సేవా మూర్తి-బీఆర్ నాయుడు
- July 01, 2025
"మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. స్వయం కృషి, ఆధ్యాత్మిక నిబద్ధత, పట్టుదలకు ఆయన ప్రతీక. వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ స్పృహ ఉన్న పౌరుడిగా.. మీడియా సంస్థల అధినేతగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన సుపరిచితులే. సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్న ఆయన... ఎవ్వరి నుంచి ఏనాడు ఏమీ ఆశించని మంచి మనిషి. ప్రత్యక్షంగా పరోక్షంగా కక్ష సాధింపులకు దిగినా... కించితైనా వెరవని గొప్ప ధీశాలి. ఇప్పుడు శ్రీవారి సేవలో తరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు... టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
పారిశ్రామిక వర్గాల్లో బీఆర్ నాయుడుగా సుపరిచితులైన బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ దిగువ పూనేపల్లి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.ఆయన తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు, లక్షమ్మ. ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. తిరుపతిలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత 1969-70 ప్రాంతంలో హైదరాబాదులోని బీహెచ్ఎల్లో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లో చురుగ్గా పనిచేశారు. 12 వేల మంది ఉద్యోగులు ఉండే BHEL సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగుల తరఫున సాహిత్య సాంస్కృతిక అంశాలపై ఒక ప్రత్యేక పక్ష పత్రిక కూడా బీఆర్ నాయుడు నడిపారు. ఉద్యోగుల వెల్ఫేర్, ఇతర అంశాలపై సామాజిక స్పృహతో మెలిగేవారు.
నిరంతర కృషీవలుడు, ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉన్న నాయుడు గారు తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. మొదట ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్స్ సెల్లింగ్ వ్యాపారం ప్రారంభించారు. ఆ రంగంలో ఉన్నతమైన వ్యాపార ప్రమాణాలను అంచెలంచలుగా ఎదిగారు. 2000 దశకం మధ్యలో తెలుగునాట మీడియా రంగంలో ప్రవేశించిన పక్షపాత పాత్రికేయతత్త్వం ఆయన్ని మనస్థాపానికి గురిచేసింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజలకు నిస్పాక్షిక మీడియా అవసరాన్ని గుర్తించిన నాయుడు గారు 2007, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున TV5 తెలుగు న్యూస్ ఛానల్ని ప్రారంభించారు.
TV5ను స్థాపించిన నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ, మొక్కవోని దీక్షా నిబద్ధతలతో బాధితుల పక్షాన నిలుస్తూనే ఉంది. ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజల తరపున TV5 న్యూస్ ఛానల్ చేసిన పోరాటాలు మరువలేనివి. పాలకుల ఒత్తిళ్లకు, బెదిరింపులకు, ప్రత్యక్ష, పరోక్ష కక్ష సాధింపులకు దిగినా.. నాయుడు గారు ఏ మాత్రం వెరవకుండా ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ధైర్యంగా నిలబడ్డారు. సవాళ్లకు ఎదురొడ్డి పోరాడారు. నిరంతర వార్తా ప్రసారాలతో తెలుగు ప్రజలకు చేరువైన టీవీ-5ను విస్తరించారు. TV5 కన్నడ, TV5 యూఎస్ఏ, హిందూ ధర్మం లాంటి నూతన ఛానళ్లను స్థాపించారు. ఇలా టీవీ-5 ఛానల్‌ను
ప్రజలకు మరింత చేరువ చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రగతిని, ప్రజాస్వామ్య విలువలను కాంక్షించే నాయుడు గారు.. కేవలం ఓ న్యూస్ ఛానల్ యజమానిగా మాత్రమే ప్రజా సమస్యలను వినిపించేందుకు పరిమితం కాలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం ఉండాలనే ఆకాంక్షను బలంగా సమర్థించారు. అమరావతి రాజధాని కలను గత వైకాపా ప్రభుత్వం తుంచేందుకు చేసిన ప్రయత్నాలన్నిటిని ఏ జంకు లేకుండా నిర్భీతిగా వ్యతిరేకించారు. రైతుల పక్షాన నిలిచి.. వారి బాధలను తెలుగు రాష్ట్రాల ప్రజలకు కళ్లకు కట్టారు.
అమరావతి రాజధాని ఉద్యమాన్ని సమర్ధించినందుకు నాటి ప్రభుత్వం 70 ఏళ్ల వయసులో ఆయనపై రాజద్రోహం కేసులు మోపినా మొక్కవోని ధైర్యంతో ప్రజల పక్షాల నిలిచారు. చివరకు గెలిచారు. ఎన్నోసార్లు ప్రజా వ్యతిరేక విధానాలను టీవీ-5 న్యూస్ ఛానెల్ ద్వారా ఎండగట్టారు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చినా ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న వైఖరి ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయన్ని శిఖరాగ్రన నిలిపేలా చేసింది.
తెలుగుదేశం పార్టీతో నాయుడు గారి అనుబంధం దశాబ్దాల నాటిది. బీహెచ్ఎల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశాన్ని బలంగా కోరుకున్నారు. ఎన్టీఆర్ అంటే ఆయనకు అమితమైన అభిమానం. ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలను వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు అప్రజాస్వామికంగా కూలగొట్టినప్పుడు... సీఎంగా తారక రాముడినే కొనసాగాలని కోరుతూ "ప్రజాస్వామ్య పునరుద్ధరణ" పేరున జరిగిన భారీ సభలు, ర్యాలీల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ తిరిగి సీఎం అవడం కోసం కృషి చేస్తున్న ఆ సమయంలోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుతో శాశ్వత అనుబంధానికి పునాది వేసింది. ఆలా అని చంద్రబాబును ఏనాడు గుడ్డిగా సమర్థించలేదు సరికదా, ఆయన పాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఘాటైన విమర్శలను ఎక్కు పెట్టారు. నాయుడు గారిలో ప్రజల పట్ల ఉన్న కనబరిచే అనురక్తి, ముక్కుసూటి తనంతో వ్యవహరించే తీరు వల్లే బాబు గారికి అత్యంత దగ్గరయ్యారు.
నాయుడు గారి వ్యక్తిగత జీవితానికి వస్తే వారి సతీమణి పేరు విజయలక్ష్మి. ఆమె కూడా బీహెచ్ఈఎల్‌లోనే పనిచేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బొల్లినేని రవీంద్రనాథ్, చిన్న కుమారుడు బొల్లినేని సురేంద్రనాథ్. యూఎస్‌లో ఎంఎస్ చేసిన పెద్ద కుమారుడు TV5 మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్‌గా ఉన్నారు. రెండో కుమారుడు సైతం యూఎస్‌లో ఎంఎస్ ప్రస్తుతం TV5 వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరూ నాయుడు మార్గదర్శనంలో TV5 సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు.
కేవలం ఒక మీడియా అధిపతిగా.. వ్యాపారవేత్తగా.. మాత్రమే కాకుండా సామాజిక సేవ రంగంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. శ్రేయ ఫౌండేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది నిరు పేదలకు గ్రహణమొర్రి, కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నారు. కొవిడ్ సమయంలో ఇబ్బందులు పడిన వందలాది మంది పేదలకు బీఆర్ నాయుడు తన సంస్థ ద్వారా భూరి విరాళాలు అందించారు. ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు. శ్రేయ ఫౌండేషన్ ద్వారా.. సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడైన నాయుడు మొదటి నుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేలా... హిందూ ధర్మ ప్రచార కోసం "హిందూ ధర్మం” పేరుతో 2018లో ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక ఛానల్ స్థాపించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివిధ క్షేత్రాల మహత్యాలను ప్రజల కళ్లకు కట్టారు. దేశంలోని అన్ని పీఠాధిపతుల ప్రబోధాలను హిందూ ధర్మం ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను హిందూ ధర్మం ద్వారా యావత్ తెలుగు ప్రజలకు చేరువచేసే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి హిందూ భక్తుడికీ అత్యంత ప్రీతపాత్రమైన శివపార్వతుల కళ్యాణం నిర్వహణ నాయుడు గారి కుటుంబానికి చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో టీవీ-5, హిందూధర్మం ఛానళ్లు సంయుక్తంగా శివపార్వతులు కళ్యాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాయి.ఈ కార్యక్రమాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా వ్యయ ప్రయాసలకు ఏమాత్రం వెరవకుండా సుప్రసిద్ధ కాశీ మహాక్షేత్రం మొదలు కర్ణాటకలోని దావణగెరె నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 12 ప్రధాన పట్టణాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు పూర్తి ఉచితంగా పూజా, ప్రసాదాలు అందించడంతో పాటు వారిని పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తూ హిందూధర్మ ప్రచారంలో తనవంతు పాత్రను బీఆర్ నాయుడు పుష్కరకాలంగా పోషిస్తున్నారు.
నాయుడు గారిలోని ఈ ఆధ్యాత్మిక దైవ చింతన, సచ్ఛీలతతో కూడిన సుపరిపాలన ఇవ్వగల సమర్థతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి వీరిని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వాణ పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన వ్యాపారాలకు, ఛానల్ బాధ్యతలను పక్కన పెట్టి పూర్తిగా స్వామి వారి సేవకు అంకితం అయ్యారు. తిరుపతికి సమీపంలోనే పుట్టి పెరిగి ఆయన చిన్నతనం నుంచి వేంకటేశ్వరుడి దైవ సన్నిధానంలో జరుగుతున్న కార్యకలాపాలను స్వయంగా తెలిసిన స్థానికుడిగా ఈ పదవికి అన్నివిధాలా అర్హులు అని బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే నిరూపించారు.
టీటీడీ బోర్డు ఛైర్మన్ బాధ్యతలను పూర్తి చిత్తశుద్ధితో నిర్వహిస్తూనే, తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం తనకు అందించే వసతి, వాహన సదుపాయాలను సున్నితంగా తిరస్కరించారు.అంతేకాదు, ప్రమాణ స్వీకారం కోసం తిరుమల వచ్చిన ఆయన.. తిరుమలలో బస చేసినన్ని రోజులు సొంత వాహనాలనే ఉపయోగిస్తానని తెలిపారు. ఆయన సహచరులు, బంధు మిత్రులు బస చేసిన గదుల అద్దెలతో పాటు, భోజనాల ఖర్చును ఆయనే భరించారు.
దేవస్థాన ధార్మిక కార్యకలాపాలు, ఆగమ శాస్త్రాల ప్రాధాన్యత, హిందూ ధర్మ పరిరక్షణ, భక్తుల మనోభావాలు... స్థానికుల అవసరాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. పూర్తి పారదర్శకత, ధార్మిక చిత్తశుద్ధితో స్వామి వారి సేవ చేసేందుకు కంకణ బద్దుడయ్యారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలక మండలిలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లో దర్శనం కల్పించడం ఇందులో అత్యంత కీలక విషయం. శ్రీనివాస సేతు పేరును మళ్లీ గరుడ వారధిగా మార్చడం,అలిపిరిలో దేవ లోకానికి కేటాయించిన 20 ఎకరాల భూమిని తితిదేకి అప్పగించేలా ప్రభుత్వానికి లేఖ రాశారు.
అలాగే, తితిదేలో పనిచేస్తోన్న అన్యమత ఉద్యోగస్థులను సాగనంపాలని పాలకమండలిలో తీర్మానించి.. వారికి స్వచ్ఛంద పదవీ విరమణ కల్పించడం, ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వారిని సర్దుబాటు చేయాలని నిర్ణయించడం. తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడటం పైనా నిషేధం విధించారు.నిబంధనలను అతిక్రమిస్తే కేసులను పెట్టాలని నిర్ణయించారు. తిరుపతిలో స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని, శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని తితిదే అకౌంట్‌లోనే జమ చెయ్యాలని, ప్రైవేట్ బ్యాంకులోని డిపాజిట్లు ప్రభుత్వ బ్యాంకులకు బదలాయించాలని నిర్ణయించారు.ఇవన్నీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి పాలకమండలి భేటీలోనే నిర్ణయించారు.మున్ముందు దేవదేవుడి దర్శనాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని వినమ్రంగా ఆయన ప్రకటించారు.
తితిదే ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్న తితిదే బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు జన్మదినం సందర్భంగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం,ఆశీర్వాదం వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!