ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ..రూ.57.43 లక్షలు కొల్లగొట్టేశారు

- July 16, 2025 , by Maagulf
ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ..రూ.57.43 లక్షలు కొల్లగొట్టేశారు

హైదరాబాద్‌: ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఓ వృద్ధురాలిని నమ్మించి రూ.57.43లక్షలను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు.మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి.జూబ్లీహిల్స్‌ కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎఫ్‌ఎక్స్‌ రోడ్‌ పేరుతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్రకటన కనిపించింది.

అదేంటో చూద్దామని ఆమె ఆ ప్రకటనలోని లింక్‌ను క్లిక్‌ చేసింది. అంతే..గుర్తుతెలియని వ్యక్తులు వెంటనే లైన్‌లోకి వచ్చారు. తమ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించారు. ముడిచమురు సంస్థలు, లోహాలు, క్రిప్టోకరెన్సీ(Cryptocurrency), టెస్లా వంటి పెద్ద పెద్ద కంపెనీల ట్రేడింగ్‌ జరుగుతుందని, ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయని నమ్మించారు.వారి మాటలను విశ్వసించిన ఆమెతో బ్యాంకుల నుంచి, క్రెడిట్‌ కార్డు నుంచి రకరకాలుగా పెట్టుబడులు పెట్టించారు.

ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో ఆమెకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ఆమెతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తూ విడతల వారీగా రూ.57.43లక్షల వరకు పెట్టించారు. ఆ తర్వాత లాభాలు గానీ, విత్‌డ్రా గానీ చేసుకునే అవకాశం కల్పించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే మరింత పెట్టుబడులు పెట్టాలని, లేదంటే ఆ డబ్బులు తిరిగి రావని హెచ్చరించారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com