రక్షా బంధన్–పవిత్రమైన తోబుట్టువుల బంధం

- August 09, 2025 , by Maagulf
రక్షా బంధన్–పవిత్రమైన తోబుట్టువుల బంధం

‘రక్షా బంధన్’ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక. సోదరుడు ప్రతి కష్ట సమయంలో చెల్లిని రక్షిస్తాడనే విశ్వాసానికి గుర్తు ఈ పండుగ. శ్రావణ మాసంలో జరుపుకునే ఈ ‘రాఖీ’ పండుగ, సోదర–సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, విశ్వాసం, పరస్పర ఆప్యాయతలను మరోసారి గుర్తు చేస్తుంది.

‘రాఖీ’ అంటే రక్షణ అనే అర్థం.చెల్లి తన అన్నకు రాఖీ కట్టి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటుంది.అన్న ఎల్లప్పుడూ తనకు అండగా, రక్షణగా నిలవాలని ఆకాంక్షిస్తుంది. ఈ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలువబడుతుంది.

పురాణాలలో రాఖీ పౌర్ణమి కథలు...

రక్షా బంధన్ ఉత్సవం తరతరాలుగా వస్తూ, పలు పురాణ కథలతో ముడిపడి ఉంది. విష్ణు పురాణం ప్రకారం, రాఖీ పౌర్ణమిని అప్పట్లో ‘బలేవా’ అని పిలిచేవారు. బలి చక్రవర్తి మహావిష్ణువు భక్తుడు. తన భక్తితో విష్ణువును తన వద్దే ఉంచుకున్నాడు. విష్ణువు లేని వైకుంఠం వెలవెలబోతుండటంతో, శ్రీమహాలక్ష్మి పౌర్ణమి నాడు బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. ఆమె కోరిన వరమేమిటని అడగగా, మహావిష్ణువును తనతో తిరిగి పంపమని కోరింది. బలి చక్రవర్తి వెంటనే అంగీకరించాడు.

మహాభారతంలో మరో ప్రసిద్ధ కథ ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరిస్తున్నప్పుడు ఆయన వేలికి గాయమవుతుంది. ఆ సందర్భంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టి రక్తస్రావం ఆపుతుంది. కృతజ్ఞతగా, కృష్ణుడు ఎప్పటికీ తనను రక్షిస్తానని ద్రౌపదికి మాట ఇస్తాడు. తర్వాత దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు, ఆ మాటను నిలబెట్టుకుంటూ కృష్ణుడు ఆమెను కాపాడతాడు.

సారాంశం...

రక్షా బంధన్ కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన బంధానికి గుర్తు. ప్రేమ, విశ్వాసం, పరస్పర రక్షణ–ఇవే ఈ పండుగ అసలు స్ఫూర్తి.

మా గల్ఫ్ న్యూస్ తరపున మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు....

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com