గ్లోబల్‌ ఫైనాన్స్‌లో మెరిసిన ఆదిలాబాద్‌ వాసి జావీద్ షా

- July 05, 2025 , by Maagulf
గ్లోబల్‌ ఫైనాన్స్‌లో మెరిసిన ఆదిలాబాద్‌ వాసి జావీద్ షా

లండన్‌: ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సయ్యద్ జావీద్ షా గ్లోబల్‌ స్థాయిలో అరుదైన గౌరవం అందుకున్నారు. ఐఎఫ్ఏ యూకే (IFA UK) నిర్వహించే ప్రతిష్టాత్మక "మెంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ - 2025" లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్‌ 5 ఫైనలిస్టుల్లో ఆయన ఒకరుగా ఎంపికయ్యారు. జూన్ 26న లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్‌లో జరిగిన వార్షిక అవార్డు కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ప్రకటించారు.

సిపిఏ (అమెరికా), సీజీఎంఏ, ఎఫ్‌ఎఫ్‌ఏ (యూకే), ఎఫ్‌ఐపిఏ (ఆస్ట్రేలియా), చార్టెర్డ్ అకౌంటెంట్ వంటి అర్హతలతో విస్తృత అంతర్జాతీయ అనుభవం ఉన్న సయ్యద్ జావీద్ షా ప్రస్తుతం అబుదాబీలో నివసిస్తున్నారు. ఆయన ప్రస్తుతంలో జాన్ క్రేన్ అనే యూకే లిస్టెడ్ మల్టీనేషనల్ సంస్థలో సబ్-రిజినల్ ఫైనాన్షియల్ కంట్రోలర్ & డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రాచ్యం, కాస్పియన్, ఆఫ్రికా మరియు దక్షిణ ఆఫ్రికా కలిపి మొత్తం 27 దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు.

గ్లోబల్ ఫైనాన్స్, కంప్లయెన్స్, గవర్నెన్స్‌ రంగాల్లో ఆయన చేసిన కీలక పాత్రకే ఈ గుర్తింపు లభించింది. సమర్థవంతమైన ఆర్థిక వ్యూహాలు, పారదర్శకత, బాధ్యతాయుత నాయకత్వం, నైతికతతో కూడిన ఆచరణకు ఆయన నిలదొక్కుకుంటున్నారని IFA అవార్డు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన సయ్యద్ జావీద్ షా మాట్లాడుతూ..."ఇంత పెద్ద స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణం. ఇది నా వ్యక్తిగత గౌరవమే కాకుండా, భారత ఆర్థిక నిపుణుల ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం. ఈ గౌరవాన్ని నా స్వస్థలం ఆదిలాబాద్‌, నా రాష్ట్రం తెలంగాణా, నా దేశం భారత్‌, అలాగే నా ప్రస్తుతం నివాసమైన యూఏఈకు అంకితం చేస్తున్నాను" అని చెప్పారు.

అంతర్జాతీయ వేదికపై భారతీయుల ప్రతిభ చాటిన ఘట్టంగా ఈ సంఘటన నిలిచింది. విశ్వవ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఆర్థిక నిపుణులకు ఇది స్ఫూర్తిదాయకమైన మైలురాయిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com