ఎంజీబీఎస్‌లో ఘ‌నంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల 200 కోట్ల ప్ర‌యాణ వేడుక‌లు

- July 23, 2025 , by Maagulf
ఎంజీబీఎస్‌లో ఘ‌నంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల 200 కోట్ల ప్ర‌యాణ వేడుక‌లు

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లోని ఎంజీబీఎస్ ప్రాంగ‌ణంలో బుధ‌వారం మ‌హల‌క్ష్మి-మ‌హిళ‌ల 200 కోట్ల ప్ర‌యాణ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.ఈ వేడుక‌ల్లో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పాల్గొన్నారు. 

మ‌హాల‌క్ష్మి-ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళ‌ల‌ను, ఈ స్కీమ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని వారు స‌న్మానించారు. 200 కోట్ల ప్ర‌యాణాల ద్వారా మ‌హిళ‌లు ఆదా చేసుకున్న రూ.6680 కోట్ల చెక్‌ను ప్ర‌భుత్వం త‌ర‌పున  ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు అంద‌జేశారు.

ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ..మ‌హాల‌క్ష్మి ప‌థ‌కానికి సంబంధించిన జీరో టికెట్ల  రియంబ‌ర్స్‌మెంట్‌ను ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తోంద‌ని అన్నారు. ఈ ప‌థ‌కం ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా బ‌లోపేత‌మ‌వుతోంద‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక 2400 కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేసిన‌ట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2800 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను కొనుగోలుకు టీజీఎస్ఆర్టీసీ క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని తెలిపారు. సంస్థ‌లో ఇప్పటికే 11 శాతం ఎలక్ట్రిక్ బస్సులున్నాయ‌ని చెప్పారు. ఉచిత ప్ర‌యాణ‌మే కాదు.. బస్సులకు మ‌హిళ‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం య‌జ‌మానుల‌ను చేసింద‌ని గుర్తు చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు, అభివృద్ది చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంద‌ని, దాని ద్వారా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతుంద‌ని అన్నారు.  ఆర్టీసీకి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మ‌హాల‌క్ష్మి పథకాన్ని విజయవంతంగా అమ‌లు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. మ‌హిళ‌ల దైనందిన జీవితంలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం భాగ‌మైంద‌ని అన్నారు.  మ‌హిళ‌లు 200 కోట్ల ప్ర‌యాణాలు చేసిన సంద‌ర్భంగా రాష్ట్రంలోని 97 డిపోలు, 324 బ‌స్ స్టేష‌న్ల‌లో ఘ‌నంగా వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. పెరిగిన ర‌ద్దీకి అనుగుణంగా కొత్త బ‌స్సుల‌ను కొనుగోలుతో పాటు నియామ‌కాల‌ను చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌యాణికులకు మెరుగైన ర‌వాణా స‌దుపాయం, ఉద్యోగుల సంక్షేమానికి టీజీఎస్ఆర్టీసీ ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. 

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేసే దిశ‌గా ప్ర‌తి గ్రామం నుంచి మండ‌లానికి, మండ‌ల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త ర‌హ‌దారుల నిర్మాణాన్ని త్వ‌ర‌లోనే ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణ స‌దుపాయం వ‌ల్ల మహిళ‌లు త‌మ ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను ఆదా చేసుకోవ‌డంతో పాటు ఆర్టీసీకి కూడా మేలు జ‌రుగుతోంద‌ని అన్నారు. 

టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్ర‌స్తుతం 7913 బ‌స్సుల్లో అమ‌లు చేస్తున్నామ‌ని, ఆయా బ‌స్సుల్లో ప్ర‌తి రోజు స‌గ‌టున 35 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు రాక‌పోక‌లు సాగిస్తున్నార‌ని తెలిపారు. ఈ ప‌థ‌క అమ‌లుకు ముందు ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) 69% ఉండగా.. ప్ర‌స్తుతం అది 97 శాతానికి పెరిగింద‌ని తెలిపారు.ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 

ఈ వేడుక‌ల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ర‌వాణా శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన,ఆర్టీసీ ఈడీలు మునిశేఖ‌ర్‌, ఖుష్రోషా ఖాన్, రాజ‌శేఖ‌ర్, వెంక‌న్న, ఫైనాన్స్ అడ్వైజ‌ర్ విజ‌య‌పుష్ఫ‌, ఇత‌ర హెచ్‌వోడీలు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com