ఏపీ కేబినెట్ సమావేశం..కీలక అంశాల పై చర్చ

- August 06, 2025 , by Maagulf
ఏపీ కేబినెట్ సమావేశం..కీలక అంశాల పై చర్చ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది.రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చ జరిపింది. మహిళల ఉచిత ప్రయాణం, పర్యాటక అభివృద్ధి, కొత్త నిబంధనలు, విద్యుత్ సబ్సిడీలపై ప్రధానంగా దృష్టి సారించారు.

కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం స్త్రీ శక్తి పథకం.ఈ పథకం కింద ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చనుంది.

టెక్ హబ్, ల్యాండ్ పాలసీల పై చర్చ
“ఏపీ లిఫ్ట్” పేరుతో ప్రణాళికలో ఉన్న ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్ పాలసీపై కూడా మంత్రివర్గం కీలక చర్చ జరిపినట్లు తెలిసింది. భవిష్యత్ వృద్ధికి అవసరమైన భూముల వినియోగం, టెక్నాలజీ మద్దతు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

పర్యాటక హోటళ్ల నిర్వహణకు నిర్ణయాలు
పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణకు ఏజెన్సీ ఎంపిక బాధ్యతను సంబంధిత శాఖ ఎండీకి అప్పగించే విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. పర్యాటక వనరుల వినియోగంలో పారదర్శకత, వేగవంతమైన పాలనకు ఇది దోహదపడనుంది. నూతన బార్ లైసెన్స్ పాలసీపై ఉపసంఘం నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూముల ఏర్పాటు, పబ్లిక్ గైడ్‌లైన్స్ ప్రకారం నూతన నియమాలను రూపొందించే దిశగా చర్చ జరిగింది.

సెలూన్లకు ఉచిత విద్యుత్–మీడియా అక్రిడిటేషన్ మార్గదర్శకాలు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులకు ఊతంగా సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించింది. అలాగే, జర్నలిస్టుల కోసం మీడియా అక్రిడిటేషన్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు రూపొందించాలన్న అంశంపైచర్చించి ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com