పటికి ఉత్తమ్ మాత్రం ఐదోసారి సునాయాసంగా విజయం సాధించారు. 2018-19 వరకు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నల్గొండ లోక్ సభ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ నుంచి అత్యధిక మంది ఎమ్యెల్యేలుగా ఎన్నికవ్వడంలో ఉత్తమ్, కోమటిరెడ్డి కృషి ఉంది. ఇదే ఎన్నికల్లో ఆరోసారి ఎమ్యెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా తన భార్యాను రెండోసారి కోదాడ నుంచి గెలిపించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన తర్వాత సీఎం రేసులో ఉన్నా అధిష్టానం రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో తన మంత్రివర్గంలో ఇరిగేషన్ మరియు పౌరసరఫరాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణాలో పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ