దివిసీమ గాంధీ-మండలి వెంకట కృష్ణారావు
- August 04, 2025
మండలి వెంకట కృష్ణారావు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన నేతగా గుర్తింపు పొందిన నాయకులు.గాంధేయవాదానికి ఆకర్షితుడై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. దివిసీమ ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి రాజకీయాలను సాధనంగా వాడారు.ఎంపీ, ఎమ్యెల్యే మరియు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజా సేవలో తరించారు. తెలుగు బాషాభివృద్ధికి ఎనలేని కృషి సల్పిన మహనీయుల్లో మండలి ఒకరు. నేడు దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
దివిసీమ గాంధీగా సూపరిచితులైన మండలి వెంకట కృష్ణారావు 1926, ఆగస్టు 4న మద్రాస్ ప్రావిన్సులోని అవిభక్త కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా పల్లెవాడ గ్రామంలో మండలి వెంకట్రామయ్య, మహంకాళమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వెంకట్రామయ్య ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పలు గ్రామాల్లో పనిచేసేవారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు వెంకట్రామయ్య వద్దే ప్రాథమిక విద్య పూర్తి చేశారు.వీరి స్వస్థలం పులిగడ్డ కాగా, వెంకట్రామయ్య హయాంలోనే భావదేవరపల్లి గ్రామంలో స్థిరపడింది. తన మార్గదర్శనంలో మండలి వారు సైతం అవనిగడ్డలో హైస్కూల్ విద్యను పూర్తి చేసి బందరు హిందూ కళాశాలలో ఇంటర్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు.
తండ్రి వెంకట్రామయ్య ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే సమాజ సేవలో పాల్గొనేవారు. తాను పనిచేసిన ప్రతి గ్రామంలో గ్రామీణాభివృద్ధికి పట్టం కట్టారు. ఆయా గ్రామాల్లోని గ్రామస్తులతో కలిసి మౌలిక సదుపాయాల కల్పన చేసేవారు. భావదేవరపల్లి గ్రామానికి మూడు సార్లు వరసగా సర్పంచ్ అయ్యారు. తండ్రిని చూస్తూ పెరిగిన మండలి వారు విద్యార్గి దశలోనే సమాజ సేవ పట్ల మక్కువను పెంచుకున్నారు. బందరులో చదువు కోసం వచ్చిన నాటి దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో సంఘీభావంగా తన చదువుకు స్వస్తి పలికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆనాటి నుండి బందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. రైతు పెద్ద గొట్టిపాటి బ్రహ్మయ్య, మండల వెంకటస్వామి, కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు మరియు కొల్లిపర వెంకట రమణయ్య నాయుడు వంటి ఉద్దండ నేతలతో సన్నిహితంగా ఉండేవారు. వీరందరి ఆశీస్సులతో 1948లో కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు.
1948-57 వరకు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను నిర్వహించిన మండలి 1955లో దివిసీమ ప్రాంతంలో 15 వేల ఎకరాల బంజరు భూములను ఎటువంటి వివాదాస్పదం కాకుండా సామరస్యంగా పేదలకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన గురువైన దేవభక్తుని కోటేశ్వరరావు సహకారాన్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. 1957లో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.1963-69 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో అవనిగడ్డ సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికై నరసింహారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మరియు మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1972-73 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఇదే సమయంలో వచ్చిన జైఆంధ్రా ఉద్యమంలో కాకని వెంకటరత్నంతో కలిసి క్రియాశీలంగా పనిచేశారు.
1974-78 వరకు జలగం వెంగళరావు మంత్రివర్గంలో విద్యా మరియు సాంస్కృతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండలి 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు.1977 దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలను ఆ ప్రాంత ప్రజానీకం ఈనాటికి మరువలేదు. 1978, 1983లలో అవనిగడ్డ నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.1982 చివర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో సహకార మంత్రిగా కొన్ని నెలలు పనిచేశారు.1982లో ఎన్టీఆర్ టీడీపీలోకి రమ్మని ఆహ్వానం పలికినప్పటికి సున్నితంగా తిరస్కరించారు.1985, 1989లలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచే వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
తెలుగు భాషా భివృద్ధి, గాంధేయవాద భావజాలం, దివిసీమ ప్రాంత అభివృద్ధి మరియు సమాజ సేవ వ్యవహారాల్లో మండలి వారు ఎంతో కృషి చేశారు.వారి కృషి ఫలితంగానే ఈనాడు భారతదేశంలో తెలుగు భాషాకు ఆదరణ లభిస్తోంది.గాంధేయవాదిగా ప్రారంభమై చివరి వరకు ఆ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన ఆదర్శమూర్తి మండలి వెంకట కృష్ణారావు 1997, సెప్టెంబర్ 27న అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!