చిత్తూరు రాజకీయ భీష్ముడు-ఎన్.పి.చెంగల్రాయనాయుడు

- August 06, 2025 , by Maagulf
చిత్తూరు రాజకీయ భీష్ముడు-ఎన్.పి.చెంగల్రాయనాయుడు

దేశ రాజకీయాల్లో చిత్తూరు జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.జమీన్ వ్యతిరేక ఉద్యమం, రైతాంగ ఉద్యమాలకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ జిల్లా నుంచి బొల్లిని మునుస్వామి నాయుడు నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఎందరో  హేమాహేమీలైన నాయుకులు స్వాతంత్య్రం ముందు ఆ తర్వాత కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో అతి పిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకుడు ఎన్.పి. చెంగల్రాయ నాయుడు. నేడు చిత్తూరు రాజకీయ భీష్ముడు ఎన్.పి. చెంగల్రాయనాయుడు 111వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

ఎన్.పి.చెంగల్రాయ నాయుడు పూర్తి పేరు నలగామపల్లి పాపుదేశి చెంగల్రాయనాయుడు. 1914, ఆగస్టు 6న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంలోని బంగారుపాళ్యం తాలూకా నలగామపల్లె గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన వెంకటస్వామి నాయుడు, లక్షమ్మ దంపతులకు జన్మించారు. చెంగల్రాయనాయుడు పూర్వికులు పల్నాడు సీమను పాలించిన నలగామ రాజు సంతతి వారు. పల్నాడు యుద్ధం తర్వాత వారందరూ ఆ ప్రాంతాన్ని వదలి బంగారుపాళ్యం ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. బంగారుపాళ్యం పాలకుల సైన్యంలో సేనాధిపతులుగా, మంత్రులుగా వ్యవహరించారు. స్కూల్ ఫైనల్ వరకు మాత్రమే చదువుకున్నారు.

 చెంగల్రాయనాయుడు తండ్రి వెంకటస్వామి నాయుడు, బాబాయి రామనాయుడులు నలగామపల్లె గ్రామ పరిధిలోని పాపుదేశి వారి కండ్రిగ, పాతూరు, మల్లేశ్వరపురం మరియు మాడు పౌలురు గ్రామాలకు పెద్దలుగా వ్యవహరించేవారు. బంగారుపాళ్యం జమీందారులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను ఒంటబట్టించుకున్న వీరు స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన తర్వాత వ్యవసాయంలోకి దిగకుండా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. రవాణా, సివిల్ కాంట్రాక్ట్స్ చేసి అప్పటి చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా బలవంతుడయ్యారు.                      

స్వతహాగా గాంధీజీ పట్ల అభిమానం ఉండటంతో, ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1938లోనే చిత్తూరు జిల్లా బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో సైతం క్రియాశీలకంగా పాల్గొన్నారు. పాటూరి రాజగోపాల్ నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, అనంతశయం అయ్యంగార్, నగరి వరదాచారి, పలమనేరు కృష్ణన్, నూతి రాధాకృష్ణయ్య, మునుస్వామి నాయుడు మరియు కాళహస్తి సుబ్బరామ దాసు వంటి వారితో కలిసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రకాశం పంతులు, ఆచార్య రంగా, కళా వెంకట్రావు మరియు నీలం సంజీవ రెడ్డి వంటి రాష్ట్ర నాయకులతో సైతం సన్నిహితంగా మెలిగారు. 1946-48 వరకు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

1948లో జరిగిన చిత్తూరు జిల్లా బోర్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాకుండా, జిల్లా బోర్డు అధ్యక్షుడి పదవి కోసం జరుగుతున్న తీవ్ర పోటీని దాటుకొని మరీ బోర్డు అధ్యక్షుడయ్యారు. 1948-52 వరకు బోర్డు అధ్యక్షుడిగా జిల్లా అభివృద్ధికి దోహదపడ్డారు. చిత్తూరు కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన నాయుడు 1952 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసినప్పటికి 1953లో ఎమ్యెల్సీగా ఎన్నికయ్యారు. 1953-55 వరకు ఎమ్యెల్సీగా కొనసాగారు. 1955-62 వరకు వెంపజేరి ఎమ్యెల్యేగా కొనసాగారు. 1962-67 వరకు చిత్తూరు జిల్లా మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967లో చిత్తూరు లోక్ సభకు పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ ఆచార్య రంగా మీద సునాయాసంగా విజయం సాధించి చరిత్ర పుటల్లో నిలిచారు.

చెంగల్రాయ నాయుడు కాంగ్రెస్ పార్టీలో జవహర్ లాల్ నెహ్రూ హవా మొదలైన నాటి నుంచి ఆయన శిష్యుడిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. నెహ్రూ ఆదేశాల మేరకు 1951-53 వరకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. యూ.ఎన్. దేబర్ నాయకత్వంలో జరిగిన ఆవడి కాంగ్రెస్ మహాసభలకు కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలను అందించారు. నెహ్రూ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఏఐసిసి సభ్యుడిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణం తర్వాత ఇందిరా గాంధీకి దగ్గరయ్యారు. 1969లో పార్టీ చీలిన సమయంలో సైతం తన ఆత్మీయ స్నేహితుడైన నీలం సంజీవ రెడ్డి పక్షాన  నిలిచారు. అయితే, కొద్దీ కాలానికే ఇందిరా పక్షానికి వచ్చారు. ఇందిరా ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా తన అసమ్మతిని తెలియజేస్తూ 1978లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1978-80 వరకు జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. 1978-84 వరకు రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. 1980లో సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీల ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి 1986లో రాజకీయాల నుంచి విరమించారు.

నాలుగు దశబ్దాల రాజకీయ జీవితంలో చెంగల్రాయ నాయుడు నీతి, నిజాయితీలే కొలమానంగా రాజకీయాలు చేశారు. సొంత వారే వైరి వర్గాల్లో ఉండి తన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని ప్రయత్నించినా,ఆ ప్రయత్నాలను దైర్యంగా ఎదుర్కున్నారు. రాజకీయాల్లో జనహిత కార్యక్రమాలను నిర్వహించి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహామనిషి చెంగల్రాయ నాయుడు 2012, జనవరి 31న చిత్తూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com