ఒమన్ లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రణాళిక..!!

- August 31, 2025 , by Maagulf
ఒమన్ లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రణాళిక..!!

మస్కట్: స్కూల్, యూనివర్సిటీ విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2025/2026 కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతోంది. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, తద్వారా ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన విద్యా వాతావరణం, మెరుగైన జీవన నాణ్యతను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెల్త్ డిపార్టుమెంట్ డైరెక్టర్ డాక్టర్ షంసా బింట్ అహ్మద్ అల్ హార్తి తెలిపారు.  విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంచడానికి అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. 

ఒకటి, ఏడు మరియు పదో తరగతి విద్యార్థులకు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకటి మరియు నాలుగు తరగతుల విద్యార్థులకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.  అన్ని గ్రేడ్ విద్యార్థులతోపాటు  బోధనా సిబ్బంది మరియు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్య అవగాహన పెంచేలా కార్యక్రమాలు కూడా తమ ప్రణాళికలో ఉన్నాయని పేర్కొన్నారు. వీటితోపాటు ఆరోగ్య ప్రమోషన్ కార్యక్రమాలు, యువత కౌన్సెలింగ్ సేవలు, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య విద్య, ప్రథమ చికిత్స, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రిఫెరల్ మరియు ఫాలో-అప్, దీర్ఘకాలిక కేసులకు ప్రత్యేక ఫాలో-అప్ ఉంటుందన్నారు. 

యువతను సామాజిక ప్రమాదాల నుండి రక్షించడానికి సైకోట్రోపిక్ పదార్థాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు కూడా ఉన్నాయని తెలిపారు. బాలికల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుతామని, అదే సమయంలో పాఠశాల సిబ్బందికి అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి వీలుగా సీపీఆర్ వంటి పద్ధతులపై ట్రైనింగ్ ఇస్తామని వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com