నటకిరీటి-రాజేంద్రప్రసాద్

- July 19, 2025 , by Maagulf
నటకిరీటి-రాజేంద్రప్రసాద్

టాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా అతడికి అతడే సాటి. హాస్య గుళికలతో మ్యాజిక్ చేయగల ఘనాపాటి. నవ్వుల రాజుగా చిత్రసీమను ఏలిన కథానాయకుడు అతడు. హాస్యాన్ని హీరోయిజం స్థాయికి తీసుకెళ్లిన నటుడు రాజేంద్రప్రసాద్‌. భారతీయ చిత్ర పరిశ్రమలో హాస్యం గురించి మాట్లాడుకొంటే రాజేంద్రప్రసాద్‌కి ముందు, తర్వాత అని వేరు చేసి చూడాల్సిందే. ఆయన నటన, ఆయన ఎంచుకొన్న కథలు కథానాయకులకు ఓ కొత్త దారిని చూపించాయి. తరాలు మారుతున్నా ఆయన నవ్విస్తూనే ఉన్నారు. ఆయన నటనకు మెచ్చి ఇచ్చిన బిరుదు ‘నట కిరీటి’. పాత్ర ఏదైనా సరే దానికి తగ్గట్టుగా ఫీలింగ్స్ పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. క్యారెక్టర్ నటులు మాత్రమే హాస్యాన్ని పండిస్తున్న ఆ రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడని నిరూపించిన తొలి నటుడు రాజేంద్రప్రసాద్.ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం

గద్దె రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజేంద్రప్రసాద్ 1956 జూలై 19 తేదిన కృష్ణా జిల్లా గుడివాడకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో జన్మించారు.ఆయన కుటుంబానికి, నటరత్న ఎన్టీఆర్ కుటుంబానికి బాగా పరిచయం ఉండేది.అయితే అతని బాల్యం, యవ్వనం అంతా నిమ్మకూరులోని మహానటుడు ఎన్టీఆర్ ఇంటి ఆవరణలో జరగడమే ఓ భాగ్యం అని చెప్పాలి.ఆ మహానటుడి గాలి రాజేంద్ర ప్రసాద్ కూ సోకబట్టే...నటుడు కావాలనే కాంక్షతో చెన్నపట్నం చేరాడు. అంతకు ముందు ఆయన గూడూరులో సిరామిక్ ఇంజనీరింగ్ చదివి, కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేయడం విశేషం.ఎన్టీఆర్ సలహాతోనే మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు పూర్తి చేసిన తర్వాత 1977లో బాపు దర్శకత్వంలో 'స్నేహం' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆయనకు వెనువెంటనే అవకాశాలొచ్చాయి. మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు మొదలైన సినిమాలు ప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండాలని, కొన్ని పాత్రలకు తనను మాత్రమే తీసుకోవాలనే ఆలోచన దర్శకులకు రావాలని ఓ సందర్భంలో పెద్దాయన ఎన్టీఆర్ అన్నారట. ఆ మాటలు తనను బాగా ఆలోచింపజేశాయని.. అందుకే తన బాడీ లాంగ్వేజ్‌కి నప్పే కామెడీ సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేశానని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు రాజేంద్ర ప్రసాద్.

రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చాక ఒక కల్చర్.. రాకముందు ఒక కల్చర్ అనేది చిత్రసీమలో ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ రోజులలో సినిమాలలో హాస్య నటులు ఉన్నా.. వారితో పూర్తిస్థాయి హాస్యకథా చిత్రాలు తీయడానికి దర్శకులు వెనుకాడేవారు. ఒకవేళ హాస్యభరితమైన సినిమాలు తీసినా, అందులో కూడా టాప్ హీరోలే నటించేవారు. చలం, రాజబాబు, పద్మనాభం లాంటి హాస్యనటులను హీరోలుగా పెట్టి సినిమాలు తీసి దర్శకులు హిట్‌‌లు కొట్టినా, ఎందుకో ఆ సంప్రదాయం తర్వాత ముందు వెళ్లలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక మాత్రం, ఆయన కోసమే దర్శకులు కొత్త కథలు రాసుకొనేవారట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయనకు ఉన్న పాపులారిటీ ఎలాంటిదో. ఒక్కో సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ డజను సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయట.

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, అప్పుల అప్పారావు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, గోల్‌మాల్ గోవిందం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, అత్తింట్లో అద్దె మొగుడు, అహనా పెళ్ళంట  లాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్‌కు కామెడీ జోనర్‌లో తిరుగే లేదని చాటి చెప్పాయి.వరుసగా కామెడీ సినిమాలు చేసినా కూడా, అప్పుడప్పుడు ఎన్నో సినిమాలలో నటనకు స్కోప్ ఉన్న మంచి మంచి పాత్రలూ చేశారు. ముఖ్యంగా నవయుగం, ముత్యమంత ముద్దు, కాష్మోరా, ఎర్రమందారం, ఉదయం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలలో ఆయన ఆర్ద్రతతో నిండిన పాత్రలూ పోషించారు.

రాజేంద్ర ప్రసాద్ తెలుగు, తమిళ భాషలలో నటించడమే కాకుండా.. ఓ హాలీవుడ్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. 'క్విక్ గన్ మురుగన్' పేరిట ఆయన నటించిన ఇంగ్లీష్ పిక్చర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఇండియన్ కౌబాయ్ పాత్రలో ఒక డిఫరెంట్ కామెడీ హీరో రోల్‌ని పోషించారు.

ఎర్రమందారం, ఆ నలుగురు  సినిమాలలో నటనకు గాను రాజేంద్రప్రసాద్ ఉత్తమ నటుడిగా రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నారు. అలాగే జులాయి, శ్రీమంతుడు, మహానటి  సినిమాలలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు.

సహజంగా ఒక వయసు వచ్చిన తర్వాత నటీనటులు విశ్రాంతిని కోరుకుంటారు. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం అందుకు భిన్నంగా తాను నిత్య శ్రామికుడినని చాటుతున్నారు. కొడుకు బాలాజీ వివాహం చేసి... కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత ఆయన చిత్రసీమకు మరింత సేవ చేసేందుకు సిద్ధపడ్డారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలో కొనసాగిన సమయంలో వృద్ధ కళాకారులకు తగిన ఆర్థిక సాయం అందించడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు.

గత దశాబ్దం నుండి రాజేంద్రప్రసాద్ ఎక్కువగా సహాయ పాత్రలే చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాన్నకు ప్రేమతో, సరిలేరు నీకెవ్వరు, దాగుడుమూతల దండాకోర్, సేనాపతి, డ్రీమ్, గాలి సంపత్, ఎఫ్2 లాంటి సినిమాల్లో మాత్రం కాస్త వైవిధ్యమైన పాత్రలను పోషించారు.ఏదేమైనా, కొన్ని తరాల పాటు కామెడీ జోనర్‌లో సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఘనత రాజేంద్రప్రసాద్‌కు కచ్చితంగా దొరుకుతుంది అనడంలో సందేహం లేదు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com