ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు-బొత్స

- July 12, 2025 , by Maagulf
ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు-బొత్స

బొత్స సత్యనారాయణ... తెలుగు నాట రాజకీయాల్లో బాగా పాప్యులర్ నాయకుల్లో ఒకరు. సమైక్య రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన ఈ ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం... రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ ప్రాంతంపై తన పట్టును నిలుపుకోవడం విశేషం. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ మరియు జగన్ మంత్రివర్గాల్లో కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. సత్తిబాబు రాజకీయ చతురతకు తలవొగ్గని నేతలు చాలా తక్కువ. విజయనగరంలో గజపతుల పాలనకు ఎదురెళ్లి విజయ ఢంకా మోగించిన నాయకుడిగా సైతం ఆయన్ని పేర్కొంటారు. పార్టీ ఏదైనా తన ప్రాధాన్యతను నిలుపుకోవడంలో బొత్స అసలు కాంప్రమైజ్ కారు. నేడు ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ మీద ప్రత్యేక కథనం..

సత్తిబాబు, బొత్సగా రాజకీయ వర్గాల్లో సుపరిచితులైన బొత్స సత్యనారాయణ 1958, జూలై 9న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని విజయనగరం పట్టణంలో బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వ్యవసాయం నుంచి వ్యాపారానికి మారిన తూర్పు కాపు సామాజిక ప్రముఖుడు. బొత్స బాల్యం, విద్యాభ్యాసం మొత్తం విజయనగరంలోని సాగింది. విజయనగరం మహారాజా విద్యాసంస్థల్లో చదువుకున్నారు. 1982లో మహారాజా కళాశాల నుంచి బీఏ పూర్తి చేసి కొద్దీ కాలం పాటు కుటుంబ వ్యాపారాలు చూసుకునేవారు.

బొత్స స్వస్థలం నెలిమర్ల దగ్గర్లోని ఒక కుగ్రామం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు నిమిత్తం బొత్స తండ్రి గురునాయుడు కుటుంబాన్ని విజయనగరానికి మకాం మార్చారు. వడ్డీ వ్యాపారంతో మొదలై పలు వ్యాపారాలు చేసేవారు. అలాగే, కంట్రీ లిక్కర్ (సారాయి) వ్యాపారం కూడా వీళ్ళకి ఉండేది. విజయనగరం తూర్పు కాపు సముదాయానికి పెద్దగా వ్యవహరించేవారు. బొత్స తన స్కూల్ ఫైనల్ రోజుల్లోనే రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్ చేరే నాటికి విద్యార్ధి రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యారు. మహారాజా కళాశాల విద్యార్ధి సంఘం ఎన్నికల్లో విజయం సాధించి కార్యదర్శిగా, అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అనుబంధ యువజన కాంగ్రెస్ సంఘంలో చేరారు.

యువజన కాంగ్రెస్ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దశలోనే అప్పటి రాజకీయ ఉద్దండ నేత పెన్మత్స సాంబశివరాజు గారితో సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి. రాజు గారి ప్రోత్సాహంతో విజయనగరం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. తన గురువైన సాంబశివరాజు అండదండలతో 1992లో విజయనగరం జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నికైన బొత్స 1995 వరకు పనిచేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం లేదా భోగాపురం నుంచి పోటీచేయాలని ప్రయత్నించినప్పటికి కొన్ని కారణాల వల్ల సీటు దక్కలేదు. 1995 సహకార బ్యాంకు ఎన్నికల్లో మరోసారి విజయనగరం జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక కాంగ్రెస్ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌గా చరిత్ర సృష్టించారు.

1995-99 వరకు సహకార బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే 1996, 1998 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి నుంచి పోటీ చేసి తెదేపా రాజకీయ దిగ్గజం కొండపల్లి పైడితల్లి నాయుడు చేతిలో ఓడారు. 1999 ఎన్నికల్లో ఆయన మీదే సంచలన  విజయం సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆరోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 5 మంది ఎంపీల్లో బొత్స ఒకరు. 2000 నుంచి 2004 వరకు విజయనగరం జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు చూసిన బొత్స 2003 వైఎస్సార్ పాదయాత్రలో క్రియాశీలకంగా వ్యవహరించి వైఎస్ కళ్ళలో పడ్డారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి ఎమ్యెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ మొదటి మంత్రివర్గంలో తన గురువు సాంబశివరాజును పక్కకు నెట్టి మార్కెటింగ్, పరిశ్రమలు, హోసింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు.

2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి రెండోసారి విజయం సాధించి 2009-14 వరకు వైఎస్, రోశయ్య మరియు కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లో పంచాయితీరాజ్, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. 2011-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా బొత్స పనిచేశారు. యాదృచ్చికంగా ఆయనే చివరి సమైఖ్య ఆంధ్ర అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచారు. 2014లో సమైక్యవాదానికి కట్టుబడనందుకు తీవ్రంగా ఆస్తి నష్టాన్ని చవిచూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడారు. 2015లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

2019 ఎన్నికలకు జగన్ చేపట్టిన పాదయాత్రను విజయనగరం జిల్లాలో విజయవంతం చేసి మంచి మార్కులు కొట్టేశారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి అభ్యర్థిగా మూడోసారి విజయం సాధించి 2019-24 వరకు మున్సిపల్ & పట్టణాభివృద్ధి మరియు మానవవనరుల శాఖల మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లిలో ఓడిన తర్వాత 2024 విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్యెల్సీ ఉపఎన్నికల్లో విజయం సాధించి 2024 నుంచి మండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు.

బొత్స రాజకీయ జీవితాన్ని గమనిస్తే పూసపాటి అశోక్ గజపతి రాజు హవాను తగ్గించేందుకు మరియు సహకార బ్యాంకు ఛైర్మన్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యే దాకా గురువు సాంబశివరాజు తోడ్పడగా, ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఢిల్లీ స్థాయిలో ప్రాపకాన్ని సంపాదించి విజయనగరం జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన భార్య ఝాన్సీని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపి  గెలిపించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్  సీటులో భార్యను కూర్చోబెట్టి జిల్లా పాలనా వ్యవహారాలను తెరవెనుక నుంచి నడిపేవారు. ఇదే సమయంలో తన మేనల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడును యువజన కాంగ్రెస్ జిల్లా వ్యవహారాల్లో క్రియాశీలకం చేశారు. 2004లో మినిష్టర్ అయ్యాక తన బావమరిది మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకు రాజకీయ మరియు ఆర్థిక వ్యవహారాలను అప్పగించారు.

చిన్న శ్రీను క్రియాశీలకం అయిన దగ్గర నుంచి విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబ ఆధిపత్యం మొదలైంది. 2007 బొబ్బిలి పార్లమెంట్ ఉపఎన్నికల్లో బొత్స ఝాన్సీ గెలవడం, అప్పలనాయుడు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడం ఒకేసారి జరిగాయి. 2009 ఎన్నికల సమయానికి బొత్స సోదరుడైన అప్పల నర్సయ్య సైతం తన ఉద్యోగానికి రాజీనామా చేసి గజపతినగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పల నాయుడు సైతం నెలిమర్ల నుంచి, బొత్స ఝాన్సీ విజయనగరం ఎంపీగా గెలిచారు. కుటుంబంలోనే ఒక మినిష్టర్, ఎంపీ, ఇద్దరు ఎమ్యెల్యేలు మరియు మరో బంధువైన బెల్లాన చంద్రశేఖర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా విజయనగరం జిల్లాను అన్ని విధాలా తమ అధీనంలో ఉంచుకున్నారు.2009-14 వరకు ఆ జిల్లాలో బొత్స కుటుంబ పాలన సాగింది. ఈ క్రమంలోనే ఆ జిల్లాకు వచ్చే అన్ని అభివృద్ధి ప్రాజెక్ట్స్ లలో వీరికే ప్రధాన కమిషన్స్ ముట్టజెప్పాల్సి రావడం అనేది ఆనవాయితీగా మారింది. ఒక్క ఐదేళ్లల్లోనే వారి ఆస్తుల విలువ వందల కోట్లకు చేరింది.

బొత్స రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్రలోని  విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో వీరికి తిరుగులేకుండా పోయినప్పటికి శ్రీకాకుళం జిల్లాలో పట్టు సాధించే క్రమంలో ఆ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావుతో వైరం ఏర్పడింది. మొద్లట్లో బాహాబాహీగా ఇరువురిని బలహీనపరుచుకోవాలని చూసి ఇద్దరి అవినీతి వ్యవహారాలను తెదేపా నేతలకు రహస్యంగా సమాచారం ఇవ్వడం వంటివి చేసేవారు. అయితే, తమ ఇద్దరి కోట్లటలో తెదేపా లబ్ది పొందుతుందని భావించి ఇరువురు సయోధ్య కుదుర్చుకొని శ్రీకాకుళం జిల్లాను ధర్మానకు వదిలేసి మిగతా రెండు జిల్లాల్లో తమ పట్టును నిలుపుకుంటూ వచ్చారు.

కాంగ్రెస్ బలహీన పడిన తర్వాత వైసీపీలో చేరిన తర్వాత కూడా ఉత్తరాంద్ర మీద పెత్తనం సాధించేందుకు ప్రయత్నించి బొత్స బాగా  భంగపడ్డారు. 2019లో వైసీపీ అధికారానికి వచ్చిన బొత్స కుటుంబాన్ని విజయనగరానికే విజయసాయిరెడ్డి పరిమితం చేయడంతో కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. 2018లో సాయిరెడ్డిని తప్పించి వైవికి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత బొత్స కుటుంబానికే పెత్తనం బాధ్యతలు అప్పగించి తనకు, పార్టీకి రావాల్సిన ఆదాయాన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే, సాయిరెడ్డి చేసిన అక్రమ వ్యవహారాల కారణంగా పార్టీ పట్ల ప్రజల్లో భారీగా వ్యతిరేకం రావడంతో 2024 ఎన్నికల్లో బొత్స కుటుంబం సైతం ఓటమిని చవిచూసింది.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో బొత్స తన ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. తనతో పాటుగా కుటుంబ సభ్యులను రాజకీయాల్లో పైకి తీసుకొచ్చి వారిని రాజకీయంగా తీర్చిదిద్దారు. నమ్ముకున్న కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులకు బొత్స చేసిన సహాయ సహకారాల కారణంగానే, గెలుపోటములతో సంబంధం లేకుండా ఇప్పటికి తన క్యాడర్ చెక్కు చెదరకుండా ఉంది. కుటుంబ నేపథ్యం  కంటే రాజకీయాల్లో ఎదగాలన్న పట్టుదల, కార్యదక్షత,  సంకల్ప బలమే బొత్సను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. కింద పడిన ప్రతిసారి తన తప్పులను సరిదిద్దుకుంటూ సమకాలీన రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 
     
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com